- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: పీవోకే స్వాధీనం తప్పదా?
పహల్గాంలో నిస్సహాయులైన 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్ర దాడులపై ప్రతీకార చర్యగా భారత బలగాలు

పహల్గాంలో నిస్సహాయులైన 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్ర దాడులపై ప్రతీకార చర్యగా భారత బలగాలు మే 7వ తేదీ తెల్లవారుజామున ప్రతి దాడి సల్పి నూటికి నూరు శాతం లక్ష్యాలను పూర్తి చేశాయి. మన త్రివిధ బలగాలు సంయు క్తంగా చేసిన ఈ చర్య ఉగ్రదాడిలో సమిధులైన కుటుంబాలకు శాంతింప చేసింది. అంతే కాకుండా ఉగ్రవాద చర్యలతో కుతకుత ఉడుకుతున్న భారత ప్రజల హృదయాలను కూడా ఇది చల్లబర్చింది. మరోసారి ఉగ్రవాద ప్రాయో జిత కుట్రలకు పాకిస్తాన్ తలపడాలన్నా సరే వెనుకా ముందూ ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బాధితుల, ప్రజల ఆగ్రహాన్ని, ఆవేదనను నిజంగానే శాంతింపజేసిన చర్య ఇది.
భారత సాయుధ దళాలు కేవలం 25 నిమిషాల పాటు ఉగ్రవాద సంస్థల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని రఫెల్ యుద్ధ విమానాలు, స్కాల్ప్, హామ్మర్ మిస్సైల్స్ ద్వారా సైనిక దాడులు చేసారు. ఈ దాడులతో పాకిస్తాన్ ఇంకా తేరుకోలేదు.
కఠిన నిర్ణయాలతో పాక్‌కు షాక్!
ఏప్రిల్ 22న జరిగిన సంఘటన తర్వాత దేశ ప్రజలను శాంతింప చేయడానికి ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలను ప్రకటించింది. ముఖ్యంగా 1960లో కుదుర్చుకున్న ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేసింది. పాకిస్తానీ వీసాలను రద్దు చేయడం, సరిహద్దులను మూసివేయడం, రాయబారులను తగ్గించడంతో పాటు తమ గగనతలాన్ని మూసివేసింది. నాటినుండి ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పూర్తి స్థాయిలో కాకున్న ప్పటికీ ఇరుదేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.
ప్రపంచ దేశాల మద్దతు మనవైపే!
ఈ ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా చేపట్టాకా అమెరికాతో పాటు, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, ఇటలీ, ఇరాన్, రష్యా, యూఏఈ, సౌదీ అరేబియా, భూటాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ మొదలైన దేశాలు భారతదేశానికి బాసటగా నిలబడగా ఐక్యరాజ్యసమితి ఈ సంఘటనను ఖండిస్తూనే సంయమనం పాటించాల్సిందిగా కోరింది. అయితే ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదాన్ని నిర్ములించడంలో విఫలం అయిందని భారత్ అభిప్రాయపడింది. ఐతే, చైనా కూడా పూర్తి స్థాయిలో పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చే పరిస్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదు. ఇదివరకే మనకు పాకిస్తాన్ దేశంతో నాలుగు సార్లు 1948, 1965, 1971, 1999లో యుద్ధం చేసిన అనుభవం ఉంది. అయితే, గతంలో కన్నా భిన్నంగా పాకిస్తాన్‌లోని మూడు ప్రాంతాలలోని ఉగ్రశిబిరాలపై, పీఓకేలోని ఉగ్ర శిబిరాలపై భారత్ సైనిక ఆపరేషన్ చేసింది. పాకిస్తాన్ సైనిక స్థావరాలపై గాని, పాకిస్తాన్ పౌరులపై గాని దాడులు చేయలేదు, అందుకే ప్రపంచంలోని అన్ని దేశాలు మన చర్యను ప్రశంసించాయి. అలాగే, చైనా కూడా భారత్ చర్య విచారకరం అని పేర్కొందే తప్ప వ్యతి రేకించలేదు.
ముందస్తు చర్యగా మాక్ డ్రిల్
మనం అంతర్జాతీయంగా మద్దతు కోసం మన మిత్ర దేశాలతో చర్చలు జరుపుతుండగా మరోవైపు పాకిస్తాన్ మాత్రం ఆధీన రేఖ వెంబడి కాల్పుల జరుపుతుంది. అందుకే ముందస్తు చర్యగా మన ప్రభుత్వం ఆపరేషన్ అభ్యాస్‌గా పిలువబడే అతి పెద్ద సైనిక డ్రిల్ దేశవ్యాప్తంగా ఢిల్లీ, హైదరాబాద్, వైజాగ్, తారాపూర్ నగరాలతో సహా 244 జిల్లాలో నిర్వహించింది. హైదరాబాద్ భారతదేశానికి వ్యూహాత్మకంగా నగరం. ఇక్కడ DRDO, మిధాని, HAL, NFC, ఏరోస్పేస్ వంటి రక్షణ, పరిశోధన సంస్థలతో పాటు, ముఖ్యమైన IT సంస్థలున్నాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న నగరం కావున హైదరాబాద్‌పై దాడులు జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తుంది కేంద్రం.
పీవోకే స్వాధీనం తప్పదా?
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ తమదే అని దానిని తిరిగి పొందుతామని గత కొంత కాలంగా మన ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఆ దిశగానే మన ప్రభుత్వం అడుగులు వేసే అవకాశం ఉంది. గతంలో మనం సర్జికల్ దాడులు చేశాం. రెండు దేశాలు కూడా అణ్వాయుధాలను కలిగిన దేశాలు.. అయితే వీటిని ఉపయోగించే అవకాశాలు మాత్రం తక్కువే. పాకిస్థాన్ ఒకవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో అంతర్గత వేర్పాటు పోరుతో సతమతమవుతుండగా, మరోవైపు జనావాసాలపై ఉగ్రవాదుల దాడులు, దానికి తోడు ఆర్ధిక సమస్యలు అలాగే ఆఫ్ఘానిస్తాన్‌తో పోరుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో భారతదేశంతో యుద్ధం చేయడం సాధ్యం కాదు. దానికి ప్రపంచ దేశాల మద్దతు కూడా ఉండదు. ఇది గ్రహించి ఉగ్రవాదులను ఏరివేయడంలో కీలక లక్ష్యాల సాధన వైపు భారత్ అడుగులేయాలి.
డాక్టర్ సురేందర్ అడికి,
అసోసియేట్ ప్రొఫెసర్,
94404 49339






