నిజాంను టార్గెట్ చేసి దుర్మార్గుడిగా చిత్రీకరించారా?

by Disha edit |
నిజాంను టార్గెట్ చేసి దుర్మార్గుడిగా చిత్రీకరించారా?
X

కమ్యూనిస్టు పార్టీలు నిజాంని టార్గెట్‌ చేసి 1972 నుంచి 1998 వరకూ రాస్తూ వచ్చారు. (ఇప్పటికీ రాస్తున్నారు) నిజాంనే ఎందుకు టార్గెట్‌ చేశారంటే, మిగతా ఎవరిని నిందించినా ఊరుకునే పరిస్థితి లేదు. నిజాం ముస్లిం కావడం, ఆయన వారసులెవరూ రాజకీయాలలో లేకపోవడం, మజ్లిస్‌ పార్టీ ఉన్నా (అదీ 1958 నుంచే) హైదరాబాద్‌లోని రెండు మూడు సెగ్మెంట్లకే పరిమితం కావడమూ అన్నీ కలిసి ఆయనను నిందించినా, దానికి కౌంటర్‌ ఇచ్చేవాళ్లెవరూ లేకపోవడం వాళ్ల పనిని సులువు చేసింది. దానికి తోడూ 1967లో ఏడో నిజాం చనిపోవడమూ కలిసి వచ్చింది. (ఉంటే కేసులు వేస్తాడనే భయమైనా ఉండేది. వారసులు తమ మకాంని విదేశాలకు మార్చిండ్రు) మొదటి నుంచి నిజాంని టార్గెట్‌ చేసి దుర్మార్గుడిగా చిత్రించడంతో, అవును ఆయనే అన్నింటికి మూలం అనే విధంగా తమ నిందకు సామాన్య ప్రజలలో లెజిటమసీని తెచ్చుకున్నారు.

17 సెప్టెంబర్‌ విమోచనా? విలీనమా? విద్రోహమా? విధ్వంసమా? విష ప్రచారమా? అనే ప్రశ్నలూ. ఊచకోత, అత్యాచారం, దండయాత్ర, అణచివేత, ఒప్పంద ఉల్లంఘన, సాంస్కృతిక దాడి అనే జవాబులు. శాంతిభద్రతల సంరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, రాచరికానికి ముగింపు అనే కౌంటర్‌ జవాబులు, రజకార్ల దాష్టీకం, కమ్యూనిస్టుల దమనకాండ, దొరల పీడన అనే అభిప్రాయమూ ఉన్నది.

ఇవన్నీ కొంచెం ఎక్కువ, తక్కువ మోతాదులో నిజాలే. అయితే ఎవరికి వారు తమకు అనుకూలమైన విషయాలను గొంతెత్తి చెబుతూ, ప్రతికూల విషయాలను తొక్కిపెడుతున్నారు. ఈ మొత్తం '17 సెప్టెంబర్‌' ఉదంతంలో అందరికన్నా ఎక్కువగా నష్టపోయిందీ, సమాజానికి నష్టం చేసింది మాత్రం కమ్యూనిస్టు పార్టీలు.

అసలు సంగతి

4 జూలై 1946 నాడు జనగామ తాలూకాలోని విసునూరు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా కడవెండిలో ఆంధ్రమహాసభ కార్యకర్తలు ఊరేగింపు తీసిండ్రు. ఈ ఊరేగింపుపై దేశ్‌ముఖ్‌కు తాబేదార్లు (అందులో ముస్లింలూ, దళితులూ ఉన్నారు) కాల్పులు జరపడంతో దొడ్డి కొమురయ్య చనిపోయిండు. ఇదే దొడ్డి కొమురయ్య అన్న దొరల దౌర్జన్యాలను భరించలేక అంతకు ముందే ఇస్లామ్‌ మతాన్ని స్వీకరించిండు. దీంతో ఆంధ్రమహాసభ అప్పటి వరకు రైతు సంఘంగా, గుత్పల సంఘంగా పనిచేస్తున్నది కాస్తా సాయుధ పోరాటానికి తెరలేపింది.

ఇది మొదలు నల్లగొండ, వరంగల్‌ జిల్లాలలో సాయుధ పోరాటం ఊపందుకుంది. పోరాటం రెండు జిల్లాలలోనే ప్రధానంగా సాగినా దానికి 'తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం'గా ప్రచారంలో పెట్టిండ్రు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు 1972లో 'రైతాంగ పోరాటానికి' 25 యేండ్లు నిండిన సందర్భంగా ఆ పార్టీ నాయకులు తమ అనుభవాలను, జ్ఞాపకాలను, స్మృతులను పుస్తకాలుగా వెలువరించిండ్రు. రెండు కమ్యూనిస్టు పార్టీలవాండ్లు తమ తమ అనుకూల దిన పత్రికలు, ప్రచురణ సంస్థల ద్వారా ఇబ్బడి ముబ్బడిగా పుస్తకాలను, కథనాలను ప్రచురించిండ్రు.

మూస రచనలు

ఈ కథనాలలో, రచననలలో ప్రధాన విలన్‌ ఏడో నిజామ్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌. నియంత, దుర్మార్గుడు, ఫాసిస్టు అనే పేర్లతో ఈ రచనలలో ఏడో నిజామ్‌ని వర్ణించిండ్రు. ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. 1946 జూలై 4 నుంచి 1948 సెప్టెంబర్‌ 12 వరకు నిజాం పోలీసులు, రజకార్ల చేతిలో నాలుగు వందల మంది ఆంధ్రమహాసభ కార్యకర్తలు, సామాన్య తెలంగాణ ప్రజలు చనిపోయిండ్రు. అదే సమయంలో 1948 సెప్టెంబర్‌ 13 నుంచి, 1951 అక్టోబర్‌ 21 (పోరాట విరమణ అక్టోబర్‌ 21న కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. అయినా కొంతమంది పోరాటాన్ని కొనసాగించారు) వరకు దాదాపు నాలుగు వేల మందికి పైగా కమ్యూనిస్టు కార్యకర్తలు, సానుభూతి పరులు, ప్రజలు తెలంగాణలో పటేల్‌ సైన్యం / పోలీసుల చేతిలో హతమయిండ్రు. ఇదే సైన్యం సెప్టెంబర్‌ 13 నుంచి 17 వరకు ఐదురోజుల వ్యవధిలో కొన్ని వేల మందిని మహారాష్ట్ర, కర్నాటకలో అత్యాచారం చేసి, చంపి బావులలో వేసిండ్రని నెహ్రూ ప్రభుత్వం నియమించిన సుందర్‌లాల్‌ కమిటీ నివేదించింది.

నివేదికను మరిచారు

ఇక్కడ చెప్పొచ్చే విషయమేమిటంటే కమ్యూనిస్టు పార్టీలు నిజాంని టార్గెట్‌ చేసి 1972 నుంచి 1998 వరకూ రాస్తూ వచ్చారు. (ఇప్పటికీ రాస్తున్నారు) నిజాంనే ఎందుకు టార్గెట్‌ చేశారంటే, మిగతా ఎవరిని నిందించినా ఊరుకునే పరిస్థితి లేదు. నిజాం ముస్లిం కావడం, ఆయన వారసులెవరూ రాజకీయాలలో లేకపోవడం, మజ్లిస్‌ పార్టీ ఉన్నా (అదీ 1958 నుంచే) హైదరాబాద్‌లోని రెండు మూడు సెగ్మెంట్లకే పరిమితం కావడమూ అన్నీ కలిసి ఆయనను నిందించినా, దానికి కౌంటర్‌ ఇచ్చేవాళ్లెవరూ లేకపోవడం వాళ్ల పనిని సులువు చేసింది. దానికి తోడూ 1967లో ఏడో నిజాం చనిపోవడమూ కలిసి వచ్చింది. (ఉంటే కేసులు వేస్తాడనే భయమైనా ఉండేది. వారసులు తమ మకాంని విదేశాలకు మార్చిండ్రు) మొదటి నుంచి నిజాంని టార్గెట్‌ చేసి దుర్మార్గుడిగా చిత్రించడంతో, అవును ఆయనే అన్నింటికి మూలం అనే విధంగా తమ నిందకు సామాన్య ప్రజలలో లెజిటమసీని తెచ్చుకున్నారు.

తాము సాయుధ పోరాటం చేసిన దొరలను, దేశ్‌ముఖ్‌లను కూడా వీళ్లు ఈజీగానే వదిలేసిండ్రు. ఎందుకంటే వాళ్ల వారసులు అప్పటికే రాజకీయాలలో ఉండడం, తమ పార్టీలలో కూడా చేరడంతో వారిపట్ల సాఫ్ట్‌ కార్నర్‌తో ఉన్నారు. ఈ కమ్యూనిస్టులెవరూ సుందర్‌లాల్‌ నివేదికలో ఏముందో ఎన్నడూ రాయలేదు. పటేల్‌ సైన్యం చేతిలో ఇంతమంది చనిపోయిండ్రని ఇదమిద్ధంగా లెక్కలేసి తేల్చి చెప్పలేదు. తమను చంపడానికి వచ్చిన (ఈ విషయాన్ని పటేల్‌ తేల్చి చెప్పిండు. హైదరాబాద్‌ కడుపున కమ్యూనిస్టు కాన్సర్‌ని తొలగించేందుకే పోలీసు చర్య (నిజానికది సైనిక చర్య) జరిపినామని చెప్పిండు.) పటేల్‌ సైన్యం వచ్చి విజేతగా నిలిచిన సెప్టెంబర్‌ 17ని పండుగగా జరుపుకోవడమంటే అంతకంటే అవివేకం మరోటి ఉండదు.

వారికి అదునుగా

1972 నుంచి నిజాంని నియంతగా, దుర్మార్గుడిగా చిత్రిస్తూ వచ్చిన రచనలు ఇవ్వాళ బీజేపీకి మంచి రాజకీయ ఫౌండేషన్‌గా ఉపయోగపడుతున్నాయి. 'నియంతని తలవంచేలా చేసింది మా పటేల్‌' అని బీజేపీ క్లెయిమ్‌ చేసుకుంటోంది. నిజానికి ఇవ్వాళ బీజేపీ ఎంతో కొంత బలం పుంజుకోవడానికి కమ్యూనిస్టులు ప్రధాన కారకులు. ఈ కమ్యూనిస్టులెన్నడూ 'కామ్రేడ్స్‌ అసోసియేషన్‌'ని హైదరాబాద్‌లో స్థాపించింది ముస్లింలు అని ప్రచారంలో పెట్టలేదు. నిజాం అనేది ఒక కుటుంబ పరంపర.

అట్లా నిజాంని నిందించడమంటే మొత్తం ఆ వంశంలోని ముస్లిం పాలకులందరినీ తప్పుపట్టడమే అనే సోయితో మెలగలేదు. ఏడో నిజాం ఉస్మాన్ ఆలీఖాన్‌ చివరి నాలుగేళ్ల పాలనలో దొర్లిన తప్పులకు ఆయన్ని తప్పు పడుతూనే అంతకుముందు విద్యా, వైద్య, లౌకిక విషయాలలో ఆయన ఘనతను ఎన్నడూ చెప్పలేదు. దీంతో నిజాం అంటే ఒక దుర్మార్గుడు, నియంత అనే భావనను ప్రోది చేసిండ్రు. బీజేపీ కోరుకున్నది కూడా ఇదే.

సంగిశెట్టి శ్రీనివాస్

98492 ౨౦౩౨౧

ఇవి కూడా చ‌ద‌వండి

విలీనం వెనక వీరులెందరో

సెప్టెంబర్ 17 పై రాజకీయ పార్టీల భిన్న వాదనలేంటి

Next Story

Most Viewed