ఈ దేశంలో.. నిరుపేదలకు బతికే హక్కు లేదా?

by Ravi |   (  Updated:2025-07-25 01:00:18  IST  )

భారతదేశం, ఒక వైవిధ్యభరితమైన సాంస్కృతిక, ఆర్థిక దేశంగా ప్రపంచ వేదికపై గుర్తింపు పొందినప్పటికీ, దేశంలోని మురికివాడల్లో

ఈ దేశంలో.. నిరుపేదలకు బతికే హక్కు లేదా?
X

భారతదేశం, ఒక వైవిధ్యభరితమైన సాంస్కృతిక, ఆర్థిక దేశంగా ప్రపంచ వేదికపై గుర్తింపు పొందినప్పటికీ, దేశంలోని మురికివాడల్లో నివసించే నిరుపేదల జీవితాలు ఇంకా దుర్భరమైన సవాళ్లతో నిండి ఉన్నాయి. పట్టణీకరణ, అభివృద్ధి పేరిట జరుగుతున్న వారి ఇళ్ల కూల్చివేతలు ఈ వర్గాన్ని రోడ్డున పడేస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కూల్చివేతలు, వారి జీవనాధారాన్ని, వారి ఆశలను నాశనం చేస్తూ, వారి పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

ఇక్కడ ఉద్భవించే ప్రశ్న ఒక్కటే.. కూల్చివేతల తర్వాత వీరు ఎక్కడికి వెళ్లాలి? వీరికి బ్రతికే హక్కు లేదా? ఈ అన్యాయం భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో జరిగిన, జరుగుతున్న ఒక దురదృష్టకర వాస్తవం. ఈ సమస్యకు పరిష్కారం ఎవరు చూపాలి? ఎవరు ఈ కూల్చివేతలకు బాధ్యత వహించాలి?

పునరావాసం లేని విధ్వంసకాండ

మురికివాడలు భారతదేశ పట్టణ జీవనంలో అనివార్య భాగం. ఈ ప్రాంతాల్లో నివసించే లక్షలాది మంది నిరుపేదలు నగరాల ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు. నిర్మాణ కార్మికులు, గృహ కార్మికులు, రిక్షా డ్రైవర్లు, చిన్న వ్యాపారులు వీరంతా నగర జీవనాన్ని నడిపించే శక్తులు. అయినప్పటికీ, వారి జీవితాలు అస్థిరత్వంతో నిండి ఉన్నాయి. కానీ పట్టణీకరణ పేరిట, స్మార్ట్ సిటీలు, మెట్రో రైలు ప్రాజెక్టులు, రహదారుల విస్తరణ వంటి అభివృద్ధి పథకాల కోసం వారి ఇళ్లు కూల్చి వేయబడుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మహా నగరాల నుండి హైదరాబాద్, అహ్మదాబాద్ వంటి రెండవ స్థాయి నగరాల వరకు ఈ కూల్చివేతలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఉదాహరణకు, ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ సన్నాహాల సమయంలో యమునా నది తీరంలోని మురికివాడలు భారీగా కూల్చివేశారు. ఆ కూల్చివేతల్లో దాదాపు 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారని అంచనా. మళ్లీ 2023లో "తుగ్లకాబాద్" ప్రాంతంలో వందలాది కుటుంబాలు తమ ఆవాసాలు కోల్పోయాయి. ముంబైలో ధారావి వంటి ఆసియాలోనే అతి పెద్ద మురికివాడలో రీడెవలప్‌మెంట్ పేరిట వేలాది గుడిసెలు కూల్చివేశారు. ఈ గణాంకాలు ఒక్కొక్క రాష్ట్రంలోనూ వేర్వేరుగా ఉన్నప్పటికీ, సమస్య ఒకే విధంగా కొనసాగుతోంది. ఇది పునరావాసం లేని కూల్చివేతల విధ్వంసకాండ.

సుప్రీంకోర్టు చెప్పినా..

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, ప్రతి పౌరుడికి జీవన హక్కు, గౌరవప్రదమైన జీవనం హామీ ఇవ్వ బడింది. అయితే, ఈ హక్కు నిరుపేదల విషయంలో ఉల్లంఘించబడుతోంది. కూల్చివేతల సమయంలో ప్రభుత్వం తరచూ అక్రమ నిర్మాణాలు అనే సాకునే ఉపయోగిస్తుంది. కానీ, ఈ నిర్మాణాలు అక్రమంగా ఉన్నాయని నిరూపించే ముందు, వాటిలో నివసించే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? సుప్రీంకోర్టు కూడా ‘ఒల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్’ (1985) కేసులో పునరావాసం లేకుండా కూల్చివేతలు చేస్తే అది జీవించే హక్కును ఉల్లంఘించడమే స్పష్టం చేసింది. అయి నప్పటికీ, ఈ తీర్పు అమలు కావడం చాలా అరుదు. ఒకవేళ ప్రభుత్వాలు పునరావాసం కల్పించినా అవి తమ జీవనోపాధిని కోల్పోయే విధంగా ఉంటున్నాయి. ఇక ఈ కూల్చివేతల వెనుక ఉన్న ఆర్థిక, రాజకీయ ఒత్తిళ్లను కూడా పరిశీలించాలి. పట్టణ భూమి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో, మురికి వాడలు ఉన్న ప్రాంతాలు రియల్ ఎస్టేట్ డెవలపర్లకు బంగారు గనులుగా కనిపిస్తున్నాయి.

సామాజిక న్యాయాన్ని సాధించాలంటే..

పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రకటి‌స్తోంది. అయితే, ఈ పథకాలు నిరుపేదలకు నిజమై‌న భద్రతను అందించడంలో విఫలమవుతున్నాయి. 2023 నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం, భారతదేశంలో 41.37 శాతం జ‌నాభా ఇంకా గృహ సౌకర్యాల నుండి దూరంగా ఉంది. ఈ గణాంకాలు, కూల్చివేతల ద్వారా నిరాశ్రయులైన వారి సంఖ్య ను ఖచ్చితంగా ప్రతిబింబించకపోవచ్చు, కానీ సమస్య తీవ్రత ను సూచిస్తున్నా‌యి. ఈ అన్యాయానికి పరిష్కారం చూపేం దుకు ప్రభుత్వం కూల్చివేతలకు ముందు సమగ్రమైన పునరావాస ప్రణాళికను రూపొందించాలి. అప్పుడే కూల్చి వేతలు ప్రారంభించాలి. నిజానికి నిరుపేదల ఇళ్లను కూల్చి వేయడం అంటే కేవలం భౌతిక నిర్మాణాలను తొలగించడం కాదు.. అవి వారి ఆశలను, కలలను, భవిష్యత్తును సర్వనాశనం చేయడం. ప్రభుత్వం, సమాజం కలిసి ఈ అన్యాయాన్ని అరికట్టకపోతే, భారతదేశం అభివృద్ధి కేవలం గణాంకాలకు, గాజు భవనాలకు పరిమితమై, నిజమైన సామాజిక న్యాయాన్ని సాధించలేదు. నిరుపేదలకు బతికే హక్కు, గౌరవప్రదమైన జీవనం అందించడం కేవలం రాజ్యాంగ బాధ్యత మాత్రమే కాదు. అది మానవత్వానికి, భారతీయ ఆధ్యాత్మిక సూక్తి ‘సర్వేజనా సుఖినోభవంతు’ అనే ధార్మికత భావానికి పరీక్ష కూడా..!

డాక్టర్. కోలాహలం రామ్ కిశోర్

9849328496

Next Story