- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్‌పై దౌత్యనీతి, దండనీతి రెండూ అవసరమే!
నేడు ప్రపంచమంతా పరోక్షంగానో, ప్రత్యక్షంగానో యుద్ధ భూమిలోనే ఉంది. కొన్ని దేశాలు ఎదురెదురుగా తలపడుతుంటే

నేడు ప్రపంచమంతా పరోక్షంగానో, ప్రత్యక్షంగానో యుద్ధ భూమిలోనే ఉంది. కొన్ని దేశాలు ఎదురెదురుగా తలపడుతుంటే, మరికొన్ని ముసుగులో దాడులు చేసుకుంటున్నాయి. ఏ దేశమైనా యుద్ధం చేసుకునే దేశాలకు మద్దతు ఇవ్వాలంటే అంతర్జాతీయ పరిణామాలు అనుమతించడం లేదు. ఇప్పుడు ఏ దేశానికి ఆ దేశం సొంత బలం, సొంత వ్యూహం మీదనే ఆధారపడాలి తప్పించి మిగతా మిత్రధర్మాలు, ఔచిత్యాలు అని కూర్చుంటే మొదటికే మోసం వస్తుంది. అందుకు అప్రమత్తతతో వ్యవహరించడం కీలకం. భారత్‌పై పాకిస్తాన్ తాజాగా పహెల్గాంలో ఉగ్రవాదుల్ని ఉసిగొల్పినది. అందుకు బదులుగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించి పాక్ ఆక్రమిత కశ్మీరులో, పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిబిరాల్ని నేలమట్టం చెయ్యడమే కాకుండా సైనికంగా బలమైన కేంద్రాలను కూడా దాదాపు నిర్వీర్యం చేసింది భారత్. చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ తన దాడులు విఫలం కాగా సత్యం బోధపడి కాల్పుల విరమణకు తలూ పింది. అయితే ఇక్కడ గమనించాల్సింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 'భారత్ పాక్‌ల మధ్య సంధి చేయించానని' చెప్పుకోవడం. భారత ప్రధాని స్పష్టంగా 'అదేం లేదు ఇది మా ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం' అన్నారు. కానీ పాకిస్తాన్ ఈ సమస్యను అంతర్జాతీయం చేయడానికే ఎక్కువ ప్రయత్నిస్తుంది. గతంలో ఆగ్రా శిఖరాగ్ర సమావేశంలో కూడా అమెరికా చెప్పబట్టే వచ్చానని అప్పటి పాక్ అధ్యక్షుడు ముషారఫ్ అన్నాడు. ప్రతీసారి పాక్ పాట అదే. అమెరికాకు కూడా ఆ పాటే ఇష్టం. కాబట్టి ఇప్పుడు అలాంటి పప్పులేం ఉడకవని భారత్ పదేపదే అమెరికాకు, ఇతర దేశాలకు గుర్తు చేస్తుండాలి. తీవ్రవాదులు మళ్లీ తలెత్తితే అందుకు పాక్ బాధ్యత తీసుకోక తప్పదని, మూల్యం భారీగానే ఉంటుందని చేతల్లోనే చెప్పాలి. ఎందుకంటే బలహీనమైన ఆ దేశం మనతో ప్రత్యక్ష యుద్ధం ఏనాటికీ చెయ్యలేదు. చెయ్యగలిగింది పరోక్షంగా ఉగ్ర వాదుల్ని పెంచి, మనపై ఎగదోసే ప్రాక్సీ వార్ మాత్రమే. ఆ వ్యూహాన్ని అది వదులుకోదు. వదులుదామన్నా వదలనివ్వకుండా మనపై ఎగదోసే శక్తులకు కొదవ లేదు. కాబట్టి ఆ దేశాన్ని బలహీన పరిచి, అలాంటి సాహసం చేయడం మరింత ప్రమాదం అని గ్రహించేలా భారత్ వ్యవహరించాలి. అందుకు దండనీతితో పాటు దౌత్య నీతి కూడా అవసరం. ప్రపంచ దేశాలు నయానో భయానో భారత్‌నే సపోర్ట్ చేసేలా దేశం ఎదగాలి.
- డా.డి.వి.జి. శంకరరావు,
94408 36931






