- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగ సంక్షోభంలో భారత్!
భారతదేశం ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక శక్తిగా గుర్తింపు పొందినప్పటికీ, ఈ మధ్యకాలంలో ఆర్థిక క్షీణత, నిరుద్యోగిత

భారతదేశం ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక శక్తిగా గుర్తింపు పొందినప్పటికీ, ఈ మధ్యకాలంలో ఆర్థిక క్షీణత, నిరుద్యోగిత, సామాజిక అసమతుల్యతలు దేశాన్ని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఏటా కోటి మంది యువత ఆశలతో డిగ్రీలు పట్టుకుని బయటకు వస్తున్న తరుణంలో, ఉపాధి అవకాశాల లోపం భవిష్యత్తుపై ఆందోళన రేపుతోంది. విద్య, నైపుణ్యం, ప్రభుత్వ విధానాలు, గ్లోబల్ సంక్షోభాల కలయిక మన దేశ దిశను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి.
నైపుణ్య లోటు కారణంగా..
ప్రస్తుతం భారతదేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. 2024 ప్రారంభంలో దేశంలోని మొత్తం పని చేయగల జనాభాలో నిరుద్యోగ రేటు సగటున 7.5%గా ఉన్నా, 15 నుంచి 29 ఏళ్ల మధ్య యువతలో ఇది 16.1%గా నమోదవడం, యువతపై ఈ సంక్షోభ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. ప్రస్తుతం విద్యా వ్యవస్థ, నైపుణ్య లోటు ఉపాధి సమస్యను మరింత తీవ్రంగా మార్చుతున్నాయి. భారత కార్మిక శక్తిలో కేవలం 4.7% మందికే అధికారిక శిక్షణ ఉందని నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నివేదిక చెబు తోంది. ఇది దక్షిణ కొరియా (96%), జర్మనీ (75%) వంటి దేశాలతో పోలిస్తే చాలా తక్కువ.
నేరాలు పెరగడానికి కారణం..
2016లో నోట్ల రద్దు లక్షలాది చిన్న వ్యాపారాలను కుదేలు చేసింది. 2017లో జీఎస్‌టీ అమలుతో అసంఘటిత రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. పైగా, 250కి పైగా కార్మిక చట్టాలు పెట్టుబడిదారులను నిరుత్సాహ పరిచేలా మారాయి. ఇక కొవిడ్ భారత ఆర్థిక వ్యవస్థపై ఊహించని దెబ్బ కొట్టింది. దీని దెబ్బతో సేవల రంగం క్షీణించింది. ప్రస్తుతం ఆటోమేషన్, ఏఐ వలన తక్కువ నైపుణ్యం గల ఉద్యోగాలు మాయమవుతున్నాయి. గ్రామీణ భారతంలో ఉండే వ్యవసాయ రంగం దేశంలోని మొత్తం ఉద్యోగాల్లో సుమారు 45% మందికి ఉపాధిని కల్పిస్తున్నా, దాని జీడీపీ వాటా కేవలం 16.18% మాత్రమే. వ్యవసాయ ఆదాయ అస్థిరత, కుట్టు పరిశ్రమల క్షీణత, పట్టణాలకు వలసలు గ్రామీణ నిరుద్యోగాన్ని పెంచుతున్నాయి. ఈ సంక్షోభం సామాజిక స్థిరతపై ప్రభావం చూపుతోంది. 2019లో జరిగిన అధ్యయనం ప్రకారం, నిరుద్యోగిత, నేరాల మధ్య స్పష్టమైన సంబంధం ఉంది. ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం, నిరుద్యోగం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో దోపిడీలు, దొంగతనాలు, యువతపై గ్యాంగ్ ప్రభావాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇది దేశ భద్రతకే ముప్పుగా మారే ప్రమాదం ఉంది.
అభివృద్ధి గణాంకాలలో కాకుండా..
ఇక ప్రభుత్వ పథకాల ప్రభావం పరిమితంగానే ఉంది. స్కిల్ ఇండియా ద్వారా శిక్షణ పొందినవారిలో కేవలం 15% మందికే స్థిర ఉద్యోగాలు లభిస్తున్నాయి. స్టార్టప్ ఇండియా ద్వారా 70,000కు పైగా స్టార్టప్‌లు రిజిస్టర్ అయినా, వాటిలో సుమారు 95% ఐదు సంవత్సరాల్లో మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో, భారతదేశం ధైర్యవంతమైన, దిశానిర్దేశక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తయారీ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలి, MSME లకు ఆర్థిక సాయం అందించాలి. విద్యా వ్యవస్థను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మలచాలి. సామా జిక భద్రత వ్యవస్థను బలోపేతం చేయాలి. పట్టణ, గ్రామీణ వ్యత్యాసాలను తగ్గించే విధంగా సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం వ్యుహరచన చేయాలి. అభివృద్ధి కేవలం గణాంకాలలో కాకుండా, జీవన ప్రమాణాల్లో కనిపించాలి. భారత్ ఆర్థికంగా ఎదగాలంటే, ఉద్యోగ భద్రత, సామాజిక స్థిరతపై తక్షణ చర్యలు అవసరం.
- ముహమ్మద్ ఉబైద్ ఖాన్
99125 80645






