రక్షణ వ్యవస్థలో 4వ బలమైన శక్తిగా భారత్

by Ravi |   (  Updated:2025-05-29 00:30:56  IST  )

అత్యంత ఆధునిక ఆయుధ సంపత్తి, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన పదునైన ఆయుధాలు, మన త్రివిధ దళాల

రక్షణ వ్యవస్థలో 4వ బలమైన శక్తిగా భారత్
X

అత్యంత ఆధునిక ఆయుధ సంపత్తి, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన పదునైన ఆయుధాలు, మన త్రివిధ దళాల అత్యాధునిక శిక్షణ / అంకితభావం అన్నీ కలిసి నేడు భరతమాతను నాలుగవ అత్యంత శక్తివంతమైన దేశంగా మనల్ని సగర్వంగా నిలి పాయి. భూతలం, సముద్ర ఉపరితలం, గాలిలోనూ అత్యంత శక్తివంతమైన త్రివిధ సాయుధాల దళాలు మన సొంతం. భారత మిలటరీలో 1.45 మిలియన్ల యాక్టివ్ సైనికులు‌, 1.15 మిలియన్ల రిజర్వ్ రక్షణ బలగాలు, 2,229 ఎయిర్‌క్రాఫ్టులు, 4,201 యుద్ధ ట్యాంకులు, స్వదేశీ తేజాస్‌/ అర్జున్‌ లాంటి ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ట్యాంకులతో కూడిన ఆయుధ సం పత్తి, నిరంతరం దేశ రక్షణలో సిద్ధంగా ఉన్నాయి, భారతాన్ని అభేద్యమైన దేశంగా నిలుపుతున్నాయి.

గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ ఇండెక్స్ ప్రకారం..

“గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ ఇండెక్స్-2025” ప్రకారం, 145 దేశాల మిలటరీ పవర్‌ ఆధార జాబితాలో భారత్‌ 4వ స్థానంలో ఉన్నట్లు నిర్ణయించారు. రక్షణ శాఖలో సుశిక్షితులైన త్రివిధ బలగాల సంఖ్య, అణ్వాయుధ సామర్థ్యం, స్వదేశీ ఆయుధ పరిజ్ఞానం, అత్యంత ఆధునిక ఆయుధ సంపత్తి, దేశ ఆర్థిక పరిస్థితి, సహజ భౌగోళిక స్థానం, రక్షణశాఖ బడ్జెట్‌, లాజిస్టిక్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సామర్థ్యం, అందు బాటులో ఉన్న విలువైన సహజ వనరులు లాంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ ఇండెక్స్‌-2025ను రూపొందించారు. నేడు అమెరికా, రష్యా, చైనా తర్వాత 4వ అత్యంత బలమైన శక్తి గల భద్రతా వ్యవస్థగా మన భారత్ నిలిచింది. ఆధునిక టెక్నలాజికల్‌ ఇన్నోవేషన్లు, సైబర్‌ వార్‌ఫేర్‌ సామర్థ్యం, గ్లోబల్‌ అలియాన్స్‌, ఆర్థిక ప్రతిష్టత లాంటివి నేడు ఆయా దేశాల రక్షణ దళాల బలానికి కారణం అవుతున్నాయి.

4వ బలమైన శక్తిగా..

అతి తక్కువ మిలటరీ సగటు వయస్సు కలిగిన దేశంగా భారత్‌ ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. అత్యంత బలమైన ఆర్మీ, దేశ అధిక జనాభా, సాయుధ వాహనాలు, రహదారులు, బొగ్గు ఉత్పత్తి, లేబర్‌ ఫోర్స్‌ లాంటి వనరులు అత్యధికంగా కలిగిన 2వ దేశంగా భారత్‌ నిలబడింది. అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థ కలిగిన 4వ దేశంగా భారత్ ధైర్యంగా‌ నిలబడింది. మొబైల్‌ ఆర్టిలరీ ఫీల్డ్‌ గన్స్‌, నావల్‌ ఏయిర్‌ క్రాప్ట్‌ క్యారియర్స్‌ ఫ్లీట్‌ బలం, పర్చేజ్‌ పవర్‌ పారిటీల్లో 3వ స్థానంలో భారత్‌ నిలుస్తున్నది. మొత్తం మిలటరీ ఎయిర్‌ క్రాఫ్టులు, ఫైటర్‌ ఏర్‌ క్రాఫ్టులు, ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌ క్రాఫ్టులు, హెలికాప్టర్లు, నావల్‌ వార్‌షిప్‌ డిస్ట్రాయర్లు, టోటల్‌ రైల్వే కవరేజ్‌, డిఫెన్స్‌ బడ్జెట్‌ రంగాల్లో ప్రపంచ దేశాల్లో 4వ స్థానంలో ఉన్నది మన భారతం.

త్రివిధ దళాలు అభేద్యం!

ఇండియన్‌ ఆర్మీ, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్, ఇండియన్‌ నావల్‌ సర్వీసులు అత్యంత శక్తివంతమైన ఆయుధాలను, డిఫెన్స్‌ వ్యవస్థలను కలిగి సైనిక సంఖ్యలో అత్యధిక శక్రివంతమైన దేశంగా నేడు భారత్‌ ప్రపంచ దేశాల ముందు సగర్వంగా, ఆయుధాలు చేత పట్టుకొని, తలెత్తుకొని, విజయ దరహాసంతో ధైర్యంగా నిలబడుతున్నది. నేడు కొనసాగుతున్న ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పూర్తిస్థాయి యుద్ధమే జరిగితే కొన్ని గంటలు లేదా ఒకటి రెండు రోజుల్లో పాకిస్తాన్ నేలమట్టం కావడం, పీఓకెను తిరిగి మనం స్వాధీనం చేసుకోవడం జరగడం ఖాయమని మన త్రివిధ దళాల బలాలు, బలగాలు రుజువు చేస్తున్నాయి.

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి

99497 00037

Next Story