- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'చూపుల యుగం'లోనూ తీరని దాహం పుస్తకం
నా చిన్నప్పుడు చలికాలపు గాలుల్లో ఒక అందమయిన వాసన ఉండేది అది పాత కాగితపు వాసన, కొత్త అక్షరాల మిఠాయి వాసన.

నా చిన్నప్పుడు చలికాలపు గాలుల్లో ఒక అందమయిన వాసన ఉండేది అది పాత కాగితపు వాసన, కొత్త అక్షరాల మిఠాయి వాసన. అది కవితల్లా, కథల్లా పలుకుతూ నాలోకి ప్రవహించేది. ఆ వాసనే నాకు మొట్టమొదట పుస్తకాన్ని పరిచయం చేసింది. నాన్న చేయి పట్టుకుని మొదటిసారి వెళ్ళిన ఆ పుస్తకాలు కిరాయికి ఇచ్చే బుక్ స్టాల్. అక్కడ చూసిన పుస్తకాల స్మృతి ఇప్పటికీ నాకు గుర్తుంది. అది నా లోపలికి ఎప్పటికీ వెలుతురులా దూరుతూ నన్ను సజీవంగా ఉంచుతుంది. అప్పుటి నుండే నాకు పుస్తకమంటే ఓ స్నేహితుడే., కాని ముచ్చట్లు పెట్టని, మాటలు అసలే మాట్లాడని స్నేహితుడు. కానీ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్న మొదటి రోజున ఆ స్నేహితుడు తొలిసారి నాతో సంభాషించాడు. అప్పడు చదివిన ప్రతి పుస్తకపు ముఖచిత్రం నిండా ఒక నవ్వు, తిరగేసినప్పుడు ప్రతి పేజీ ఒక ఊపిరి.
పుస్తకం నాతో నిశ్శబ్దంగా మాట్లాడే మిత్రుడు, ఎప్పుడూ ద్రోహం చేయని సహచరుడు, వాణ్ని ఎన్నిసార్లు వదిలిపెట్టినా తిరిగి ఒడిలోకి చేరే ప్రేమ. పుస్తకం నాకు జీవితాన్నేకాదు జీవికను ఇచ్చింది. బ్రతుకుతెరువునూ ఇచ్చింది. మూడు దశాబ్దాలకు పైగా పుస్తకాల మధ్యే గడిపాను. అప్పటినుండీ పుస్తకాలలో నన్ను నేనే వెతుక్కునే మనిషినయ్యాను. పుస్తకాలు నా జీవితానికి అనుసంధానమయి దశాబ్దాలు గడిచిపోయినా, ఆ పుస్తకాల పేజీలపై నాకున్న ప్రేమ మాత్రం వయసుని మించి పెరిగి పోతోంది. నాకు చదవడం కేవలం ఒక అలవాటు, అభిరుచి మాత్రమే కాదు అది ఒక అంతరంగ విస్తరణ, ఒక ఆత్మయాత్ర.. పుస్తకాలను నేను కేవలం చదవను నచ్చిన వాటిలో మునిగిపోతాను వాటితోపాటు నడుస్తాను.
పుస్తకంపై ప్రేమ... ఒక నిశ్శబ్ద విప్లవం
పుస్తకం అంటే భావాల సమాహారం. మనసుల భాష. పుస్తకం అంటే కేవలం తిప్పేసే పేజీలు కాదు అవి జీవన ప్రయాణపు దారులు. పుస్తకం అంటే మానసిక ఆవిష్కరణ. పుస్తకలోకమే తానైపోయినవాణ్ని ప్రపంచం మొత్తం శబ్దాలతో నిండిపోయినప్పుడు, నేను పుస్తకాలతో నిండిన నిశ్శబ్దంలో ఆశ్రయం కోసం వెతుకుతాను. లైబ్రరీ ఎదో సాధారణ భవనం కాదు ఒక ఆలయం. పుస్తకాల దుకాణం షాపు కాదు ఒక పండుగ. ఒక మంచి పుస్తకం తిరగేస్తే నా లోకం మారుతుంది. ఒక గొప్ప వాక్యం చదివితే నా హృదయం పరుగులు తీస్తుంది.. అన్నింటినీ చూస్తూ గడుపుతున్న ఇవ్వాల్టి ‘చూపుల యుగం’లో ఫోన్లు, రీల్స్‌తో కాలం అత్యంత వేగవంతంగా దూసుకుపోతుంది. 30 సెకన్ల వీడియోలనే పెద్ద కథలుగా భావిస్తున్న కాలం ఇది. కాని నేను రీల్‌ని కాదు ఒక అధ్యాయాన్ని చదువుతాను. స్క్రోల్ చేయను పేజీని తిప్పుతాను. ఏదో ఒకటి కాదు ప్రతి పుస్తకం నన్ను కొంచెం కొంచెం మార్చింది. నిజానికి పుస్తకాలపై వుండే ప్రేమ ఒక నిశ్శబ్ద విప్లవం. కొన్ని పుస్తకాలు నన్ను అనుసరిస్తాయి. కొన్ని పుస్తకాలు నన్ను వదలవు. కొన్ని ఏడిపిస్తాయి. కొన్ని నిలువరించలేని ఆశల్ని నింపుతాయి. నా లైబ్రరీలో పుస్తకాలు కేవలం షెల్ఫుల్లోని వరుసలు కాదు, అవి జీవితపు జ్ఞాపకాలు, పాఠాలు, బాధలు, ఆనందాలు, గాయాలు, స్వప్నాలు.
పుస్తక ప్రదర్శన
నా జీవితంలో పుస్తకం ఒక దీపమయితే పుస్తక ప్రదర్శన ఆ దీపాల వేదిక. పుస్తక ప్రదర్శన అనేది కేవలం అమ్మకాల జాతర కాదు. అది భాష, భావం, విజ్ఞానం, ఒక సాంస్కృతిక ప్రయాణం. అన్నీ ఒకే చోట కలిసే సాహిత్య యాత్ర. కొత్త ప్రపంచాలను కనుగొనే భావాలు అక్కడ పుడతాయి. ప్రతి సంవత్సరం చిన్న పెద్ద పట్టణాల్లో జరిగే పుస్తక ప్రదర్శనలు పాఠకులు, రచయితలు, ప్రచురణకర్తలు, పరిశోధకులు, విద్యార్థులు అందరికీ ఒక సమాలోచన వేదికలు. ఇక్కడ పుస్తకం ఒక వస్తువు కాదు ఒక ముఖాముఖి సంభాషణ. అక్కడ నాలాంటి పాఠకుడు తన ఆలోచనలకు కొత్త దారులు వెతుకుతాడు. రచయితేమో తన అక్షరాలకున్న స్పందనను నేరుగా తెలుసుకుంటాడు. విద్యార్థి పాఠ్యపుస్తకాలకు వెలుపలున్న ప్రపంచాన్ని కనుగొంటాడు. సంస్థలు, ప్రచురణలు తమ వైవిధ్యాన్ని పాఠకులకు పరిచయం చేస్తాయి.
జీవితకాలపు ఆలోచన
పుస్తక ప్రదర్శన అంటే ఒక సాంస్కృతిక ఉత్సవం. కొత్త పుస్తకాలు ఆవిష్కరణ, చర్చా వేదికలు, కవిసమ్మేళనాలు, కథా రాత్రులు ఇవన్నీ పుస్తకాన్ని కేవలం పఠనానికే కాకుండా వాటిల్లో తప్పకుండా పాల్గొనాల్సిన అనుభవంగా మార్చుతాయి. ఈ డిజిటల్ యుగంలో కూడా పుస్తక ప్రదర్శనల సందడి తగ్గలేదు. ఎందుకంటే స్క్రీన్ ఎంత పెద్దదైనా, పేజీల స్పర్శ, ముద్రణ పంచె వాసన, బుక్ మార్క్‌ల మృదువైన జ్ఞాపకం వీటికి ప్రత్యామ్నాయం లేదు. ఒక పుస్తకాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు అది కేవలం పేపర్ కాదు. ఒక మనిషి జీవితకాలపు ఆలోచనలు, బాధలు, ఆశలు, పరిశోధనలు.
పాఠకుడిని మేల్కొలిపే ప్రయాణం..
కొత్త తరం ఈ ప్రదర్శనల ద్వారా పుస్తక ప్రపంచంతో మరింత దగ్గరవుతోంది. వినోదం మాత్రమే కాదు, ఆలోచించే సామర్థ్యాన్ని పెంచే బాట ఇది. ప్రతి పుస్తకం ఒక కిటికీ, మనం చూడని కొత్త ప్రపంచానికి. ప్రతి ప్రదర్శన ఒక ప్రయాణం మనలో దాగిన పాఠకుడిని మేల్కొలిపే ప్రయాణం. పుస్తక ప్రదర్శనల్లో పుస్తకాలకు ప్రచారం రావాలి. పుస్తకాలలోని అంశాలతో చదువరులు మరింత ప్రభావితం కావాలి. చదవడం మరింత పెరగాలి. అదే నేను మనసారా ఆశిస్తున్నది.. అందరి కోరిక కూడా.
(త్వరలో హైదరాబాబ్ బుక్ ఫెయిర్ ప్రారంభం)
వారాల ఆనంద్
94405 01281






