- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉగ్రవాదానికి తలవంచని భారత్
ఉగ్రవాదం అనే పదం ఊహాజనిత భయం కాదు. దేశాన్ని భయకంపితమయ్యేలా చేయాలన్న కుయుక్తి. ఇది టీవీ డిబేట్లలో మాట్లాడుకునే

ఉగ్రవాదం అనే పదం ఊహాజనిత భయం కాదు. దేశాన్ని భయకంపితమయ్యేలా చేయాలన్న కుయుక్తి. ఇది టీవీ డిబేట్లలో మాట్లాడుకునే రాజకీయ సమస్య కాదు. ఇది నిత్యం మన సరిహద్దుల్లో, నగరాల్లో, నిశ్శబ్దంగా విరుచుకుపడే ఉగ్ర పీడ. 1985 నుంచి నేటి వరకు జరుగుతూ వచ్చిన వరుస ఉగ్రదాడులు ఈ దేశాన్ని కల్లోలంలో ముంచెత్తాయి.. కానీ మనం తలవంచలేదు. తలెత్తుకుని నిలబడ్డాం. దేశంలో అశాంతి చేలరేగేలా చేసేవారి కుట్రలు ప్రతిసారీ విఫలమవుతూనే ఉన్నాయి.
అట్లాంటిక్ గగనతలంలో 1985లో జరిగిన 'ఎయిర్ ఇండియా కనిష్క్' పేలుడు నుంచి.. మొన్నటికి మొన్న బైసరాన్ వ్యాలీలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి వరకు, ఈ దేశం ఎన్నో చీకటి దుర్మార్గాలను చూసింది, తట్టుకుంది. భారత దేశంపై ఉగ్రదాడులు యాదృచ్ఛికంగా జరగలేదు. అవి సంస్థాగతంగా, సుదీర్ఘంగా ప్రణాళికాబద్ధంగా జరిగాయి. 1991లో రాజీవ్ గాంధీ హత్య, 1993 ముంబయి పేలుళ్లు, 2001లో పార్లమెంటుపై దాడి, 2008లో ముంబయి 26/11 ఉగ్ర హత్యలు, ప్రతి దాడి మన దేశ మనోబలాన్ని పరీక్షించాయి. కానీ మనం తలవంచలేదు. తలెత్తుకుని నిలబడ్డాం.
ప్రతి ఒక్క దాడి తర్వాత..
2016 ఉరీ దాడి, 2019 పుల్వామా ఘటనలు దేశవ్యాప్తంగా కల్లోలాన్ని కలిగించాయి. కానీ మనదేశం వెంటనే స్పందించి పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా దేశ శక్తిని మాత్రమే కాదు, నైతిక పటిష్టతను కూడా ప్రపంచానికి చాటింది. తాజాగా గత నెల 22న మరో ఘోర దుర్ఘటన పహెల్గాం వద్ద బైసరాన్ వ్యాలీలో ఉగ్రదాడి చరిత్రలో నిలిచిపోయే ఓ మానవీయ విషాదం. ఈ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు చనిపోయారు. అయినప్పటికీ, మన దేశ సంకల్పాన్ని ఇవి దెబ్బతీయలేకపోయాయి. వారు చేసిన దాడి తర్వాత మన 'ఆపరేషన్ సిందూర్' ప్రతిదాడి తీవ్రత ఎక్కువగానే ఉంది. పహెల్గాం దాడికి సంబంధించిన ఆ ఉగ్రవాదులను మనం పట్టుకోలేకపోయినా, పాక్ ఉగ్ర స్థావరాలపై మన బలగాలు జరిపిన ప్రతీకార చర్య ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇద్దరు మహిళల నేతృత్వంలో జరిగిన ఈ వ్యూహాత్మక దాడి, భారత సైనిక సామర్థ్యాన్ని మాత్రమే కాదు, భారత మహిళా శక్తిని కూడా చాటింది. ఈ దాడికి దేశమంతా ఐక్యంగా ప్రభుత్వానికి మద్దతు పలికింది. పార్టీలకతీతంగా విపక్ష నేతలంతా కేంద్ర ప్రభుత్వానికి వెన్ను దన్నుగా నిలిచారు. దౌత్య ఫలితంగా అంతర్జాతీయంగా మనకు మద్దతు లభించింది.
ఉగ్రవాదానికి మతం ఉండదు!
భయం ముందు తలవంచని మన శక్తే దేశానికి నిజమైన రక్షణ కవచం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలు వ్యర్థం కావు. వాళ్ల తుది నిశ్వాసలో మన భద్రత ఉంది. మన శ్వాసల్లో వాళ్ల ఆశయం ఉంది. ప్రతి భారతీయుడి చేతిలో తుపాకీ లేకపోయినా, మన కర్తవ్యంలో జాగృతంగా ఉండే ప్రతి క్షణం ఉగ్రవాదాన్ని ఎదిరించే ముందడుగు. దాన్ని మౌనంగా అంగీకరించడం కాదు, ఖండించడం అవసరం. ప్రతిసారీ మనం చుట్టూ జరుగుతున్న అసహనాన్ని, విద్వేషాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం అంటే, అది విలువల కోసం జరిగే పోరాటం. శాంతిని, మానవతను, సహజీవనాన్ని ప్రతిష్టించే ఈ పోరాటంలో మన ప్రతి ఆలోచన, ప్రతి చర్య కూడా ఆయుధమే. మన పాఠశాలల బోధనలో, కుటుంబాల సంస్కారాల్లో, రాజకీయ చైతన్యంలో ఈ విషయం చెప్పాలి. మతాన్ని, భాషను, వర్గాన్ని ఆయుధంగా వాడే కుట్రలకు మనం బలి కాకూడదు. నిజానికి ఉగ్రవాదానికి మతం ఉండదు. మాలేగావ్, మక్కా మసీదు, అజ్మీర్ దర్గా, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ల్లో జరిగిన అమానవీయ దాడులే దీనికి నిదర్శనం. అజ్మల్ కసబ్ అయినా, అసిమానంద స్వామి అయినా, ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అయినా అజర్ మసూద్ అయినా ఇలాంటి భావజాలం కలిగిన వారందరూ ఒకే తాను ముక్కలు, మతోన్మాద, ఉగ్రవాదులు.. మానవత్వానికి వ్యతిరేకమైన హింసా ప్రవృత్తికి ఉదాహరణలు..
ఆలోచనలతోనే మార్పు సాధ్యం!
ఈ దేశ సమగ్రతను కాపాడడానికి ఇటువంటి అన్ని రకాల, అన్ని రూపాల ఉగ్రవాదాలకు వ్యతిరేకంగా నిలబడే ధైర్యం మనకు అవసరం. అది మాత్రమే నిజమైన జాతీయత. మతం, భాష, జాతి పేరుతో భయాన్ని వ్యాపింపజేసే వారు ఎవరైనా వారిని వ్యతిరేకించాలి. రాజకీయ నాయకులు ప్రజల్లో అసహనాన్ని రెచ్చగొట్టే మాటలకు బదులుగా, సమాజాన్ని కలుపుకుపోయే సంస్కారాన్ని పెంపొందించాలి. శాంతి అనేది ఆయుధాలతో కాదు, ఆలోచనల మార్పుతో సాధ్యమవుతుంది. అందుకే మానవతా విలువలతోనే ఉగ్రవాదాన్ని ఓడించాలి. ఉగ్రవాదం మన దేశాన్ని ఎప్పటికీ కదిలించలేదు. అటువంటి విధ్వంసక శక్తులతో పోరాడి ఓడించే శక్తి మన దేశానికి ఉంది. ఇంకోసారి ఉగ్రవాదాడి జరిగితే భారత్ ఎప్పటికీ తలవంచదని చూపించాలి.
-యండి. ఉస్మాన్ ఖాన్
99125 80645






