దానిపై రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా?.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్

by Ramesh Goud |
దానిపై రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా?.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంలో గాడిదలు గుడ్లు పెట్టవు కానీ సీఎం రేవంత్ రెడ్డి గాడిదలతో కూడా గుడ్లు పెట్టించి, ఐదు నెలల కాలంలో నేను మీకు ఇచ్చేది ఇదే అంటూ.. వాటితో ప్రజల మధ్య తిరగాల్సిన పరిస్థితికి దిగజారిపోయాడని బీజేపీ ఎంపీ అభ్యర్ధి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను గాలికి వదిలేసి, నిన్నటివరకు రాజ్యాంగం అని తిరిగి, మళ్లీ వీడియోలు మార్ఫింగ్ చేయించి, ఇవ్వాళ గాడిద గుడ్డు నెత్తికెత్తుకున్నాడని ఎద్దేవా చేశారు. గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి పోటీ అంటున్నాడని, తెలంగాణ ఉద్యమంలో ఏనాడైనా పాల్గొన్నాడా అని ప్రశ్నించారు. గుజరాత్ నుంచి రావాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ అవినీతికి, మీ ఇటలీ పౌరుషాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ బీజేపీ పౌరుషం సరిపోతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీది ఇటలీ డీఎన్ఏ అని, ఐఎన్‌సీ అంటెనే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని, మళ్లీ బీజేపీ అంటే బ్రిటీష్ నేషనల్ పార్టీ అని కారుకూతలు కూస్తున్నాడని మండిపడ్డారు.

ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ఢిల్లీ బాసులకు సూట్ కేసులు పంపుతున్నారని ఆరోపించారు. అలాగే రిజర్వేషన్లపై ఫేక్ వీడియోలు ప్రచారం చేసిన వారిలో మొదటి ముద్దాయి రేవంత్ రెడ్డేనని, ఈ వీడియోలు సృష్టించిన వారిలో ఎవరున్నా వదిలిపెట్టేది లేదని, జైలుకు పంపుతామని హెచ్చరించారు. బీజేపీకి వస్తున్న ఆధరణను ఓర్వలేక పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్, హోం మంత్రి వీడియో మార్ఫింగ్ రెండు నేరాలేనని.. రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ ప్రచారం చేస్తే.. బీఆర్ఎస్ హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని అన్నారు. వీరి బాగోతాలను ప్రజలు అర్ధం చేసుకొని గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఇంటికి పంపారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుందని సూచించారు.

అలాగే దేశానికి రాహుల్ గాంధీ పాలన వద్దని, ప్రధాని మోడీకి మరోసారి పట్టం కట్టాలని ప్రజలు చూస్తున్న నేపధ్యంలో ఈ రెండు పార్టీలు కుమ్మక్కై విషప్రచారాలు చేస్తున్నాయన్నారు. కేసీఆర్ ఈ ఎన్నికల ప్రచారంలో మాట మార్చాడని, రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ అవినీతి పట్ల మెతక వైఖరి అవలంభిస్తున్నాడని తెలిపారు. ఈ రెండు పార్టీలు ఎమ్ఐఎమ్ మధ్యవర్తిగా అవగాహనతో బీజేపీ ని గెలనీయకుండా ఉండాలనే దుర్మార్గపు ఆలోచనతో ఉన్నాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయోద్దని, మీ దుందుడుకు విధానాన్ని ప్రజలు నమ్మరని తెల్చి చెప్పారు. మీ కారణంగా కాంగ్రెస్ ను అధికారంలోకి వచ్చినట్లు ఊహించుకుంటున్నారని, కానీ కేసీఆర్ మీద కోపంతో, ద్వేశంతో కాంగ్రెస్ కు ఓట్లు వేసి గెలిపించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తోందని, ప్రజలకు కాంగ్రెస్ రాజ్యాంగం కావాలా? లేక రాజ్యాంగాన్ని అనుసరించి ప్రధాని మోడీ పాలన కావాలా? నిర్ణయించుకోవాలన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీలను సీఎం చేస్తామని ప్రకటించిందని.. బీసీలకు 20 సీట్లు కేటాయించని కాంగ్రెస్ బీసీల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రేవంత్ రెడ్డికి కనీసం గాడిద గుడ్డు పెడుతుందో లేదో కూడా అవగాహాన లేకుండా దాన్నే ప్రధాన అస్త్రంగా ఓట్లు అడుగుతున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లలో తెలంగాణకు ఎంత ఇచ్చిందో, బీజేపీ అధికారంలో ఉన్న పదేళ్లలో ఎంత ఇచ్చిందో బహిరంగ చర్చకు రేవంత్ సిద్ధమా అని సవాల్ విసిరారు. బీజేపీ తెలంగాణకు ఏం చేసింతో మీడియా ద్వారా గాడిదగుడ్డు పార్టీకి వివరాలు ఇస్తున్నానని, దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని అన్నారు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారని ఆయన పర్యటనకు సంబందించిన వివరాలను కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

Read More...

రేవంతే మొదటి ముద్దాయి.. ఊచలు లెక్కపెట్టాల్సిందే: కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్


Next Story