సెప్టెంబర్ 17 పై రాజకీయ పార్టీల భిన్న వాదనలేంటి

by Disha edit |
సెప్టెంబర్ 17 పై రాజకీయ పార్టీల భిన్న వాదనలేంటి
X

ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు రాజకీయాలలో భాగంగా, సంతృప్తీకరణ విధానంతోనే ఇంతకాలం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామంటే, ఎక్కడ బీజేపీ బలపడుతుందోనని 'జాతీయ సమైక్యత అమృతోత్సవాలు' అంటూ కొత్త నాటకాన్ని ప్రదర్శించబోతున్నారు. నిజాం నిరంకుశత్వాన్ని పారదోలి, తెలంగాణ ప్రజలు వీరోచితంగా పోరాడి తెచ్చుకున్న స్వాతంత్ర్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. విమోచన కాదు విలీనమంటూ మాట్లాడుతున్నారు.

విమోచనమంటే తిరుగుబాటు చేసి సాధించుకోవడం, విలీనమంటే సమ్మతితో కలిపేసుకోవడం. భారత సైన్యం యుద్ధం చేసి తెలంగాణ ప్రజలకు విముక్తిని ప్రసాదించింది. నిజాం ఉస్మాన్ ఆలీ‌ఖాన్‌ను గద్దె దించడానికి ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. నిజాంకు అండగా రజాకారులు నానా అరాచకాలు సృష్టించారు. జనం గురించి అస్సలు పట్టించుకోకుండా బలవంతంగా వసూలు చేసుకున్న సొమ్ముతో విలాసాలు, జల్సాలు, భోగభాగ్యాలు చేసుకొనేవారు. దీనితో మొదట నల్గొండలో ప్రారంభమైన ఉద్యమం శరవేగంగా నైజాం సంస్థానం అంతటా విస్తరించింది.

ప్రజలను బానిసలుగా చూసి

'నీ బాంచన్ కాల్మొక్త' అంటూ బతుకులీడ్చిన ప్రజలు నిజాం పాలనపై ఎదురు తిరగడానికి అంతులేని దురాగతాలే కారణం. వేల మంది మహిళలు మానభంగాలకు గురయ్యారు. ఉద్యమాలను ఆపడానికి ఉద్యమకారులను చిత్రహింసలకు గురి చేసేవారు. ముక్కుపిండి పన్నులు వసూలు చేసేవారు. ధాన్యాలను బలవంతంగా లాక్కొనేవారు. ఈ భయంకర పరిస్థితిని చూసి వందేమాతరం రామచంద్రరావు ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు లేఖ రాశారు. బైరాన్‌పల్లిలో 108 మందిని కాల్చి చంపారు, నిర్మల్‌లో వెయ్యి మందిని ఉరితీశారు, గాలిపెల్లిని తగులబెట్టారు. ఇలాంటి సంఘటనలు లెక్కలేనివి.

'బాంచె'లు (బానిసలు). సామాజికంగా 'వెట్టి' అమలులో ఉండేది. యార్‌జంగ్ నేతృత్వంలోని ఎంఐఎం బలవంతంగా హిందువులను ముస్లిం మతంలోకి మార్చేది. ఎదురు తిరిగిన వారిపై అరాచకంగా ప్రవర్తించేవారు. సంస్థాన ఉద్యోగాలలో స్థానికులను కాకుండా ఉత్తర భారతీయులను నియమించారు. స్థానిక భాషలను, సంస్కృతులను అణిచివేశారు. ఉర్దూను సైతం హీనంగా చూశారు. తుర్రేబాజ్‌ఖాన్‌, బందగీ, షోయబుల్లాఖాన్‌ లాంటి అనేక మంది ముస్లింలు కూడా నిజాం నిరంకుశ పాలనలో హత్యచేయబడ్డారు. 1942లో షేక్ బందగిని విస్నూరు దొర రాపాక రామచంద్రారెడ్డి అనే భూస్వామికి చెందిన గూండాలు హత్య చేశారు.

అది అవమానకరం

1948 సెప్టెంబరు 17న హైదరాబాదు రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైంది. నిజాం ప్రధాని లాయక్‌ అలీని తొలిగించడమే కాకుండా ప్రజలకు నరకయాతన చూపించిన ఖాసింరజ్వీని అరెస్టు చేశారు. ఆ తర్వాత హైదరాబాదు శాసనసభ రద్దు చేయబడింది. హైదరాబాదు రోడ్ల మీద ఇక తలెత్తుకు తిరగలేమని భావించిన లాయక్‌ అలీ తదితరులు మూటాముల్లె సర్దుకొని పాకిస్తాన్ వెళ్లిపోయారు.

వేల మంది రక్తాన్ని ధారపోసి సాధించుకున్న తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం తెలంగాణ ప్రజలకు అవమానకరం. ఆనాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను కించపరచడమే.


కూరపాటి విజయ్‌కుమార్

బీజేపీ మేడ్చల్ ప్రధాన కార్యదర్శి

99498 88585

Next Story

Most Viewed