- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మౌలికంగా తీసుకుంటున్న విదేశాంగ విధాన నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత సైనికుల త్యాగాల పట్ల గౌరవం లేకపోవడం, విదేశీ ఒత్తిళ్లకు లొంగిపోయిన తీరుపై మోడీ ప్రభుత్వం విమర్శల పాలవుతోంది. అమెరికా మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్‌తో ప్రకటించిన కాల్పుల విరమణపై ఒప్పందం ఇందుకు ఉదాహరణగా నిలిచింది.
ఈ సీజ్‌ఫైర్‌ను అమెరికా ఒత్తిడి మేరకే చేసారని పలువురు విశ్లేషకులు, సైనిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది దౌత్య విజయం కాదని, ఇది బలహీనతగా చూస్తున్నారు. ఈ ఒప్పందం కూడా కేవలం ఒక చిన్న విరా మంగా మిగిలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఎలాంటి హామీలూ లేని ఒప్పందం!
దక్షిణాసియా టెరరిజం పోర్టల్ ప్రకారం 2014–2020 మధ్య పాకిస్తాన్ దాదాపు 5,000 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది. 2021 ఒప్పందం తర్వాత కూడా ఉగ్రవాద దాడులు, అంతర్ముఖంగా గూఢచారులు భారత్ లోకి దొంగచాటుగా ప్రవేశించడం ఆగలేదు. మరి ఇప్పుడైనా ఈ ఒప్పందం శాంతికి దోహదపడిందా? అనే సందేహం మిగిలి ఉంది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత బాలాకోట్‌పై వైమానిక దాడులతో మోడీ తనను బలమైన నాయకుడుగా తన స్థానాన్ని స్థిరపర్చుకున్నారు. కానీ ఇప్పుడు వారి మాటల కంటే చర్యలు చాలా మందికి అస్పష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ నుండి ఉగ్రదాడులను పూర్తిగా ఆపే ఎలాంటి హామీలు లేకుండానే, కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించినట్లు కనిపించడం ప్రభుత్వ బలహీనతలపై అనుమానాలు కలిగిస్తోంది. అంతేకాదు, గతంలో ఎన్నోసార్లు పాకిస్తాన్ కాల్పుల విరమణను తాత్కాలికంగా ఉపసంహరించి తిరిగి ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి మళ్ళీ దాడులకు పాల్పడిన చరిత్రను నిపుణులు గుర్తు చేస్తున్నారు. అందుకే ఈ ఒప్పందం కూడా కేవలం ఒక చిన్న విరామంగా మిగిలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
వ్యూహాత్మక పొరపాటేనా?
అంతర్జాతీయంగా న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్ లాంటి పత్రికలు ఈ ఒప్పందాన్ని అమెరికా ప్రయోజనాల కోణంలో విశ్లేషించాయి. భారతీయ విశ్లేషకులు కూడా ఇలాగే స్పందిస్తున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా “భారత విదేశాంగ విధానం భారత ప్రధాని మోడీ చేతుల్లో కాదు, వాషింగ్టన్ (ట్రంప్) చేతుల్లో ఉందా?” అంటూ ప్రశ్నించారు. దేశీయంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానంలో బలహీనతలను బాహాటంగా ఎత్తి చూపించారు. అని శేఖర్ గుప్తా ఆరోపించారు. లెఫ్టినెంట్ జనరల్ హెచ్.ఎస్. పానాగ్ వంటి పదవీ విరమణ చేసిన సైనికాధికారులు ఈ ఒప్పందాన్ని వ్యూహా త్మక పొరపాటుగా అభివర్ణించారు. దౌత్యపరంగా పటిష్టమైన వ్యూహాలు లేకుండా ఒప్పందం చేసుకోవడం తగదని పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఎమోషన్.. చేతల్లో డొల్లతనం
ఇంతకీ, ఈ ఒప్పందం భారత సైనికుల శౌర్యానికి, త్యాగాలకు అవమానకరంగా (తలవంపులుగా) మారిం దా? 2014 తర్వాత జమ్ము కశ్మీర్‌లో 300కి పైగా సైనికు లు ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ త్యాగాలకు గౌరవం ఇచ్చే విధంగా ఎలాంటి శాశ్వత పరిష్కారం ప్రభుత్వం ఈ ఒప్పందం ద్వారా తీసుకురాలేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎన్నికల సభల్లో మోడీ భావోద్వేగంతో దేశభక్తిని ప్రసంగాల్లో ప్రస్తావించేవారు. కానీ ఆచరణలో మిలిటెన్సీని నిలువరించడంలో తటస్థ వైఖరి తీసుకోవడం వల్ల ఆయన మాటల్లో డొల్లతనం కనిపిస్తుందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. మోడీ అనుచరులు మాత్రం నిన్నటి వరకు పాకిస్తాన్‌పై వీరావేశంతో ఊగిపోయి.. నేడు యుద్ధంతో సాధ్యం కానిది, రాజనీతిలో ఓర్పు వహించడం వల్ల సాధించవచ్చునని శాంతి ప్రవచనాలు వల్లె వేస్తున్నారు. కానీ పాకిస్తాన్‌పై ఆర్ధిక నిషేధాలు, అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచే చర్యలు తీసుకోవడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్న ప్రజా అభిప్రాయాన్ని విస్మరించలేం.
ఒత్తిళ్లకు లొంగే వెనుకడుగు
ఈ సమస్య కేవలం పాకిస్తాన్‌పై వ్యూహ పరమైన వైఖరి విషయంలో వైఫల్యం చెందిన విషయంలో మాత్రమే కాదు.. మోడీ క్రమంగా ట్రంప్‌నకు దాసోహం అంటున్న తీరు చూస్తే మోడీ దృఢ నాయకత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకం పట్టు సడలుతున్న విషయంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఒప్పందం నిజంగా శాశ్వత శాంతికి దారితీస్తే... అది మోడీకి విజయగీతం అవుతుంది. కానీ ఇదే పాకిస్తాన్‌కు మళ్ళీ శక్తి సంపాదించేందుకు అవకాశమిస్తే, ఇది చరిత్రలో ఘోరమైన పొరపాటుగా మిగిలిపోతుంది. ప్రస్తుతం ఉన్న ప్రశ్న ఒక్కటే.. మోడీ నేతృత్వంలోని భారత్ వాస్తవంగా ధైర్యంగా నిలబడి ఉందా? లేక అమెరికా, పాకిస్తాన్ ఒత్తిళ్లకు తలొగ్గిందా? ఈ ప్రశ్నకు సమాధానం ఆయన భవిష్యత్ నాయకత్వాన్ని నిర్ణయించడమే కాకుండా, భారతదేశ స్థానాన్ని కూడా అంతర్జాతీయంగా ప్రభావితం చేస్తుంది.
- డా. డాక్టర్ కిషోర్ ప్రసాద్,
98493 28496






