- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇరాన్ ప్రజాస్వామిక దేశమైతే గల్ఫ్ దేశాలకు శాపమా? మధ్య ప్రాచ్య రాజకీయాల్లో కొత్త భయం..!
ఇరాన్‌లో రాజకీయ మార్పులు వస్తే గల్ఫ్ రాజ్యాలకు ఎందుకు భయం? ప్రజాస్వామ్యం, సైనిక పాలన, చైనా ప్రభావం వంటి అంశాలు మధ్యప్రాచ్య రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాయో విశ్లేషణ.

మధ్యప్రాచ్యం ఇప్పుడు అగ్నిపర్వతంలా మండుతున్నది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ప్రపంచం దృష్టి చమురు ధరలపై ఉంటే, పక్కనే ఉన్న అరబ్ దేశాల (గల్ఫ్ రాచరిక వ్యవస్థల) దృష్టి మాత్రం తమ సింహాసనాల మనుగడపై ఉంది. ఇరాన్‌లో వస్తున్న మార్పు తమకు మేలు చేస్తుందని పైకి అనుకుంటున్నప్పటికీ, లోలోపల మాత్రం అరబ్ పాలకులు పూర్తి అభద్రతా భావంలో ఉన్నారు..
ఇరాన్‌లో ప్రస్తుతం ఉన్న మత గురువుల పాలన కూలిపోయి, అక్కడ ప్రజాస్వామ్య పాలన వస్తే అది అరబ్ దేశాలకు ‘వరం’ కంటే ‘శాపం’ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
ఇరాన్ ప్రజాస్వామిక దేశమైతే..?
ఇరాన్ వంటి పెద్ద దేశంలో ప్రజలు పోరాడి ప్రజా స్వామ్యాన్ని తెచ్చుకుంటే, ఆ స్ఫూర్తి గల్ఫ్ వీధుల్లోకి చేరడానికి ఎంతో సమయం పట్టదు.. ఇన్నాళ్లూ అరబ్ రాజులు తమ ప్రజలకు పన్నులు లేని పాలన, ఉచిత విద్య, వైద్యం, భారీ సబ్సిడీలు ఇచ్చి ‘రాజకీయ హక్కుల’ గురించి అడగకుండా చూసుకుంటున్నారు. సౌదీలో పెట్రోల్ లీటర్‌కు 20 రూపాయలకంటే తక్కువే. యూఏఈలో విద్యుత్ దాదాపు ఉచితం. ఇరాన్‌లో మహిళలు హిజాబ్‌పై పోరాడుతూ ప్రజాస్వామ్య డిమాండ్లు చేస్తుంటే, ఆ ప్రభావం గల్ఫ్ యువత లోకి వెళ్తే ఎలా అన్న భయం వెంటాడుతున్నది. ప్రస్తుతం సోషల్ మీడియాలో #MahsaAmini హ్యాష్‌ట్యాగ్ గల్ఫ్ యువకుల్లో వైరల్ అవుతోంది.. పైగా గల్ఫ్ దేశాల్లో 60 శాతానికి పైగా జనాభా 30 ఏళ్లలోపు వారే కావడంతో ప్రజాస్వామ్య ఉద్యమాలు ఎక్కడ మొదలవుతాయోనని వారు ఆందోళన చెందుతున్నారు.. అందుకే ఇరాన్‌లో మార్పును కోరుకుంటున్నారే తప్ప, అది ‘ప్రజాస్వామ్యం’ రూపంలో ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా అనుకోవడం లేదు. పైగా ఇరాన్ ప్రజాస్వామ్యమైతే ఓపెక్ ప్లస్‌లో మార్కెట్ షేర్ పెరిగి, సౌదీ ఆయిల్ ధరలు పడిపోతాయి.. ఫలితంగా రాజుల ఆదాయం సగానికి తగ్గుతుందన్న ఆందోళన కూడా ఉన్నది.
సైనిక పాలనా ప్రమాదమే..!
ఒకవేళ ఇరాన్‌లో ప్రభుత్వం కూలిపోయి, అధికారం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వంటి సైనిక శక్తుల చేతిలోకి వెళ్తే పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందని అరబ్ దేశాల ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం ఉన్న మత గురువుల ప్రభుత్వా నికైనా కొన్ని దౌత్యపరమైన పరిమితులు ఉన్నాయి. కానీ, సైన్యం చేతిలోకి క్షిపణులు వెళ్తే, వారు మరింత దూకుడుగా వ్యవహరించే ప్రమాదం ఉన్నది. తద్వారా ప్రాంతీయంగా అశాంతి మరింతగా తీవ్రస్థాయికి చేరేందుకు ఆస్కారం ఉన్నది. సైనిక నియంతృత్వం ఉన్న దేశం ఎప్పుడూ తన ఉనికి కోసం పొరుగు దేశాలతో ఘర్షణ పడుతూనే ఉంటుంది. ఇది గల్ఫ్ దేశాల వ్యాపార సామ్రాజ్యాలకు (ముఖ్యంగా దుబాయ్ వంటి నగరాలకు) చావు దెబ్బ వంటిది.
చైనా పట్టు బిగిస్తే..
మరోవైపు, ఇరాన్‌పై పశ్చిమ దేశాల పట్టు సడలి, అది పూర్తి స్థాయిలో చైనా చేతుల్లోకి వెళ్లడం కూడా అరబ్ దేశాలకు ఇష్టం లేదు.. ఇరాన్‌లోని సహజ వనరులు, చమురు క్షేత్రాలను చైనా తన అదుపులోకి తీసుకుంటే, పశ్చిమాసియాలో చైనా ‘బాస్’ లా మారుతుంది. అమెరికాతో సంబం ధాలు ఉన్న అరబ్ దేశాలకు, చైనా అనుకూల ఇరాన్ ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది. చమురు రంగంలోకి చైనా దిగితే ఓపెక్ ప్లస్ దేశాల ఆటలకు చెక్ పడినట్టు అవుతుంది. అయితే, పాత పగలు మళ్లీ రాజుకుని.. మధ్యప్రాచ్యం రావణకాష్టంలా రగిలే ప్రమాదం కూడా లేకపోలేదు.
యుద్ధానికి దూరంగానే..
అమెరికా తానా అంటే తందానా అనే గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో కనీసం చేయి కాదు కదా.. వేలు కూడా పెట్టడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ స్వప్రయోజనాల కోసం చేస్తున్న యుద్ధంలో బలిపశువులుగా మారేందుకు సిద్ధంగా లేమని కరాఖండీగా చెప్పేస్తున్నాయి. అందుకే ఇరాన్ తమ దేశాల్లోని అమెరికా బేస్ పై దాడులు చేస్తున్నా.. అంటీముట్ట నట్టుగానే ఉంటున్నాయి. ముఖ్యంగా దుబాయ్‌లో పౌర వాసాలు, హోటళ్లపై దాడులు చేస్తున్నా.. నోరు మెదపడం లేదు. ఒకవేళ ఇరాన్‌తో తలపడితే భవిష్యత్తులోనూ ఆ దేశంతో శత్రుత్వం కొనసాగించాల్సి వస్తుందని.. అది ఎప్పటికైనా ముప్పేనని భావిస్తున్నారు. అయితే, ఇక్కడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ బెడిసికొట్టింది. యుద్ధంలో రెండు రోజులు పోయాక గల్ఫ్ దేశాలన్నీ ఇరాన్ పై యుద్ధం చేస్తాయి.. అప్పుడు అమెరికా దూరం నుంచి చూస్తూ ఉండొచ్చన్న ట్రంప్ ఆలోచన బూమరాంగ్ అయ్యింది. యుద్ధంలో రోజుకు మిలియన్ల కొద్దీ డబ్బు ఖర్చు అవుతుండడంతో ఇప్పుడు ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో తెలియక జుట్టు పీక్కుంటున్నాడు.
ఈ మూడే కీలకం..
అరబ్ దేశాల దృష్టిలో ఇరాన్ ఒక ‘సాధారణ దేశం’గా మారాలి. ఇందుకు ‘పొరుగు దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. హౌతీలు, హెజ్బొల్లా వంటి ప్రాక్సీ గ్రూపులకు మద్దతు ఆపాలి.. అణు కార్యక్రమాన్ని పక్కన పెట్టాలి’.. అన్న మూడు షరతులు పెడుతున్నాయి. ఈ మూడు పనులు చేస్తే ఇరాన్‌లో ఎవరు పాలించినా వారికి అభ్యంతరం లేదు. కానీ, అది ప్రజాస్వామ్యంగా మారి తమ రాజ్యాలకు ముప్పు తేవడం గానీ, సైనిక రాజ్యంగా మారి యుద్ధాలు చేయడం గానీ, లేదా చైనా చేతుల్లోకి వెళ్లి కొత్త యజమానిని తీసుకురావడం గానీ వారికి సమ్మతం కాదు. పశ్చిమాసియా రాజకీయ చదరంగంలో ఇప్పుడు అరబ్ దేశాలు చేస్తున్నది ‘తమను తాము కాపాడుకునే’ ప్రయత్నమే! అంతిమంగా మధ్యప్రాచ్యంలో ప్రజాస్వామ్యం అన్నది ఎడారిలో ఎండమావే అన్నది కఠోర వాస్తవం.
-హరీశ్ ఎస్పీ






