- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శాంతి ఒప్పందం.. భ్రాంతి కాకూడదు!
ఇరాన్–అమెరికా మధ్య కుదిరిన శాంతి ఒప్పందం, హార్ముజ్ జలసంధి పునఃప్రారంభం, ప్రపంచ ఇంధన మార్కెట్లపై దాని ప్రభావం, భారత్‌తో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కలిగే ప్రయోజనాలు, అలాగే ఈ ఒప్పందం స్థిరత్వంపై ఉన్న అనుమానాలపై విశ్లేషణాత్మక కథనం.

ఇరాన్–అమెరికా మధ్య కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలుకుతూ శాంతి ఒప్పందం కుదిరినట్లు పాకిస్తాన్ ప్రకటించడం, ఆ ప్రకటనను ఇరు దేశాలు ధృవీకరించడం ప్రపంచ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా నిలిచింది. ఫలితంగా నెలల తరబడి మూసివేతలో ఉన్న హార్ముజ్ జలసంధి తెరుచు కోబోతుంది. ఈ ఒప్పందం ప్రకారం నెలల తరబడి తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకు ఇది ఒక గొప్ప ఊరట. ఎందుకంటే ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాలో దాదాపు ఐదో వంతు ఈ జలసంధి ద్వారానే సాగుతుంది. ఇటీవల జరిగిన ఘర్షణల కారణంగా ఈ మార్గం దాదాపు స్తంభించిపోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. భారత్‌తో పాటు అనేక దేశాలు ఇంధన కొరత, పెరిగిన ధరలు, సరఫరా అంతరాయాల ప్రభావాన్ని చవిచూశాయి. ఇంకా చూస్తున్నాయి కూడా.. ఇలాంటి పరిస్థితిలో పశ్చిమా సియాలో శాంతి నెలకొనడం అంటే ప్రపంచానికి స్థిరత్వం నెలకొనడమే. అయితే ఈ శాంతి ఒప్పందం ఎంతకాలం, ఎంత ప్రభావవంతం అన్నది కాలమే చెప్పాలి. ఎందుకంటే ఇలా శాంతి నెలకొనడం ఇజ్రాయెల్ దేశానికి రుచించదు. భగ్నం చెయ్యడానికి తన వంతు కృషి తను చేస్తుంది. అమెరికా దాని మాట కాదనదు. అమెరికా కూడా ఇంటా, బయటా వ్యతిరేకతను తగ్గించుకోవడానికి, పరపతిని కాపాడు కోడానికి, అనూహ్యంగా ఎదురైన ప్రతిఘటనలతో కొంత సమయాన్ని చిక్కించుకోడానికి శాంతి ప్రయత్నాలకు ఒప్పుకుంది. కానీ నిబద్ధతతో అని అనలేం. ఇరాన్ కూడా తన వైఖరి నుండి పక్కకు జరగదు. ఇరు పక్షాలూ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నాయి. ఒకరిని నమ్మే పరిస్థితి ఇంకొకరికి లేదు. అయినా ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. ఈ శాంతి ఒప్పందం ఒక భ్రాంతి ఒప్పందం కాకుండా ఆ రెండు దేశాలే కాకుండా ప్రపంచ దేశాలు కృషి చెయ్యాలి. యుద్ధం చేస్తున్నది ఇద్దరు.. నష్టం మోస్తున్నది అందరూ..
- డా.డి.వి. జి. శంకరరావు,
94408 36931






