- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండోనేషియా.. భారతానికి నేర్పే సహజీవన పాఠం!
ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న ఇండోనేషియా హిందూ–బౌద్ధ వారసత్వాన్ని ఎలా కాపాడుకుంటోంది? భారత్–ఇండోనేషియా నాగరికతా బంధం, మత సామరస్యంపై విశ్లేషణ..

ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న దేశం ఏది? ఈ ప్రశ్నకు చాలామంది సౌదీ అరేబియా లేదా పాకిస్తాన్ అని అనుకుంటారు. కానీ ఇండోనేషియా సరైన సమాధానం. అయితే ఈ దేశాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది కేవలం ఆ గణాంకం కాదు. వేల ఏళ్ల క్రితం భారతదేశంతో ఏర్పడిన నాగరికతా బంధాన్ని, హిందూ – బౌద్ధ వారసత్వాన్ని నేటికీ గౌరవంగా కాపాడుకుంటూ, ఆధునిక అభివృద్ధితో సమన్వయం చేసుకుంటున్న తీరు ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
నిజానికి మతపరమైన మెజారిటీ ఒక దేశ చరిత్రను నిర్ణయించదు.. ఆ దేశం తన గతాన్ని ఎలా గౌరవిస్తుందన్నదే దాని నాగరికతకు అసలైన కొలమానం. సుమారు 28 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో దాదాపు 87 శాతం మంది ముస్లింలు.. అయినప్పటికీ, వేల ఏళ్ల క్రితం భారతదేశం నుంచి వెళ్లిన హిందూ–బౌద్ధ నాగరికత ఆనవాళ్లను నేటికీ గౌరవంగా కాపాడుకుంటూ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది ఆ దేశం.
వేల ఏళ్లుగా కొనసాగుతున్న నాగరికత..
భారత్–ఇండోనేషియా సంబంధాలు కేవలం దౌత్య, వాణిజ్య సంబంధాలు మాత్రమే కావు.. అవి సముద్ర మార్గాల ద్వారా వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న నాగరికతల అనుబంధం. ప్రాచీన భారతదేశంలోని చోళులు, పల్లవులు, శ్రీవిజయ, మజపహిత్ రాజ్యాల మధ్య ఏర్పడిన సాంస్కృతిక, ఆర్థిక, సముద్ర వాణిజ్య సంబంధాలు నేటి ద్వైపాక్షిక సంబంధాలకు బలమైన పునాది వేశాయి. భారతీయ వ్యాపారులు, పండితులు, కళాకారులు, ఆధ్యాత్మిక గురువులు ఇండోనేషి యాలో హిందూ, బౌద్ధ సంప్రదాయాలను విస్తరించగా, అక్కడి ప్రజలు వాటిని తమ స్థానిక సంస్కృతితో కలిపి ప్రత్యేకమైన వారసత్వంగా మలచుకున్నారు. ఇండోనేషియా జాతీయ చిహ్నమైన గరుడ, జాతీయ నినాదమైన భిన్నేక తుంగ్గల్ ఇకా (భిన్నత్వంలో ఏకత్వం), అనేక నగరాల్లో కనిపించే రామాయణ – మహాభారత శిల్పాలు, దేవాలయాలు, సాంస్కృతిక ఉత్సవాలు భారతీయ నాగరికత ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. ప్రపంచ ప్రసిద్ధ బోరోబుదూర్ బౌద్ధ కట్టడం, ప్రంబనన్ హిందూ దేవాలయ సముదాయం, అలాగే బాలి ద్వీపంలోని వేలాది దేవాలయాలు ఈ చారిత్రక వారసత్వానికి నిలువెత్తు సాక్ష్యాలు.
భారత్ నేర్చుకోవాల్సిన నాగరికత పాఠం..
ఇటీవల కాలంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఆ దేశ నాయకత్వం భారత దేశంతో తమ చారిత్రక, సాంస్కృతిక అనుబంధాన్ని ప్రస్తావించడం ఈ సంబంధాల లోతును మరోసారి గుర్తు చేసింది. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం కూడా వేగంగా విస్తరిస్తోంది. సముద్ర భద్రత, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యం, అలాగే బ్రహ్మోస్ వంటి ఆధునిక రక్షణ సాంకేతికతపై చర్చలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, పునరుత్పాదక ఇంధన రంగాల్లోనూ రెండు దేశాలు భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నాయి. అయితే ఇండోనేషియా గురించి భారతదేశం నేర్చుకోవాల్సిన అంశం కేవలం దౌత్యం కాదు.. ఆ దేశ సామాజిక జీవన విధానం. అక్కడ సుమారు 47 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. మొత్తం జనాభాలో వారి శాతం 1.7 మాత్రమే అయినా, ముఖ్యంగా బాలి ద్వీపంలో హిందూ సంస్కృతి ప్రజల దైనందిన జీవితంలో అంతర్భాగంగా ఉంది. అక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, ఇతర మతాల ప్రజలు పరస్పర గౌరవంతో జీవించడం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది.
అతిపెద్ద ముస్లిం దేశం అయినప్పటికీ..
ఇండోనేషియా ముస్లిం దేశంగా మారిన తర్వాత కూడా తన ప్రాచీన హిందూ - బౌద్ధ వారసత్వాన్ని చెరిపివేయలేదు. దానిని జాతీయ వారసత్వంగా స్వీకరించింది. దేవాలయాలను కేవలం మతపరమైన కట్టడాలుగా కాకుండా, చరిత్ర, సంస్కృతి, పర్యాటక సంపదగా అభివృద్ధి చేసింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే కోట్లాది పర్యాటకులను ఆకర్షిస్తూ ఆ వారసత్వాన్ని ఆర్థికాభివృద్ధికి కూడా అనుసంధానించింది. గతాన్ని కాపాడుకుంటూనే వర్తమానాన్ని నిర్మించుకోవడం ఎలా అనేది ఇండోనేషియా చూపించింది. భారతదేశం కూడా అనేక మతాలు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనం. మన రాజ్యాంగం కూడా వైవిధ్యంలో ఏకత్వాన్నే ప్రామాణిక విలువగా ప్రకటించింది. అయితే ఇటీవలి కాలంలో మత, సామాజిక విభజనలపై చర్చలు ఎక్కువవుతున్న సందర్భంలో ఇండోనేషియా అనుభవం మనకు ఒక విలువైన సందేశాన్ని అందిస్తుంది. ఒక మతానికి చెందిన వారసత్వాన్ని గౌరవించడం అంటే మరో మతాన్ని తక్కువ చేయడం కాదని, చరిత్రను పరిరక్షించడం జాతీయ ఐక్యతను బలోపేతం చేస్తుందని ఆ దేశం నిరూపించింది.
ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తే..
భారత్–ఇండోనేషియా సంబంధాలు రాబోయే కాలంలో మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయి.. ఇండో–పసిఫిక్ వ్యూహం, సముద్ర భద్రత, రక్షణ, వాణిజ్యం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, విద్య, సంస్కృతి వంటి రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తే ఆసియా ప్రాంత స్థిరత్వానికి కూడా దోహదప డుతుంది. అదే సమయంలో ప్రజల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం కూడా అవసరం. ఇండోనేషియా మనకు గుర్తు చేసే గొప్ప పాఠం ఏమిటంటే ఒక దేశ బలం కేవలం సైనిక శక్తిలో కాదు.. తన చరిత్రను గౌరవించడంలో, భిన్న సంస్కృతులను ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడంలో, ప్రజల మధ్య ప్రేమ, పరస్పర గౌరవం, సౌభ్రాతృత్వాన్ని నిలబెట్టడంలో ఉంది. భారత్, ఇండోనేషియా దేశాల మధ్య వేల సంవత్సరాల నాగరికతా బంధం భవిష్యత్తులో మరింత బలపడాలని, ఈ స్నేహం ఆసియా శాంతి, సహకారం, అభివృద్ధికి మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షిద్దాం.
- సీహెచ్. వి. ప్రభాకర్ రావు
93915 33339






