- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా రిజర్వేషన్ అమలు నిజమా.. రాజకీయ వ్యూహమా?
నారీ శక్తి వందన్ అధినియమ్ బిల్లు సవరణలు చేసి 2029 ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఇది నిజమైన సాధికారతకు దారితీసే నిర్ణయమా? లేక రాజకీయ వ్యూహమా?

ఏప్రిల్ 16 నుంచి 18 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, ‘నారీ శక్తి వందన్ అధినియమ్’లో సవరణలు చేసి, 2029 ఎన్నికల నుంచి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని ఎన్‌డీఏ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం ప్రకటించింది. అయితే భారత రాజకీయాల్లో మహిళల సాధికారతకు ప్రభుత్వం నిజంగానే కట్టుబడి ఉందా? లేదా మహిళా రిజర్వేషన్ చట్టం కేవలం వ్యూహాత్మక రాజకీయ నాటకమా?
నిజానికి ఇది ప్రతిపక్ష కూటమిని ఇరకాటంలో పెట్టడానికే అని అనిపిస్తున్నది. అధికార కూటమి చర్యల వెనుక తాజా ఉద్దేశ్యాలపై పలు సందేహాలు రేకెత్తుతున్నాయి. రిజర్వేషన్ అమలు ప్రశ్న ఇంకా ఒక అసంపూర్తి హామీలా గాలిలో తేలియాడుతోంది.
డీలిమిటేషన్ మెలికతో వాయిదా..
ముందుగా వాస్తవాలు పరిశీలిద్దాం. 2023లో ఆమోదం పొందిన 106వ రాజ్యాంగ సవరణ చట్టం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు మూడో వంతు సీట్లు కేటాయిస్తూ, ప్రతి డీలిమిటేషన్ పర్యాయానికొకసారి రిజర్వ్ నియోజకవర్గాలను మార్చే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టాన్ని ఆమోదింపజేసినందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రశంసలు పొందింది. కానీ అమలు విషయంలో వచ్చిన ఒక కీలక మెలిక ఆచరణకు అవరోధంగా మారింది. చట్టం మొదటి ప్రతిపాదన ప్రకారం తదుపరి జనగణన పూర్తై, డిలిమిటేషన్ జరిగాకే రిజర్వేషన్ అమల్లోకి రావాలి. కానీ ఇప్పటికే 2021 జనగణన వాయిదా పడుతూ వచ్చింది. ఈ అసాధారణ పరిస్థితి వల్ల అమలు 2030ల వరకూ వాయిదా పడుతుందని అప్పుడే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు, 2029 ఎన్నికలు సమీ పిస్తుండగా, అదే ప్రభుత్వం హఠాత్తుగా సవరణల దిశగా అడుగులు వేస్తోంది. లోక్‌సభ సభ్యుల సంఖ్యను 543 నుంచి 850కి పెంచి, అందులో 33 శాతానికి పైగా స్థానాలను మహిళలకు కేటాయించాలనే ప్రతిపాదన చేస్తున్నది. అలాగే జనగణనతో ఉన్న అనుసంధానాన్ని తొలగించి, ఇప్పటికే ఉన్న గణాంకాల ఆధారంగా అమలు చేయాలని నిర్ణయిస్తున్నది. ఈ ఆకస్మిక మార్పు అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.
రాజకీయ అవసరంగా సవరణలు..
2014 నుంచే స్పష్టమైన మెజారిటీ ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం, 27 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లు విషయంలో 2023 వరకూ ఎందుకు వేచి చూసింది? యూపీఏ ప్రభుత్వాలు ప్రయత్నించినా, రాజకీయ ఏకా భిప్రాయం లేక విఫలమయ్యాయి. కానీ ఎన్‌డీఏ ముందుగానే దీన్ని ఆమోదింపజేసుకున్నది. కానీ, అమలు ఆలస్యం అయ్యేలా షరతులు చేర్చడం వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయనే అనుమానం కలుగుతోంది. 2024 ఎన్నికలపై ప్రభావం లేకుండా ఉండేందుకు ఇదే మార్గమని విమర్శకులు అప్పుడు సందేహం వ్యక్తం చేశారు. ఇప్పుడు, బీజేపీ స్వతంత్ర మెజారిటీ కోల్పోయిన నేపథ్యంలో, సవరణలు రాజకీయ అవసరంగా ముందుకు వస్తున్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.
ప్రధాని లేఖ ఇంత లేటుగానా?
ప్రధాని మోదీ 2026 ఏప్రిల్ 11న అన్ని పార్టీల నేతలకు రాసిన లేఖలో ‘మహిళా సాధికారతకు ఏకగ్రీవ మద్దతు’ కోరారు. అయితే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మధ్యలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం అధికార కూటమి ఉద్దేశ్యాలపై సందేహాలకు తావిస్తోంది. లోక్‌సభ సభ్యుల సంఖ్య పెంచాలనుకుంటున్న ఎన్‌డీఏ, పార్లమెంట్ విస్తరణతో ప్రాంతాల మధ్య సమతుల్యత కాపాడుతామని చెబుతోంది. కానీ ఇదే వాదన 2023లో ఎందుకు వినిపించలేదు? అప్పుడే జనగణనను పూర్తి చేసి ఉండి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదు.. ప్రస్తుతం 2011 గణాంకాలను ఆధారంగా తీసుకోవడం వల్ల రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధి లేదేమోననే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ కొత్త చట్టంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేక కోటా లేదు. ఇది సామాజిక న్యాయాన్ని పాక్షికంగా మాత్రమే నెరవేర్చే ప్రక్రియగా ఉండబోతున్నది. అలాగే రాజ్యసభ, శాసన మండళ్లకు ఈ రిజర్వేషన్ వర్తించదు. రాజకీయ పార్టీల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచే దిశగా ఎన్‌డీఏ చర్యలు పరిమితంగానే ఉన్నాయి. బీజేపీ కూడా సాధారణ స్థానాల్లో 33 శాతం మహిళా అభ్యర్థులను నిలబెట్టడంలో వెనుకబడి ఉన్నది.
సీట్ల కేటాయింపు త్వరగా చేపట్టాలి!
మహిళల ఉపాధి శాతం తక్కువగా ఉండటం, రాజ కీయాల్లో తక్కువ ప్రాతినిధ్యం ఉండటం వల్ల విధానాల్లో లోపాలు వస్తున్నాయి. గ్రామీణ స్థాయిలో మహిళా నాయకత్వం మంచి ఫలితాలు ఇచ్చినట్టు పరిశోధనలు చెబుతున్నాయి. కానీ జాతీయ స్థాయిలో అదే ఫలితాలు రావాలంటే, సీట్ల కేటాయింపు త్వరగా చేపట్టాలి. అదే సమయంలో ఈ చట్టం సామర్థ్యాన్ని నిరాకరించలేం. 2029లో అమలు అయితే, దాదాపు 300 మంది మహిళలు దేశ చట్టసభలో ప్రత్యక్ష పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఇది భారత ప్రజాస్వామ్యానికి కీలక ముందడుగు. కానీ నిజమైన నిబద్ధత మాటల్లో కాదు.. అమలులో, నిరంతర చర్యల్లో, నిజమైన సంకల్పంలో కనిపించాలి.
కేంద్రం నిబద్ధతపైనే సందేహం
ఎన్‌డీఏ గత దశాబ్దంలో ఈ బిల్లును వాయిదా వేసి, ఇప్పుడు రాజకీయ అవసరాల నేపథ్యంలో ముందుకు తీసుకు రావడం అనేక విమర్శలకు దారితీస్తోంది. మహిళా సాధికారతపై నిజమైన నమ్మకం ఉంటే, ప్రభుత్వం పార్టీ స్థాయిలో మార్పులు తీసుకురావాలి, విభిన్న వర్గాలకు న్యాయం చేయాలి, మహిళా నాయకత్వాన్ని ఎన్నికల రాజకీయాలకు మించిన హక్కుగా చూడాలి. భారత మహిళలు చాలా కాలంగా ఈ విప్లవాత్మక నిర్ణయం అమలుకోసం ఎదురుచూస్తున్నారు. ఎన్‌డీఏ ప్రస్తుత పటిష్ట స్థితిలో దానిని అమలులో పెట్టే అవకాశం ఉంది. కానీ అది నిబద్ధతతో అమలు చేస్తుందా? లేక స్వీయ రాజకీయ లక్ష్యం కోసం పావులు కదుపుతున్నదా? అన్నది చరిత్ర నిర్ణయిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ నిర్ణయం ఆచరణపై అనుమానపు మేఘాలు ఆవరించుకున్నాయి.
-పెండ్యాల కొండల్
75694 95833






