- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ ఆర్థిక స్వావలంబన సాధించాలి!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కక్ష సాధింపు చర్యలతో భారత్ భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందోనని

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కక్ష సాధింపు చర్యలతో భారత్ భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందోనని ఇప్పటికిప్పుడే విశ్లేషణ చేసి చెప్పలేం. భారత్‌ను డెడ్ ఎకానమీ దేశంగా ట్రంప్ పేర్కొనడం కేవలం అసూయ ద్వేషాల నుండి వెలువడ్డ మాటలుగానే పరిగణించాలి. భారత్ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనలో భాగంగానే ట్రంప్ భారత్‌పై 50 శాతం టారిఫ్‌లు విధించడమే కాకుండా, రానున్న కాలంలో తన మాట వినకపోతే మరిన్ని ప్రతీకార సుంకాలను విధిస్తానని హెచ్చరించడాన్ని భారత్ సవాల్‌గా తీసుకుని, ఆర్ధిక స్వావలంబన దిశగా పయనించడానికి మార్గాలు అన్వేషించాలి. రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం, ఆయుధ ఒప్పందాలు కుదుర్చుకోవడమే ట్రంప్ ఆగ్రహానికి కారణం. ఏ దేశం ఎవరితో వాణిజ్య సంబంధాలు నెలకొల్పుకోవాలో, ఎవరి వద్ద నుండి ఆయుధాలు కొనుగోలు చేయాలో నిర్ణయించే హక్కు ట్రంప్‌కు ఎవరిచ్చారు? ఇతర దేశాలపై అమెరికా పెత్తనమేంటి? అమెరికా చర్యలతో ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి. అదను కోసం ఎదురు చూస్తున్నాయి. రానూరానూ ఉగ్రవాద దేశాలకు తమ దేశం వ్యతిరేకమన్న అమెరికా వైఖరిలో సుస్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. ట్రంప్ సుంకాల బెడద వలన భారత్ ఆర్థిక వృద్ధి రేటు తగ్గే అవకాశం ఉంది. ఇది భారతీయ పరిశ్రమలపై పెను ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. నాల్గవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి ట్రంప్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ట్రంప్ రష్యా- భారత్ విడిపోవాలని ఎంత ప్రయత్నించినా ఈ దేశాలు అమెరికా వలన ఎట్టి పరిస్థితుల్లోను విడిపోవు. భారతదేశానికి అత్యంత విశ్వసనీయమైన చిరకాల మిత్ర దేశం రష్యా. భారత్- పాక్‌ల మధ్య తానే మధ్య వర్తిత్వం వహించి, ఇరుదేశాలను కాల్పుల విరమణకు ఒప్పించానని ట్రంప్ ప్రకటించినప్పుడే అమెరికాకు భారత్ ధీటైన సమాధానం చెప్పి ఉండాల్సింది. అమెరికా విధిస్తున్న సుంకాలకు బెదిరి పోకుండా, భారత్ తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి.
-సుంకవల్లి సత్తిరాజు
97049 03463






