రాష్ట్రాల్లో అల్లైడ్ హెల్త్‌కేర్ చట్టం అమలు అత్యవసరం!

by Ravi |   (  Updated:2026-05-15 01:01:23  IST  )

భారతదేశంలో వైద్య అనుబంధ వృత్తుల నియంత్రణ, గుర్తింపు, విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు తీసుకువచ్చిన నేషనల్ కమిషన్ ఫర్ అల్లైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ చట్టం 2021 గురించి తెలుసుకోవాల్సిన అంశాలు

రాష్ట్రాల్లో అల్లైడ్ హెల్త్‌కేర్ చట్టం అమలు అత్యవసరం!
X

ఆసుపత్రి అంటే కేవలం డాక్టర్లు, నర్సులే కాదు అనేక వైద్య అనుబంధ వృత్తి నిపుణులు కూడా కీలక సేవలు అందిస్తారు. వైద్యులు, నర్సులు, ఫార్మసీ వృత్తుల నియంత్రణకు వరుసగా నేషనల్ మెడికల్ కమిషన్(NMC), నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (INC), ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) ఏర్పడ్డాయి. కానీ అనేక వైద్య అనుబంధ వృత్తులకు సరైన గుర్తింపు, నమోదు, నియంత్రణ లేకపోయింది.

దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం 2018లో అల్లైడ్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ బిల్లును ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచనలతో సవరణలు చేసి చివరకు నేషనల్ కమిషన్ ఫర్ అల్లైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ యాక్ట్ - 2021ను అమల్లోకి వచ్చింది. ఈ చట్టం నాణ్యమైన విద్య, మెరుగైన ఆసుపత్రి సేవల అభివృద్ధికి ఎంతో అవశ్యం.

57 వృత్తులను 10 విభాగాలుగా విభజించి..

ఈ చట్టం ద్వారా ఈ కమిషన్ దాదాపు 57 రకాల వైద్య అనుబంధ వృత్తుల గుర్తింపు, నమోదు, నియంత్రణ చేపట్టబడుతోంది. ఈ చట్టం కింద వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కోర్సుల విద్యా ప్రమాణాలు, పాఠ్య ప్రణాళికలు, కళాశాలల గుర్తింపు, ప్రపంచ స్థాయి వృత్తి విజ్ఞాన వ్యవస్థ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోంది. అందులో భాగంగా 57 వృత్తులను 10 విభాగాలుగా విభజించి, ప్రతి విభాగానికి ఒక జాతీయ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ప్రతి కౌన్సిల్‌కు ఒక అధ్యక్షుడు, కనీసంగా 5 గురు సభ్యులు ఉంటారు. కమిషన్ చైర్‌పర్సన్‌గా డా. యజ్ఞ ఉన్మేష్ శుక్లా‌ నియమితులయ్యారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా వివిధ జాతీయ సంస్థల నిపుణులతో పాటు, అనుబంధ వృత్తుల నుండి 40 మందిని నియమించింది. ఇందులో నిజాం వైద్య విజ్ఞాన సంస్థకు చెందిన నేను ఓ సభ్యుడినే.. ఈ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలలలోగా రాష్ట్ర కౌన్సిల్స్‌ను ఏర్పాటు చెయ్యాలి. దానికి అధ్యక్షుడిని ఇతర సభ్యులను నియమించాలి.

తెలంగాణ ప్రభుత్వం కౌన్సిల్ ఏర్పాటు చేయాలి!

ప్రతి రాష్ట్ర కౌన్సిల్‌లో నాలుగు స్వయం ప్రతిపత్తి బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ చట్టం పేర్కొంటుంది. అవి అండర్ గ్రాడ్యుయేట్ విద్యా బోర్డు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యా బోర్డు, వైద్య అనుబంధ ఆరోగ్య అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు, అలాగే వైద్య అనుబంధ ఆరోగ్య సంరక్ష వృత్తుల ఎథిక్స్ అండ్ రిజిస్ట్రేషన్ బోర్డును ఏర్పాటు చేయాలి. ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్ర, కేంద్ర స్థాయి రిజిస్టర్లు అమలులోకి వచ్చి ప్రతి ఆరోగ్య సంరక్ష సాంకేతిక నిపుణుడు తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వృత్తి విద్యా కళాశాలలు కూడా రాష్ట్ర కౌన్సిల్ అనుమతి పొందాలి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కౌన్సిల్స్ ఏర్పాటు చేసినప్పటికీ, తెలంగాణతో సహా మరికొన్ని రాష్ట్రాలు ఇంకా ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఈ చట్టం అమలుతో దేశంలోని ఆసుపత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలు, మెడికల్ కళాశాలల్లో పనిచేస్తున్న వైద్య అనుబంధ వృత్తి నిపుణులు ఒకే వ్యవస్థ కిందకి వస్తారు. దీని ద్వారా వృత్తుల నియంత్రణ, ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు, నాణ్యమైన వైద్య సేవలు అమలులోకి వస్తాయి. అర్హతలేని నిపుణులను తొలగించి, జవాబుదారీతనం, నాణ్యమైన సేవలను పెంపొందించడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషిస్తుంది. ఇంత ప్రాముఖ్యత గల కౌన్సిల్ ఏర్పాటుకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి.

ఒకే దేశం- ఒకే కరికులం లక్ష్యంతో..

ఈ చట్టం ద్వారా కేవలం వృత్తి నిపుణుల రిజిస్ట్రేషన్, నియంత్రణ మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్ష విద్యా విధానాన్ని అమలు చేయడంపై కూడా దృష్టి పెట్టారు. ‘ఒకే దేశం – ఒకే కరికులం’ లక్ష్యంతో జాతీయ కమిషన్ ఇప్పటికే 17 విభాగాల్లో జాతీయ విద్యా బోధన విధానాన్ని విడుదల చేసింది. ఈ విధానాన్ని 2026–27 విద్యా సంవత్సరం నుంచి అన్ని విద్యాసంస్థలు అమలు చేయాలి. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు కౌన్సిల్‌లో నమోదు చేసుకుని ఆయా కోర్సులకు అనుమతి పొందాల్సి ఉంటుంది. దీంతో అనుమతులు లేకుండా, మౌలిక వసతులు లేదా బోధనా సిబ్బంది లేకుండానే అధిక సంఖ్యలో విద్యార్థులను చేర్చుకునే విద్యాసంస్థలపై నియంత్రణ ఏర్పడి, విద్యా ప్రమాణాలు మెరుగుపడనున్నాయి. అలాగే ఈ చట్టం అమలుతో అనుమతులు, మౌలిక వసతులు లేకుండా నిర్వహిస్తున్న వైద్య అనుబంధ కోర్సులకు చెక్ పడనుంది. రోగ నిర్ధారణ, చికిత్స, థెరపీలో కీలక పాత్ర పోషించే కోర్సులన్నీ చట్టపరిధిలోకి వస్తాయి. భారతదేశం ఇప్పటికే వైద్య సేవల్లో ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతున్న నేపథ్యంలో, నాణ్యమైన విద్యా ప్రమాణాలు మరియు మెరుగైన ఆసుపత్రి సేవల కోసం ఈ చట్టం అమలు అత్యంత అవసరం.

-శిరందాస్ శ్రీనివాస్

ప్రిన్సిపాల్, నిజాం వైద్య విజ్ఞాన సంస్థ

9441673339

Next Story