- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలం చెల్లిన సిలబస్‌తో.. పరీక్షలా?
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ విభాగానికి చెందిన డిపార్ట్‌మెంటల్ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను పరిశీలిస్తే

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ విభాగానికి చెందిన డిపార్ట్‌మెంటల్ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను పరిశీలిస్తే అందులో కాలం చెల్లిన చట్టాలు, ప్రస్తుత పరిస్థితిలో ఉన్న చట్టాలు లేకపోవడం మరీ ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడి సుమారు 11 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన చట్టాలు సిలబస్‌లో ఉండటం శోచనీయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్రానికి సంబంధించిన భూ చట్టాలు, సిలబస్‌లో చేర్చాలన్న ఆలోచన ఇప్పటికీ రెవెన్యూ విభాగానికి రాకపోవడం హాస్యస్పదం.
కొత్తగా ప్రభుత్వ విభాగంలో వివిధ హోదాల్లో చేరిన ఉద్యోగులకు తమ శాఖకు సంబంధించిన చట్టాలు, వివిధ విషయాలపై తగు అవగాహన కలిగి ఉండాలన్న ఉద్దేశ్యంతో అలాగే పై స్థాయి పదోన్నతి పొందాలన్నా, రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంవత్సరానికి రెండుసార్లు శాఖ పరమైన డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహిస్తుంది. అందులో నిర్ణీత గడువులో ఉత్తీర్ణత సాధిస్తేనే ప్రొబేషన్ డిక్లరేషన్ కానీ, పై స్థాయి పదోన్నతికి గానీ అర్హత సాధిస్తారు.
కొత్త చట్టాలు వచ్చినప్పటికీ..
రెవెన్యూ విభాగానికి సంబంధించిన డిపార్ట్‌మెంటల్ పరీక్షలను టీజీపీఎస్సీ రెవెన్యూ చట్టాలకు సంబంధించిన సెలబస్‌తో నాలుగు పేపర్లుగా పార్ట్-1 (code no-18), పార్ట్-2 (code no-27), పార్ట్-3 (code no-43), పార్ట్- 4 (code no-62) తో పాటు జ్యూడిషీయల్‌కు సంబంధించిన CRPC | CPC | Evidence act కు సంబంధించిన సిలబస్‌తో పరీక్షలు నిర్వహిస్తుంది. అయితే, ఒకసారి ఈ సిలబస్‌ను పరిశీలిస్తే అందులో కాలం చెల్లిన చట్టాలు, ప్రస్తుత పరిస్థితిలో లేని చట్టాలు.. మరీ ముఖ్యంగా ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన చట్టాలు ఉండటం శోచనీయం. పేపర్ వారీగా సిలబస్‌ను పరిశీలిస్తే.. పేపర్-1లోని 10 చట్టాలలో 5 చట్టాలు ప్రస్తుత పరిస్థితికి ఏ మాత్రం సరిపోవు. ఇక పేపర్-2లోనూ అంతే. ఇక పేపర్-3లో నైతే జమా బంధీ ప్రక్రియలో తయారు చేసే గ్రామ లెక్కల గురించి సిలబస్ ఉంది. ఇక పేపర్-4లో నైతే చాలా వరకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చట్టాలే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చాలామటుకు కొత్త చట్టాలు అమలులోకి వచ్చాయి. ఉదా. పంచాయితీ రాజ్, మున్సిపల్ చట్టాలు, సివిల్ సప్లయ్ సంబంధించినవి. గ్రామ లెక్కలలో మార్పులు జరిగాయి. ఇక ధరణి పోర్టల్ అమలులోకి వచ్చాక కొన్ని రికార్డులు కేవలం ఆన్‌లైన్‌లోనే జనరేట్ అవుతున్నాయి. ఇన్ని మార్పులు వచ్చాకా కూడా ఇంకా పాత సిలబస్‌ను కొనసాగించడం ఆలోచించదగ్గ విషయం.
చట్టాలకు అనుగుణంగా సిలబస్ లేక..
కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాక వాటిపై పోలీసు డిపార్ట్‌మెం ట్‌లో అవగాహన తరగతులు నిర్వహించడం జరిగింది. అయితే రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో వారికి సంబంధించిన సెక్షన్లపై ఇంత వరకు ఎలాంటి అవగాహన తరగతులు నిర్వహించకపోవడంతో, రెవిన్యూ డిపార్డ్‌మెంట్ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడుతుంది. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే డిపార్ట్‌మెంటల్ పరీక్షలు డిస్క్రిప్టివ్‌గా ఉండేవి. ఇప్పు డు ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉండటం, అందులో 40 మార్కులతో ఉత్తీర్ణతకు అవకాశం ఉండ టం వలన సిలబస్‌ను పట్టించుకోకుండా గుడ్డిగా మార్కులు సాధించుకోవడం అభ్యర్థులకు సులువుగా మారింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, రెవిన్యూ విభాగం వారు ఈ అంశంపై దృష్టి పెట్టి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉన్న చట్టాలకు సిలబస్‌లో రూపొందించడం, అలాగే రెవిన్యూ విభాగానికి చెందిన 4 పేపర్ల బదులుగా వాటిని 2కి కుదించడం, అదే విధంగా జ్యుడిషియల్‌కు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలను సిలబస్‌లో పెట్టడం ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే రెవిన్యూ ఉద్యోగులు కొన్ని హోదాల్లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌గా వ్యవహరిస్తుండటంతో కొత్త చట్టాలపై వారికి కొంత అవగాహన అవసరం.
కొత్త సిలబస్ రూపొందించడానికి..
రెవెన్యూ డిపార్ట్‌మెంటల్ పరీక్షల సిలబస్ మార్చమని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రభుత్వాలను పలుమార్లు కోరినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో పాత సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహిస్తున్నామని, కమిషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ సిలబస్ మార్పు అంశంపై తగు దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే సర్వీస్ కమిషన్ ద్వారా, జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుండి డిప్యూటీ కలెక్టర్లకు నేరుగా నియామకం చేయడంతో పాటు కొత్తగా కాంపెన్సేట్ ద్వారా, ఇతర పద్ధతుల ద్వారా డిపార్ట్‌మెంట్‌కు కొత్తవారు రావడంతో వారికి డిపార్ట్‌మెంట్ చట్టాలపై తగు అవగాహన కలిగి ఉంటే తప్ప, ప్రభుత్వం సజావుగా సాగే అవకాశం ఉండదు. కాబట్టి ఈ సిలబస్ రూపొందించడానికి అనుభవం గల ప్రస్తుతం పనిచేస్తున్న (చట్టాలపై అవగాహన ఉన్నవారు), రిటైర్ అయిన అనుభవం గల అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి తగు సిలబస్‌ని తయారు చేయాలి.
- సురేష్ పోద్దార్,
విశ్రాంత సంయుక్త కలెక్టర్
80080 63605






