- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ పాచిక.. హార్ముజ్!
హార్ముజ్ జలసంధిపై టోల్ విధిస్తూ ఇరాన్ కొత్త ఆర్థిక వ్యూహాన్ని అమలు చేస్తోంది. అమెరికా-ఇరాన్ తాత్కాలిక యుద్ధ విరామం వెనుక చైనా పాత్ర, చమురు ధరలపై ప్రభావం, భారత్‌పై పడే భారంపై పూర్తి విశ్లేషణ.

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి విడిపోయినట్లు కనిపిస్తున్నా, తెర వెనుక ఒక భారీ ఆర్థిక యుద్ధం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ మధ్య కుదిరిన ‘రెండు వారాల’ తాత్కాలిక విరామం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అయితే, ఈ విరామం వెనుక ఇరాన్ వేసిన ‘హార్ముజ్ టోల్’ పాచిక ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు దారితీస్తోంది.
ఎందుకంటే మార్చి మధ్య వారంలోనే ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ హార్ముజ్ టోల్ ప్రతిపాదన తీసుకువచ్చారు. అంటే యుద్ధం అమెరికా మొదలుపెట్టినా.. యుద్ధం తర్వాత ఏం చేయాలన్న విషయంపై ఇరాన్ క్లారిటీతో ఉన్నదన్న విషయం అర్థమవుతుంది.
ఆఖరి 90 నిమిషాల ఉత్కంఠ
అణు దాడులు ఖాయమని, గల్ఫ్ యుద్ధం ముంచు కొస్తుందని ప్రపంచం భయపడుతున్న వేళ.. అనూహ్యంగా కాల్పుల విరమణ ప్రకటించడం వెనుక భారీ హైడ్రామా నడిచింది. అమెరికా తన ‘ఆపరేషన్ మిడ్ నైట్ హామర్’ ద్వారా ఇరాన్ అణు కేంద్రాలపై దాడులకు సిద్ధమైన వేళ, ఆ గడువు ముగియడానికి కేవలం 90 నిమిషాల ముందు ట్రంప్ నుండి సీజ్‌ఫైర్ ప్రకటన వెలువడింది. ఇరాన్ కూడా వ్యూహాత్మకంగా హార్ముజ్ జలసంధిని మూసివేయబోవడం లేదని, దానికి బదులు టోల్ వసూలు చేస్తామని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన వెనుక పాకిస్తాన్ పేరు వినిపిస్తున్నా, అసలు సూత్రధారి మాత్రం చైనా అని తెలుస్తున్నది. ఎందుకంటే మార్చి 31న ఇస్లామాబాద్‌లో సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్టు దేశాల మంత్రులతో కీలక సమావేశం నిర్వహించిన వెంటనే పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ బీజింగ్ వెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి.
చైనా గ్యారెంటీ.. ట్రంప్ అంగీకారం
ఇరాన్ ఈ శాంతి ఒప్పందానికి మొగ్గు చూపడం వెనుక చైనా ఇచ్చిన ‘స్పష్టమైన హామీ’ ఉందని విశ్లేషకులు భావి స్తున్నారు. చైనా తన చమురు అవసరాల కోసం హార్ముజ్ మార్గంపైనే ఆధారపడుతుంది. యుద్ధం జరిగితే చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది.. అందుకే ‘యుద్ధం వద్దు - టోల్ కడతాం’ అనే ఫార్ములాను చైనా తెరపైకి తెచ్చింది. ట్రంప్ కూడా చైనా పాత్రను ధ్రువీకరించడం గమనార్హం. ఏఎఫ్‌పీ వార్త సంస్థతో ఆయన మాట్లాడుతూ.. ‘చైనా ఇరాన్‌ను టేబుల్ వద్దకు తెచ్చింది’ అని అనడంతో ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. ఇది అమెరికాకు ఒక ‘గౌరవప్రదమైన నిష్క్రమణ’ మార్గాన్ని ఇచ్చింది. మొత్తానికి ఈ నెల 10వ తేదీన శుక్రవారం ఇస్లామాబాద్‌లో జరిగే చర్చల్లో వచ్చే ఫలితంపైనే ఇరాన్, అమెరికా యుద్ధం ఆధారపడి ఉన్నది.
ఇరాన్‌కు వరం.. హార్ముజ్
హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లే ప్రతి భారీ నౌక (వీఎల్సీసీ.. వెరీ లార్జ్ క్రూడ్ క్రూయిజ్) నుంచి 2 మిలియన్ డాలర్లు (దాదాపు ₹18.5 కోట్లు) వసూలు చేయాలని ఇరాన్ నిర్ణయించింది. ఒక నౌక సుమారు 20 లక్షల (2 Million) బ్యారెళ్ల ఆయిల్‌ని మోసుకెళ్తుంది. ప్రస్తుత మార్కెట్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల చొప్పున లెక్కిస్తే, ఒక నౌకలోని ఆయిల్ విలువ సుమారు 200 మిలియన్ డాలర్లు (రూ.1,850 కోట్లు) ఉంటుంది. ఇరాన్ వసూలు చేసే 2 మిలియన్ డాలర్ల టోల్ వల్ల బ్యారెల్ ధరపై ఒక డాలర్ (రూ.92.25) అదనపు భారం పడుతుంది. యుద్ధానికి ముందు హార్ముజ్ నుంచి రోజుకు 100 నుండి 138 నౌకలు తిరిగేవి. ప్రస్తుత యుద్ధ విరామం తర్వాత, ట్రాఫిక్‌ను తిరిగి పునరుద్ధరిస్తే ఇరాన్ రోజుకు కనీసం 100 నౌకలను అనుమ తించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే వంద నౌకలకు 2 మిలియన్లు చొప్పున వసూలు చేస్తే 200మిలియన్ డాలర్లు (రూ.1,848కోట్లు) అవుతుంది. ఇక నెలకు 6 బిలియన్ డాలర్లు (రూ.55,440 కోట్లు), ఏడాదికి 70 నుంచి 90 బిలియన్ డాలర్లు (రూ.6.5 లక్షల కోట్ల నుంచి రూ.8.3 లక్షల కోట్లు) ఇరాన్ ఖాతాలో జమ కానున్నాయి. కానీ, భారత్ మాత్రం ఇరాన్ టోల్ డెబ్బకు కుదేలయ్యే పరిస్థితి ఉన్నది. ఇరాన్ వసూలు చేసే టోల్ మొత్తం చమురు విలువలో 1% మాత్రమే అయినా.. ఇన్సూరెన్స్, రవాణా ఖర్చులతో కలిపి వినియోగదారుడికి లీటరు పెట్రోల్‌పై ₹3 నుండి ₹5 వరకు ధర పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు, లేదా ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినవద్దనే కోణంలో కేంద్రం పెట్రోల్, డీజిల్ సెస్ భారీగా తగ్గించినా ఇకపై పెట్రో వడ్డన తప్పదు అన్నది కఠోర వాస్తవం.
రియాల్ కరెన్సీ మర్మం
ఈ టోల్‌ను ఇరాన్ తన అధికారిక కరెన్సీ అయిన ‘రియాల్’లో వసూలు చేస్తామని ప్రకటించింది. రియాల్ అనేది ఇరాన్ కరెన్సీ. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక అమెరికన్ డాలర్ విలువ అధికారికంగా 42,000 రియాల్స్ కాగా, ఓపెన్ మార్కెట్లో ఇది 7,00,000కు పడిపోయింది. టోల్ కోసం ఇతర దేశాలు డాలర్లను ఇచ్చి ‘రియాల్’ కరెన్సీని కొనడం వల్ల, ఇరాన్ తన కరెన్సీ విలువను పెంచుకునే వ్యూహాన్ని రచించింది. ఇది డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే ఎత్తుగడలో భాగం. అయినా, యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లడం అమెరికాకు ఇష్టం లేకపోవడంతో రాజీ పడాల్సి వచ్చింది. మొత్తంగా ఇది ఇరాన్‌కు ఆర్థిక విజయం.. ఏటా దాదాపు 70నుంచి 90 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించడం ద్వారా అమెరికా ఆంక్షల నష్టాన్ని భర్తీ చేసు కోనున్నది. అంతిమంగా మధ్యప్రాచ్యంలో అమెరికా కంటే చైనా మాటకే ఎక్కువ విలువ ఉందనే సంకేతాలు వెళ్లాయి. మరీ ముఖ్యంగా, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ సాధించిన ‘టోల్’ హక్కు అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంపై అమెరికాకున్న పట్టును తుడిచిపెట్టేసింది. మొత్తానికి ఇరాన్ మాత్రం తన భౌగోళిక స్థానాన్ని ఆయుధంగా మలచుకుని, అగ్ర రాజ్యాన్నే తన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవడంలో సఫలమైంది.
-హరీశ్ ఎస్పీ






