అందమైన పూలల్లికల బతుకమ్మ

by Ravi |   (  Updated:2025-09-27 00:45:43  IST  )

బతుకమ్మ ఆట సంబరాలు బాధలను మరిపిస్తుంది. మగువలందరికీ పూల సుగంధాలు, మానవ సంబంధాలు రంగు రంగుల పూలు, రకరకాల

అందమైన పూలల్లికల బతుకమ్మ
X

బతుకమ్మ ఆట సంబరాలు బాధలను మరిపిస్తుంది. మగువలందరికీ పూల సుగంధాలు, మానవ సంబంధాలు రంగు రంగుల పూలు, రకరకాల ఆలోచనలు అన్నీ ఏకమైన వేళ ఒక బతుకమ్మ పండుగ. పూలతో పేర్చిన బతుకమ్మకు వరుస వరుసలో ఎన్నో విన్నపాలు తీరోక్క పూల బంగారు తల్లికి కనిపించని కష్టాలన్నీ ఆమెకే చెప్పుకున్నట్లు ఆడబిడ్డల అర్తనాదాలు అన్ని తెలుసుకున్న తల్లి బతుకమ్మ. ముళ్ల నుండి గతుకు బొతుకుల నేల నుండి రాళ్ల నుండి నీరు అందని ప్రదేశాల నుండి తామెన్ని బాధలు పడ్డామో.. ఐనా అందమైన పుష్పాలు వాటికి పుప్పొడులు అందించామని కష్టాలు సుఖాలు సహజ లక్షణాలని తెలిపే చల్లగా బతుకుమని దీవించే బతుకమ్మ ఈ బతుకమ్మ పండుగ.

మహిళల మురిపాల మధుర హేల..

ఓ నిండైన పూల వెన్నెల మహిళల మురిపాల మధుర హేల. మగువల మనసున పూచే మందారమాల. పూల తరంగాల లలిత రాగాల బతుకు లీల ఈ బతుకమ్మ. తెలంగాణ గుండె తంగేడు చెపుడై పాలపిట్ట పిలుపు దసరా సందడై జమ్మి చెట్టు నీడలో మన జన్మ జన్మ ధన్యమై ఆత్మీయ బంధాలు అల్లుకున్న వేళ. అల్లిపూల్ల తీరు అందమైన రూపు ఎర్ర ఎర్రని కట్ల పూలు కుటుంబ కలహాలుకు తావులేని కట్టడి కావాలె. నీలిరంగు కట్ల పూలు నిన్ను నన్ను మర్చిపోలేని స్నేహ బంధమై నిలిపే రుద్రాక్ష పూలు పూచి, రంది లేని బతుకు రాజా బతుకని మల్లెపూలతో మాటలాడినది. తంగేడు, గుమ్మడి పూలు తమకు ఎవరు సాటి రారని బతుకమ్మకు తాము ముఖ్యమని గునుగు, చామంతుల సమక్షంలో పూలవనమంతా తరలి రావాలని మనమంతా ఒక్కటిగా ఉండాలని, సద్దుల బతుకమ్మను సత్తు ముద్దల నైవేద్యంతో పసుపు గౌరమ్మతో పూజించి రంగురంగుల పూల సాక్షిగా అతివలందరు ఆడి పాడి ఆనందపడతారు..

కొండంత పండుగ సద్దుల బతుకమ్మ

పిల్లల పెద్దల సంతోషం దసరా సంబరం కలగలిసి తెలంగాణ నిండా కొండంత పండగ సద్దుల బతుకమ్మ. విజయ దశమి మన తెలంగాణలో పల్లె, పల్లెల్లో, గ్రామ, గ్రామాలు, పట్టణాలు, నగరాలు అన్నింట ప్రజలు ఆనందంగా, సంప్రదాయంగా జరుపుకోవాలని కోరుకుందాం. అమ్మవారి ఆశీస్సులు అందుకుందాం. జయీభవ, దిగ్విజయీభవ అనే నినాదం చెవుల నిండా మారుమోగుతుండగా దసరా వేడుకలు మన మన తెలుగుదనానికి నూతనోత్సాహానికి నాంది కావాలని మనసారా ఆశిద్దాం. మంచికి చెడుకి యుద్ధం ఎప్పుడూ ఉంటుంది. మహిషాసుర మర్దిని అవతారం మంచికి మార్గమై మన కష్టాలు తీరుస్తాయని కనకదుర్గను కనులారా నిలుపుకొని ప్రణమిల్లి దసరా సెలవుల సంబరాలు అంబరాన్ని అంటగా ముత్తయిదువలు, పిల్లలు, పెద్దలు అందరూ సకల సంతోషాలతో షోబిల్లాలని కాంక్షిద్దాం.

“అన్ని రంగుల పూల అమరిక

తెలంగాణ తల్లి కొమరిక

బతుకుమని దీవించే దేవిక

పూల బతుకమ్మల ఏలిక

సరిహద్దులు దాటే సంబరమిక

సద్దుల బతుకమ్మ పండుగిక

ఆడబిడ్డల కళ్ళలో ఆనందంమిక

పిల్లలు పెద్దలు కలిసి ఆడుదామిక

దసరా పండుగ హాయిగా గడుపుదామిక”


- బొమ్మిదేని రాజేశ్వరి,

90527 44215

Next Story