సామాన్యులకు అందని అభివృద్ధి ఫలాలు..!

by Ravi |   (  Updated:2025-06-12 01:15:17  IST  )

ప్రపంచంలోని అనేక సవాళ్లు, అనిశ్చితుల నేపథ్యంలోనూ భారత ఆర్ధిక వ్యవస్థ సుస్థిర వృద్ధిని నమోదు చేస్తూ పెట్టుబడులకు గమ్య

సామాన్యులకు అందని అభివృద్ధి ఫలాలు..!
X

ప్రపంచంలోని అనేక సవాళ్లు, అనిశ్చితుల నేపథ్యంలోనూ భారత ఆర్ధిక వ్యవస్థ సుస్థిర వృద్ధిని నమోదు చేస్తూ పెట్టుబడులకు గమ్య స్థానంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న మూడేళ్లలో జర్మనీని కూడా అధిగమించి 3వ స్థానానికి భారత స్థూల జాతీయోత్పత్తి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

భారత దేశంలో మూడు దశాబ్దాల క్రితం మొదలైన సరళీకృత ఆర్ధిక విధానాల ఫలితంగా జాతీయ ఆదాయ వృద్ధి రేట్లలో గణనీయమైన పెరుగుదల నమోదై ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థలలో ఒకటిగా ఎదిగింది. పేదరికం సైతం అంతకు ముందు కంటే సగానికి తగ్గినా, ఆర్ధిక అసమానతలు మాత్రం పెచ్చు మీరాయి. అమెరికా, చైనా, జర్మనీ తరువాత ప్రపం చంలో నాలుగో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ అవతరించింది.

తలసరి ఆదాయంలో దిగువన...

ఒకవైపు జీడీపీ పరంగా భారత ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలో నాలుగో అతి పెద్దది. కానీ తలసరి ఆదాయంలో మాత్రం 141 వ స్థానంలో ఉంది. గత కొన్నేళ్లలో తలసరి ఆదాయం విషయంలో మెరుగైన పురోగతిని సాధించినా.. ఇప్పటికీ మొదటి పది దేశాల ఆర్ధిక వ్యవస్థలలో తలసరి ఆదాయ పరంగా భారత్ అట్టడుగు స్థానంలో ఉంది. అయితే ప్రపంచ ఆర్ధిక భవిష్యత్తు(డబ్ల్యూఈఓ) నివేదిక ప్రకారం 2013-14లో 1,438 డాలర్లు (రూ.1.22 లక్షలు)గా ఉన్న భారత తలసరి ఆదాయం 2025 నాటికి రెట్టింపై 1,880 డాలర్ల (రూ.2.45 లక్షలు)కు పెరిగింది. జీడీపీలో జపాన్‌ను అధిగమించినప్పటికీ తలసరి ఆదాయపరంగా తీవ్ర అంతరం ఉంది.

చైనాతో పోటీ పడాల్సింది ఇక్కడే..!

అధిక జనాభా దేశాలైన భారత్, చైనా దేశాల ఆర్ధిక వ్యవస్థలు 1990లో దాదాపు సరిసమానంగా ఉంటే, నేడు చైనా మనకన్నా తలసరి ఆదాయంలో (13,690 డాలర్లు) అంటే సుమారు ఏడు రెట్లు, స్థూల జాతీయోత్పత్తిలో (19.231 ట్రిలియన్ డాలర్లు)తో దాదాపు ఐదు రెట్లు అధికంగా ఉంది. నూతన ఆర్ధిక విధానాలు ప్రజల నిజ ఆదాయాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసినా, అభివృద్ధి ఫలాలు మాత్రం అందరికీ దక్కలేదు. దేశంలో ఆదాయం, ఆస్తులు, అవకాశాలు కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం అయ్యాయి. ప్రపంచంలోని అత్యంత పేదల్లోనూ ఇండియా వాటా ఎక్కువగానే ఉంది. జనాభా పెరిగేకొద్దీ తలసరి ఆదాయం తగ్గుతుంది. ఆర్ధిక వ్యవస్థ తనను తాను స్థిరపరచుకుని, అభివృద్ధి సాధిస్తూ స్థిరమైన తలసరి ఆదాయాన్ని కలిగి ఉంటే జనాభా పెరుగుదల ఆర్ధిక వృద్ధికి అడ్డంకిగా మారదు. తలసరి ఆదాయంలో వృద్ధి దేశ ఉత్పాదకత, ఆదాయాలను పెంచుతుంది. ఇవి పెరిగినప్పుడు దేశ జీడీపీ పెరుగుతుంది.

అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు..

దేశ తలసరి ఆదాయాన్ని పెంచాలంటే దీర్ఘకాలిక, సమగ్ర విధానాలతో విద్య, పరిశ్రమ, వ్యవసాయం, ఆరోగ్యం, జనాభా నియంత్రణ వంటి రంగాల్లో నిలకడైన వృద్ధి సాధించాలి. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే నిపుణత కలిగిన మానవ వనరులు అత్యంత ప్రధానం. కానీ అక్షరాస్యతలో 127 దేశాలలో 106వ స్థానంలో, మానవ వనరుల అభివృద్ధి సూచికలో 193 దేశాలలో 130వ స్థానంలో ఉన్న భారతదేశం విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టడం అత్యంత ఆవశ్యకం. ప్రతి పౌరుని అక్షరాస్యులను చేయడమే కాకుండా ఉన్నత విద్యావకాశాలు కల్పించాలి. కేవలం బోధనే కాకుండా, పారిశ్రామిక అవసరాలకు తగిన నైపుణ్య కార్మికులను అభివృద్ధి చేయడానికి, ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి ఉద్యోగ శిక్షణ ఇవ్వాలి.

శ్రమించే రైతాంగం.. ఉన్నా

భారత్ ప్రాథమికంగా వ్యవసాయ ఆధారిత దేశం. శ్రమించే రైతాంగం ఉన్నా ప్రపంచ ఆహార భద్రతలో 113 దేశాల్లో 68వ స్థానంలో, శ్రామిక ఉత్పాదకతలో 190 దేశాల్లో 133వ స్థానంలో కొనసాగడానికి కారణం ఏమిటో ఆలోచన చేయాలి. మన గ్రామీణ ప్రాంతాల్లోని సుమారు 9 కోట్ల 31 లక్షల (54 శాతం) మంది రైతు కుటుంబాలలో దాదాపు 90 శాతం 2 హెక్టార్ల కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు.. చిన్న కమతాల వలన రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఆచరించి ఉత్పాదకతను పెంచలేక నష్టపో తున్నారు. వ్యవసాయ ఆధునీకరణ, సరసమైన రుణాలు, స్మార్ట్ వ్యవసాయ నిర్వహణలో తోడ్పడటం, పంట వైవిధ్యీకరణ (క్రాప్ డైవర్సిఫికేషన్), మధ్య దళారీల ప్రభావం తగ్గించి రైతు నుండి తుది వినియోగదారునికి ఉత్పత్తి చేరే వరకు సమర్థ వంతమైన సరఫరా గొలుసు ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ఆదాయ వృద్ధి మార్గంగా తీర్చిదిద్దాలి.

నిజమైన ఆర్ధిక ప్రగతి..

విభిన్న ఆదాయ వర్గాలకు అనుగుణంగా వృద్ధి వ్యూహాలను రూపొందించి, అమలు చేసినప్పుడే దేశం నిజమైన ఆర్ధిక ప్రగతి సాధిస్తుంది. ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం.. అధికాదాయ దేశంగా గుర్తించబడాలంటే 14.005 డాలర్ల (ప్రస్తుతం కన్నా ఐదు రెట్లు ఎక్కువ) తలసరి ఆదాయం సాధించాల్సి ఉంటుంది. మెరుగైన ఉపాధి, ఉద్యోగ కల్పన వలన మధ్యతరగతి వినియోగ శక్తి మెరుగై వారి తలసరి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు దక్కితే, ఆర్ధిక అసమానతల అంతరం తగ్గి, నిపుణులు అంచనా వేస్తున్నట్టు 2047 నాటికి మన దేశ ఆర్ధిక వ్యవస్థ 30 లక్షల డాలర్లకు చేరుకొని సంపన్న దేశంగా అవతరించే అవకాశం ఉంటుంది.

లింగమనేని శివరామ ప్రసాద్

రాజకీయ, సామాజిక విశ్లేషకులు

79813 20543

Next Story