విద్య హక్కా.. అమ్మకానికి కొనే వస్తువా?

by Ravi |   (  Updated:2025-06-03 01:15:11  IST  )

ఒక దేశం పురోగతిని నిర్ణయించే అత్యంత కీలకమైన అంశం.. ‘విద్య’. కానీ, ఆ విద్యే ఇప్పుడు పేదలపై పెనుభారం అవుతోంది.

విద్య హక్కా.. అమ్మకానికి కొనే వస్తువా?
X

ఒక దేశం పురోగతిని నిర్ణయించే అత్యంత కీలకమైన అంశం.. ‘విద్య’. కానీ, ఆ విద్యే ఇప్పుడు పేదలపై పెనుభారం అవుతోంది. ప్రతి ఏడాది రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం అనగానే ప్రారంభమయ్యే ఫీజుల దండయాత్ర, నిబంధనలు లెక్కచేయని ప్రైవేట్ స్కూళ్ల వ్యవహారం ఒక క్రమంగా ఏర్పడిన విద్యా వ్యాపార మాఫియా రూపాన్ని స్పష్టంగా చూపుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం అసమర్థతతోనే కాదు, అమాయకత్వంతోనూ విలవిల్లాడుతున్నారు. సమాజం నడిచే దారిలో అంధకారపు గోడలా నిలిచిన ఈ విద్యా దోపిడీ ప్రభుత్వ అధికారుల మౌనంతో మరింత బలపడుతోంది. విద్యను వాణిజ్యమయ్యే చీకటి గుహల నుంచి వెలికి తీయాల్సిన బాధ్యత మనందరిదీ.

నిబంధనలు ఉన్నా, నిబంధించే వాళ్లే లేరనే అసహాయత తల్లిదండ్రుల కన్నీళ్లలో ప్రతిబింబిస్తోంది. ‘విద్యా హక్కు చట్టం’ ఉన్నా, ఆ హక్కు కేవలం పుస్తకాలకే పరిమితమైంది. ప్రస్తుతం విద్య, హక్కుగా కాకుండా, ధనవంతులకు మాత్రమే దక్కే విలాస వస్తువుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో, ప్రశ్నించాల్సిన సమయం ఇదే.. ప్రజలు మేలుకోవాల్సిన వేళ ఇదే. విద్యను వాణిజ్యపు చీకటి గుహల నుంచి వెలికితీయాల్సిన బాధ్యత మనందరిదీ. ఎందుకంటే.. విద్య విక్రయించేది కాదు – వికాసించాల్సింది! ఈ తతంగం ప్రతియేటా పునరావృతమవుతూనే ఉంది. దీన్ని తక్షణం చట్ట పరంగా, ప్రజాపరంగా, నైతికంగా అణిచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పునరావృతమవుతున్న విద్యా దోపిడీ..

కేవలం విద్యా సంవత్సర ప్రారంభంలో కొద్ది రోజుల పాటు మాత్రమే విద్యార్థి సంఘాలు నిరసనలు చేస్తూ కనిపిస్తాయి. అవి చాలావరకు సంక్షిప్త నిరసనలూ, తాత్కాలిక ఒప్పంద చలనాలుగా మారిపోతూ, మౌలికంగా వ్యవస్థను ఎదిరించలేకపోతున్నాయి. తల్లిదండ్రుల ఆర్థిక బంధనాలు, నిస్సహాయత ఇవన్నీ కలిసి ఒక నాటకంలా ప్రతి సంవత్సరం జరుగు తున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటంతో, ప్రైవేట్ యాజమాన్యాల ఇష్టారాజ్యమే చెల్లుతోంది. నాణ్యతా ప్రమాణాలెరుగని స్కూల్లు ఒలింపియాడ్, టెక్నో, ఈ-టెక్నో, ఇంటర్నేషనల్ వంటి ఆర్భాట పదాలతో తల్లిదండ్రులను మభ్యపెడుతూ, తమ పాఠశాలల్లోనే పుస్తకాలు, యూనిఫామ్స్, రవాణా ఫీజులు, స్టేషనరీని అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ అన్యాయపు తతంగం ఒక నిశ్చల దృశ్యంగా పునరావృతమవుతూనే ఉంటుంది. సమాజంలో మేధావులు, మానవ హక్కుల వేత్తలు నిర్లక్ష్యం చేయడం వల్ల ఫీజు దోపిడీ ఎటువంటి అడ్డుకట్ట లేకుండా విస్తరిస్తోంది. ఇది ఒక ‘విద్యా అత్యాచారం’ మాత్రమే కాదు. సమాజ హక్కుల పట్ల నిర్లక్ష్యం, ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనం.

విద్య హక్కా.. అమ్మకానికి కొనే వస్తువా?

విద్య, ఆర్థిక సామర్థ్యంగా కొనుగోలు చేసే వస్తువు కాదు. ఇది ప్రతి పౌరుడి మౌలిక హక్కు. మన భారత రాజ్యాంగం ఆర్టికల్ 21A ద్వారా 6–14 ఏళ్ల పిల్లలందరికీ ఉచిత, తప్పని సరి విద్యను హామీ ఇస్తోంది. అయినా, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కేవలం ‘కాగితపు హక్కు’గా మిగిలిపోతోంది. ప్రత్యేకించి తెలంగాణలో ప్రతీ విద్యా సంవత్సరం ప్రారంభం వేళ ప్రైవేట్ పాఠశాలలు చేసే ఫీజు దోపిడీ, నిబంధనల ఉల్లంఘన, అధిక ధరల పుస్తకాలు, యూనిఫాంల పేరుతో జరుగుతున్న వ్యాపారం ఇవన్నీ మౌలిక విద్యా హక్కుకే సవాలు విసురు తున్నాయి. ఈ పరిస్థితులపై స్పందించకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం విద్యను వాణిజ్య మాఫియాల చేతుల్లో పెట్టేసినట్టే. నాణ్యత, సమానత్వం, సామర్థ్యానికి బదులు ఇప్పుడు స్కూల్ ఎంపిక ‘ధన సామర్థ్యం’ ఆధారంగా మారిన దుస్థితి ఏర్పడింది. దీన్ని ప్రశ్నించకపోతే, ఆర్థికంగా వెనుక బడిన తరగతులు విద్య నుండి పూర్తిగా తప్పించబడే ప్రమాదం ఉంది. విద్యను హక్కుగా కాక, ఖరీదైన వస్తువుగా మారుస్తున్న ఈ వ్యవస్థపై చర్చలు జరగడం లేదు.

ప్రభుత్వ నియంత్రణ అవసరం!

తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల ఫీజు దోపిడీ, నిబంధనల ఉల్లంఘనలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా, నిస్సహాయంగా వ్యవ హరిస్తోంది. అనుమతుల లేకుండా ఫీజుల వసూలు, గుర్తింపు నిబంధనల ఉల్లంఘనపై చర్యల్లో వైఫల్యం కనిపిస్తోంది. అధికారులు జారీ చేసిన నోటీసులు అమలుకాక, డీఈఓ, ఆర్‌జేడీ స్థాయిలో పర్యవేక్షణ తక్కువగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలు బలహీనంగా ఉండటంతో తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలవైపు మొగ్గుతున్నారు. మౌలిక వసతులు, బోధన నాణ్యత, భద్రతలో ప్రభుత్వ పాఠశాలలు పోటీ చేయలేకపోతున్నాయి. ప్రభుత్వం విద్యను హక్కుగా కాపాడకుండా, వాణిజ్య వస్తువు గా మలచడంపై విమర్శలు వస్తున్నాయి. 2017లో ఏర్పాటైన TS-SFRC నివేదికలు అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధిక ఫీజుల నియంత్రణకు పూర్తి అధికారాలతో కమిషన్ ఏర్పాటు చేయాలి. విద్యాహక్కు చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలి. ప్రభుత్వ పాఠశాలలను బలపరచాలి. పాఠశాలలపై పబ్లిక్ ఆడిట్, పారదర్శకత పెంచాలి. ప్రత్యేక విద్యా మానిటర్‌లతో పాటు డీఈఓ, ఆర్‌జేడీలు పర్య వేక్షణను పటిష్టంగా నిర్వహించాలి. తరచూ ఆడిట్‌లు, ఫీజు సమీక్షలు జరపాలి. ఫీజు లెక్కలను ప్రతినెలా బ్యాలెన్స్‌ షీట్ రూపంలో ప్రభుత్వానికి అందించేలా చేయాలి. అన్ని జిల్లాల్లో ప్రత్యేక ఫిర్యాదుల కేంద్రాలు, ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాలి. పేరెంట్ ఆన్‌ బోర్డింగ్ కమిటీలు ఉండాలి. ఉల్లం ఘనలు, దోపిడీపై శిక్షార్హ చర్యలు, లైసెన్స్ రద్దు చేపట్టాలి. విద్యారంగానికి ప్రత్యేక న్యాయవ్యవస్థ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ బాధ్యత విషయంలో ప్రజా ఉద్యమం, న్యాయ ఒత్తిడి, శాసన మార్గాల ద్వారా ఒత్తిడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

నంగె శ్రీనివాస్,

ఎడ్యుకేషన్ ఎనలిస్ట్,

94419 09191

Next Story