ఉన్నది ఉన్నట్టు: 75 ఏళ్ల స్వాతంత్రంలో దేశ పరిస్థితులపై గర్విద్దామా! దుఃఖిద్దామా?

by Viswanth |
ఉన్నది ఉన్నట్టు: 75 ఏళ్ల స్వాతంత్రంలో దేశ పరిస్థితులపై గర్విద్దామా! దుఃఖిద్దామా?
X

శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంతగా అభివృద్ధి చెందినా అశాస్త్రీయ భావనలు మాత్రం అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. మతం, కులం పేరుతో ఘర్షణలు జరుగుతున్నాయి. విభజన రేఖ విస్తృతమవుతున్నది. రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసం పెంచి పోషిస్తున్నాయి. ఎన్నికలలో పోటీ చేయడానికి టికెట్లు ఇవ్వడం మొదలు మంత్రివర్గంలో చోటు కల్పించడం వరకు కులం, మతం కీలకమవుతున్నాయి. భారత సమాజంలో మెజారిటీ-మైనారిటీ విభజన రేఖ ఏర్పడింది. కాలం గడుస్తున్నా కొద్దీ సమాజం పురోగమిస్తూ ఉండాలి. సైన్స్, టెక్నాలజీల వేగానికి తగినట్లుగా ఆలోచనలు వికసించాలి. 75 ఏళ్ల కాలం చిన్నదేమీ కాదు. ప్రపంచంలోనే ఉత్తమ ప్రజాస్వామ్య వ్యవస్థగా మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ, ప్రభుత్వ విధానాలను, పాలకుల వైఫల్యాలను ప్రశ్నించడం నేరమైంది. భావాలను వ్యక్తీకరించడమూ నిషేధమైంది. నచ్చింది తినలేం.. ఇష్టమైన దుస్తులను ధరించలేం.. అడుగడుగునా ఆంక్షలు. కంటికి కనిపించని సాంస్కృతిక ఆధిపత్య భావజాలం రాజ్యమేలుతున్నది.

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా? స్వర్ణోత్సవాలు చేద్దామా?" అంటూ పాతికేళ్ల కింద ఓ సినీ రచయిత పాడిన పాట గుర్తుండే ఉంటుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్లయిన సందర్భంగా 1997లో ఆ పాట రాశారు. ఆ కవి బతికుంటే ఇప్పుడు 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల గురించి ఏం రాసి ఉండేవారో! మన జీవిత కాలంలో 75 ఏళ్లు తక్కువేమీ కాదు. ఒక మనిషి సగటు జీవితం. మూడు తరాలు. జ్ఞానం సంపాదించి జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాకారం చేసుకునేంత కాలం. ఇప్పుడు 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' 'భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు' జరుపుకుంటున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి మరీ ఉత్సవాలు చేస్తున్నాయి.

'హర్ ఘర్ తిరంగ' 'ఇంటింటికీ జాతీయ జెండా' నినాదాలతో పాటు యాక్షన్ ప్లాన్ రూపొందించాయి. బ్రిటిషు వలస పాలన నుంచి విముక్తి కోసం యావత్తు భారత జాతి ఏకమైంది. అలుపెరుగని పోరు చేసింది. కోట్లాది మంది నిస్వార్ధంగా నిరసనలలో పాల్గొన్నారు. వేలాది మంది ప్రాణాలర్పించారు. ఎట్టకేలకు లక్ష్యాన్ని సాధించారు. సరిగ్గా 75 సంవత్సరాల క్రితం ఈ దేశ ప్రజలంతా స్వతంత్రులయ్యారు. స్వేచ్ఛాగాలులు పీల్చుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు అనుభవిస్తున్న ఫలాలన్నీ అప్పటి సమరయోధుల త్యాగాలే. స్వాతంత్ర్య సముపార్జన పౌరులందరికీ గర్వకారణం. చంద్రయాన్, 5-జీ, రాకెట్లు, ఉపగ్రహాలు, భారీ ప్రాజెక్టులు, ఫైవ్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా ప్రయాణం, పారిశ్రామిక ప్రగతి ఇవన్నీ స్వతంత్ర దేశంగా మనం సాధించిన విజయాలు, అంతర్జాతీయ స్థాయిలో మనకు లభించిన గుర్తింపు. స్వేచ్ఛా వేడుకలను సంతోషంతో జరుపుకోవాల్సిందే. గర్వించాల్సిందే.

అన్నం లేదు, ఉపాధి లేదు

ఇప్పుడు నాణానికి మరోవైపూ చూద్దాం. ఏడున్నర దశాబ్దాలైనా రాజకీయ, సామాజిక, ఆర్థిక అసమానతలు కొనసాగుతున్నాయి. మతాలు, కులాల విభజన కంటిన్యూ అవుతున్నది. పేద-ధనిక తేడా మరింత ప్రస్ఫుటమైంది. పట్టణ-గ్రామీణ విభజన సరేసరి. పేదరికం, ఆకలిచావులు, నిరుద్యోగం, నిరక్షరాస్యత, నిలువ నీడ లేని నిస్సహాయతలాంటి జాడ్యాలు తప్పడం లేదు. విదేశాలకు బియ్యాన్ని సరఫరా చేసే సత్తాను చాటుతున్నాం. కానీ, అదే సమయంలో ఒక రూపాయి సబ్సిడీ బియ్యం కోసం పడిగాపులు కాసే జనమూ కోట్లలోనే ఉన్నారు. విదేశాలలోని ప్రముఖ కంపెనీలకు సీఈఓలుగా, హెడ్‌లుగా ఇండియన్‌లు బాధ్యతలు చేపట్టారంటూ గొప్పగా చెప్పుకునే ధోరణి ఒకవైపూ, అదే సమయంలో పొట్ట చేతపట్టుకుని గల్ఫ్‌లాంటి దేశాలకు ఉపాధి వెతుక్కుంటూ వెళ్లడం మరోవైపూ కనిపిస్తున్నది.

ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారత్‌లో ఇప్పటికీ ప్రజలకు మౌలిక సౌకర్యాలు కరువయ్యాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాలలో కనీస రోడ్డు సౌకర్యం లేదు. గర్భిణుల ప్రసవాలకు ఆస్పత్రులు లేవు. ఎడ్లబండ్లు, డోలీలమీద పట్టణాలకు తరలించాల్సి వస్తున్నది. అతి తక్కువ కాలంలోనే కరోనా వ్యాక్సిన్‌ను స్వంతంగా డెవలప్‌‌చేసి మొత్తం ప్రపంచానికి అందించగలిగినా ప్రభుత్వాస్పత్రులలో కనీస వైద్యం కరువైంది. ఆఖరుకు మరుగుదొడ్లు లేకపోవడంతో 'స్వచ్ఛ భారత్' ప్రోగ్రామ్ చేపట్టాల్సి వచ్చింది. కోట్లాది రూపాయలు కుమ్మరించి అభివృద్ధి చేసినట్లు చెప్పుకుంటున్నా ఒక్కరోజు ఏకధాటి వర్షం వస్తే విశ్వనగరాలూ అతలాకుతలమవుతున్నాయి. సమృద్ధిగా నీటి వనరులున్నా అటు సాగుకు, ఇటు తాగడానికి నీరులేక జనం అవస్థలు పడుతున్నారు. ఆకలి చావులూ తప్పడం లేదు.

రాజకీయ, సామాజిక, ఆర్థిక అసమానతలు కొనసాగుతున్నాయి. మతాలు, కులాల విభజన కంటిన్యూ అవుతున్నది. పేద-ధనిక తేడా మరింత ప్రస్ఫుటమైంది. పట్టణ-గ్రామీణ విభజన సరేసరి. పేదరికం, ఆకలిచావులు, నిరుద్యోగం, నిరక్షరాస్యత, నిలువ నీడ లేని నిస్సహాయత లాంటి జాడ్యాలు తప్పడంలేదు. విదేశాలకు బియ్యాన్ని సరఫరా చేసే సత్తాను చాటుతున్నాం. కానీ, అదే సమయంలో ఒక రూపాయి సబ్సిడీ బియ్యం కోసం పడిగాపులు కాసే జనమూ కోట్లలోనే ఉన్నారు. విదేశాలలోని ప్రముఖ కంపెనీలకు సీఈఓలుగా, హెడ్‌లుగా ఇండియన్‌లు బాధ్యతలు చేపట్టారంటూ గొప్పగా చెప్పుకునే ధోరణి ఒకవైపూ, అదే సమయంలో పొట్ట చేతపట్టుకుని గల్ఫ్‌లాంటి దేశాలకు ఉపాధి వెతుక్కుంటూ వెళ్లడం మరోవైపూ కనిపిస్తున్నది. ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారత్‌లో ఇప్పటికీ ప్రజలకు మౌలిక సౌకర్యాలు కరువయ్యాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాలలో కనీస రోడ్డు సౌకర్యం లేదు. గర్భిణుల ప్రసవాలకు ఆస్పత్రులు లేవు. ఎడ్లబండ్లు, డోలీల మీద పట్టణాలకు తరలించాల్సి వస్తున్నది.

కులమతాలే కీలకం

ఇక సామాజిక వివక్ష గురించి చెప్పుకోవాల్సిన పనేలేదు. ఇప్పటికీ ఆదివాసీ, గిరిజన, దళితుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉన్నది. ఏకంగా ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలే అందుకు నిదర్శనం. ఈ వివక్ష, అసమానతల కారణంగానే రిజర్వేషన్లూ కొనసాగక తప్పడం లేదు. సంపూర్ణ అక్షరాస్యతను సాధించలేకపోయాం. శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంతగా అభివృద్ధి చెందినా అశాస్త్రీయ భావనలు మాత్రం అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. మతం, కులం పేరుతో ఘర్షణలు జరుగుతున్నాయి. విభజన రేఖ విస్తృతమవుతున్నది. రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసం పెంచి పోషిస్తున్నాయి. ఎన్నికలలో పోటీ చేయడానికి టికెట్లు ఇవ్వడం మొదలు మంత్రివర్గంలో చోటు కల్పించడం వరకు కులం, మతం కీలకమవుతున్నాయి. భారత సమాజంలో మెజారిటీ-మైనారిటీ విభజన రేఖ ఏర్పడింది.

కాలం గడుస్తున్నా కొద్దీ సమాజం పురోగమిస్తూ ఉండాలి. సైన్స్, టెక్నాలజీల వేగానికి తగినట్లుగా ఆలోచనలు వికసించాలి. 75 ఏళ్ల కాలం చిన్నదేమీ కాదు. ప్రపంచంలోనే ఉత్తమ ప్రజాస్వామ్య వ్యవస్థగా మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ, ప్రభుత్వ విధానాలను, పాలకుల వైఫల్యాలను ప్రశ్నించడం నేరమైంది. భావాలను వ్యక్తీకరించడమూ నిషేధమైంది. నచ్చింది తినలేం.. ఇష్టమైన దుస్తులను ధరించలేం.. అడుగడుగునా ఆంక్షలు. కంటికి కనిపించని సాంస్కృతిక ఆధిపత్య భావజాలం రాజ్యమేలుతున్నది. స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల గురించి గర్వంగా లెక్చర్లు ఇస్తున్నాం. 'ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలిగినప్పుడే నిజమైన స్వాంతంత్ర్యం' అంటూ మహాత్మగాంధీ కొటేషన్‌ను వాడుతూ ఉన్నాం. పట్ట పగలే మహిళలకు భద్రత, రక్షణ లేకుండా పోయింది.

పాలకుల వైఫల్యాలు

'ఎక్కడో వర్షం పడితే ఇక్కడ గొడుగు పడతారు' అంటూ కమ్యూనిస్టులను ఇప్పటికీ కొన్ని పార్టీలు విమర్శిస్తూ ఉంటాయి. ఆ తరహాలోనే ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ రేట్లు పెరుగుతున్నాయి. ఉక్రెయిన్‌లో యుద్ధం జరిగితే ఇక్కడ వంట నూనెల ధరలు పెరుగుతున్నాయి. గల్ఫ్ దేశాలలో యుద్ధాలు జరిగితే పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌కు ఇబ్బందులొస్తున్నాయి. మన దేశంలో పుష్కలమైన వనరులు ఉన్నా, విశాలమైన సాగుభూములు ఉన్నా, కష్టపడి పండించే రైతాంగం ఉన్నా స్వయం సమృద్ధి సాధించలేకపోయాం. చివరకు పప్పుదినుసుల దిగుమతీ తప్పడం లేదు. ఇక రాఫెల్ లాంటి యుద్ధ విమానాల సంగతి సరేసరి. పాలకులు సమగ్రమైన విధానాలను రూపొందించలేని వైఫల్యమే ఇందుకు కారణం.

ఇక రూపాయి విలువ పతనం, ప్రభుత్వ రంగ సంస్థలను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేయడం, ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒకప్పుడు 'బి ఇండియన్.. బై ఇండియన్' అంటూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే విధానం ఉండేది. టెలికామ్ రంగంలో 5-జీ అంటూ గొప్పగా చెప్పుకుంటున్నా మన చేతులలో కనిపించే మొబైల్ ఫోన్లను స్వంతంగా ఉత్పత్తి చేసుకోలేకపోతున్నాం. విదేశాల నుంచి సమకూర్చుకుంటున్నాం. మానుఫ్యాక్చరింగ్, సర్వీస్ రంగాలలో స్వంతంగా నిలబడలేకపోయాం. ప్రధాని మొదలు రాష్ట్ర మంత్రుల వరకు వాడుతున్న కార్లన్నీ విదేశాలవే. ఇప్పుడు 'మేక్ ఇన్ ఇండియా' అని పాలసీ తెచ్చినా దాని ఫలాలు అంతంతే.

సంక్షేమంతో మురిపెం

చమురుకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ విధానం తీసుకొచ్చినా తగినంత విద్యుత్ ఉత్పత్తి లేదు. ఇటీవల సమ్మర్‌లో కోతలు తప్పలేదు. విస్తారమైన బొగ్గు నిల్వలు ఉన్నా విదేశాల నుంచి కొనాల్సి వస్తున్నది. దేశాన్ని యూనిట్‌గా తీసుకుని ఆరోగ్యకర పోటీతో అన్ని రాష్ట్రాలకూ అభివృద్ధి ఫలాలను అందించాలన్న విశాల దృక్పథం పాలకులలో కరువైంది. ఉత్తర, దక్షిణ భారత్ విభజన ఏర్పడింది. స్వపక్ష, విపక్ష అనే వివక్ష కొనసాగుతున్నది. ప్రజాస్వామ్య స్ఫూర్తి కనుమరుగవుతున్నది. సమిష్టి కృషి, వికేంద్రీకరణ ఆలోచనలకు స్థానం లేకుండా పోయింది. అధికారం, ఆధిపత్యమే అంతిమ లక్ష్యం అనే భావన నెలకొన్నది.ఓట్ల కోసం రాజకీయ పార్టీలు 'ఉచిత' హామీలను ఇస్తున్నాయి.

ప్రజల పేదరికాన్ని సంక్షేమ పథకాలతో ఆకట్టుకుంటున్నాయి. పాలకులు ఇచ్చేవారు.. ప్రజలు పుచ్చుకునేవారు అనే భావనను స్టాండర్ట్ చేశాయి. 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా దేశం సాధించిన ప్రగతినీ, సాధించాల్సిన అంశాలనూ చిత్తశుద్ధితో విశ్లేషించుకోవడం వివేకవంతుల లక్షణం. 75 ఏళ్ళ స్వాతంత్ర్య 'అమృతం' అందిందెవరికి? అందుకోలేకపోతున్న అభాగ్యులెవరు? నిజాయితీగా ప్రశ్నించుకోవాల్సిన తరుణం. జీడీపీ, ఆర్థిక వృద్ధిరేటు, తలసరి ఆదాయం, ఎకానమీ లాంటి పెద్ద పెద్ద పదాల సంగతి ఎలా ఉన్నా ప్రజల కనీస, మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి సారించడం పాలకుల బాధ్యత. 75 ఏళ్ల స్వతంత్ర అమృతోత్సవాలు జరుపుకుంటున్నామని గర్విద్దామా! లేక ఇంతకాలమైనా సగటు ప్రజల అవసరాలను పాలకులు తీర్చలేకపోయిన దుస్థితికి దుఃఖిద్దామా?

ఎన్. విశ్వనాథ్

99714 82403



Next Story