- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్తమాకు చేప ఔషధమేనా?
మృగశిర నెల ప్రారంభం కాగానే ఆస్తమా రోగులు హైదరాబాద్‌లోని బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదం కోసం ఎదురుచూస్తారు..

మృగశిర నెల ప్రారంభం కాగానే ఆస్తమా రోగులు హైదరాబాద్‌లోని బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదం కోసం ఎదురుచూస్తారు.. ఏటా కొన్ని లక్షల మంది ఈ ప్రసాదాన్ని భారీ క్యూలైన్లలో నిలబడి స్వీకరిస్తారు. ఉబ్బసం (ఆస్తమా) వ్యాధిగ్రస్తులకు ఇది దివ్య ఔషధంగా భావిస్తారు. కొన్ని దశాబ్దాలుగా వాళ్లు ఈ ప్రసాదాన్ని ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు.. అయితే ఈ ప్రసాదం పలు వివాదాలకు కారణం అవుతోంది. చేప ప్రసాదానికి ఎలాంటి శాస్త్రీ యత లేదని కొందరు, అద్భుతంగా పనిచేస్తుం దని మరి కొందరు వాదిస్తున్నారు. ఇంతకీ ఇది మెడిసినా.. లేక ప్రసాదమా..?
చేప ప్రసాదం పంపిణీని జన విజ్ఞాన వేదిక మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎలాంటి శాస్త్రీయ నిర్ధారణ లేకుండా చేప ప్రసాదాన్ని అక్రమంగా పంపిణీ చేస్తున్నా రనేది సంస్థ ఆరోపణ. దీనిపై 2013లో హైకోర్టును ఆశ్రయించింది. అప్పుడు దీన్ని ‘మందు’ అని పిలవద్దని హైకోర్టు ఆదేశించింది. దీంతో బత్తిన సోదరులు దీన్ని ‘చేప ప్రసాదం’గా వ్యవహరించటానికి అంగీకరించారు.. అయితే ఈ చేప ప్రసాదం తయారీ, పంపిణీ పరిశుభ్రమైన వాతా వరణంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో జరపాలని కోర్టు ఆదేశించింది. కానీ దీనిని ఎక్కడా పాటించడం లేదు. ఈ ప్రసాదంలో ఉబ్బసాన్ని తగ్గించే 'మందు' ఏదీ లేదని ప్రయోగశాలలో ప్రయోగపూర్వకంగా నిర్ధారించబడినది. అయినా ప్రభుత్వం కోట్లు ఖర్చుపెట్టి ఏర్పాట్లు చేయగా.. బత్తని సోదరులు నేడు, రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈ మందు పంపిణీకి సిద్ధమయ్యారు.
ఈ ప్రసాదంలో..
వాతావరణ పరిస్థితులు, శరీరతత్వం, వయసు రీత్యా మానవులకు అనేక రోగాలు చుట్టుముడుతుంటాయి. వీటికి నేడు ఆధునిక వైద్యం ఉంది. వర్షాకాలం ప్రారంభం కాగానే ఆస్తమా వ్యాధిగ్రస్తులు అనేక అవస్థలు పడుతుంటారు.. ఈ సమయంలో ఉపశమనం కోసం ఏ మందు ఇచ్చినా వేసుకునే బలహీనత వారిలో ఏర్పడుతుంది. ఈ క్రమంలో బత్తిని సోదరులు బతికున్న చేపలను పసుపు పేస్ట్‌తో పూసి ప్రసాదంగా నోట్లోకి వదులుతారు.. అయితే ఈ ప్రసాదం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని వైద్యులు చెబుతున్నారు. పైగా ఒకరి నోట్లో చేపను పంపిన తర్వాత అదే చేత్తో మరొకరికి నోట్లో చేప పెడితే దాని వలన అనేక రకాల వైరల్, బ్యాక్టీరియా వ్యాధులు సోకి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
ప్రభుత్వాలు ప్రోత్సహించకూడదు!
ఆస్తమా అనేది దీర్ఘకాలమైన జబ్బు, తొలిదశలో గుర్తిస్తే చికిత్స సులువవుతుంది. వీటిని తెలుసుకొని ఆధునిక చికిత్స పొందవలసిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఆస్తమాకు ప్రస్తుతమున్న వైద్య విధానంలో ఉపశమనమే తప్ప పూర్తి నివారణ తేలిక కాదంటారు. కావున ఈ ప్రసాదం పంపిణీపై ప్రజాధనాన్ని వృథా చేయవద్దు. మత్స్య శాఖ చేప పిల్లల సరఫరాను నిలిపివేయాలి. దానికి బదులు ప్రభుత్వం ఆస్తమా వ్యాధికి అన్ని జిల్లా కేంద్ర, ఏరియా ఆసుపత్రిలో చికిత్స శిబిరాలను ఏర్పాటు చేయాలి. ఇటీవల భారతదేశంలో సూడో సైన్స్ (నకిలీ సైన్సు) ప్రచారం విస్తృతంగా పెరుగుతోంది. పతంజలి ఉత్పత్తులపై తప్పుదారి పట్టించే ప్రకటనలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఇలాంటివి ప్రజలను గందరగోళానికి గురిచేస్తాయి. కావున గుడ్డిగా నమ్మడం, మూఢ నమ్మకాలు ప్రోత్సహించడం ప్రభుత్వ విధానంగా ఉండకూడదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 51A(H) ప్రకారం శాస్త్రీయ దృక్పథాన్ని మానవ జిజ్ఞాసని, పరిశోధన, సంస్కరణ స్ఫూర్తి పెంపొందింపచేయాలి.
చేపలు ఈ రోజే తినడమేంటి?
మృగశిర కార్తె ప్రారంభం రోజు ప్రజలు చేపలు విపరీతంగా తినడానికి తీసుకువెళ్తారు. ఇది కూడా ఒక గుడ్డి నమ్మకమే.. నిజానికి చేపలు తినడం మంచిదే కానీ, ఆ రోజు తినడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుందనుకోవడం పొరపాటే. కావున ప్రజలు శాస్త్రీయంగా ఆలోచించడం నేర్చుకోవాలి. ప్రపంచంలో ఎక్కడా లేని చేప ప్రసాదం ఇక్కడే ఎలా చలామణి అవుతుందో ఒక్కసారి ఆలోచించాలి.. ప్రజలు ప్రశ్నించక గుడ్డిగా నమ్మితే ఇలాంటి సాంప్రదాయ వైద్య విధానాలకు ఆదరణ పెరిగి భారత దేశంలో విపరీతంగా మార్కెట్ అవుతున్నాయి. ఇవి వికటించి అక్కడక్కడా కొంతమంది చనిపోతున్నారు కూడా. ప్రజలు కూడా ఆధునిక వైద్యాన్ని నమ్మాలి, డాక్టర్ల సూచనలు పాటించాలి. అప్పుడే ఇలాంటి సైన్సు లేని మందులకు, ఆచారాలకు మనం దూరంగా ఉంటాము.
(నేడు, రేపు చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా)
- సంపతి రమేష్ మహారాజ్
79895 79428






