టెట్ అర్హత సాధిస్తేనే.. పరిపూర్ణమైన ఉపాధ్యాయులా?

by Ravi |   (  Updated:2025-10-30 01:15:15  IST  )

భారతదేశంలోని 6 నుండి 14 సంవత్సరాలు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడమే లక్ష్యంగా ఉచిత విద్యా నిర్బంధ హక్కు చట్టం- 2009 ఆగస్టు 4న రూపొందించింది భారత పార్లమెంటు.

టెట్ అర్హత సాధిస్తేనే.. పరిపూర్ణమైన ఉపాధ్యాయులా?
X

భారతదేశంలోని 6 నుండి 14 సంవత్సరాలు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడమే లక్ష్యంగా ఉచిత విద్యా నిర్బంధ హక్కు చట్టం- 2009 ఆగస్టు 4న రూపొందించింది భారత పార్లమెంటు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21Aలో ఉంది. ఈ చట్టం 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. దీంతో విద్యను ప్రతి విద్యార్థికి ప్రాథమిక హక్కు గా అందించే 135 దేశాలలో భారతదేశం ఒకటిగా మారింది. ఈ చట్టంలో భాగంగానే 2011లో కేంద్రం టెట్‌ను ప్రవేశ పెట్టింది. ఇప్పుడు ఈ పరీక్షే ఉపాధ్యాయులకు గుదిబండగా మారింది.

ఈ చట్టం ప్రకారం టీచర్‌గా పని చేయాలంటే టెట్ కూడా క్వాలిఫై అవ్వాలని చట్టం చేశారు. ఇక అప్పటినుండి బీఈడీ, టీటీసీ పూర్తి చేసిన వారందరూ టెట్ రాస్తున్నారు. మరి ఇప్పుడెందుకు టెట్ గోల? అంటే సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న ఇచ్చిన తీర్పు ప్రకారం, ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష తప్పనిసరి చేస్తూ.. అలాగే సర్వీస్‌తో సంబంధం లేకుండా ప్రమోషన్ పొందాలంటే.. టెట్ పాస్ అవడం తప్పనిసరి చేస్తూ తీర్పునివ్వడంతో ఉపాధ్యాయుల్లో టెన్షన్ నెలకొంది.

అంత ఉత్సాహం ఎందుకు?

సుప్రీం తీర్పు ప్రకారం, ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్ ఉత్తీర్ణులు కావాలని లేదా తప్పనిసరి పదవీ విరమణ ఎదుర్కోవాలని షరతు పెట్టింది. ఆ మేరకు రాష్ట్రాలు ఇప్పుడు ఈ విధానాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకుం టున్నాయి. దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో నాలు గు రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్లు వేసి పోరాడుతుంటే ‘ఊరంతా ఒకదారైతే ఉలిపి కట్టెదొక దారన్నట్లు’ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు ఆరడుగులు ముందుకేసి ఇందుకు నోటిఫి కేషన్‌ను విడుదల చేశాయి.. ఈ ప్రభుత్వాలకు ఇంత ఉత్సాహం ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలులో, 32 వేల బకాయిల చెల్లింపులో, పీఅర్సీ కమిటీ నియామకంలో, ఖాళీగా ఉన్న పోస్టుల్లో మరో డీఎస్సీ వేయడం వంటి సమస్యల పరిష్కారంలో ఎందుకు చూపలేక పోతున్నారు? దున్నపోతు ఈనిందంటే గాట్లో కట్టేసే ధృతరాష్ట్ర సంస్కృతి అమలుకు ఉత్సాహమెందుకు? ఊపిరి సలపని విధులతో అల్లాడుతున్న ఉపాధ్యాయ వర్గంపై ఒత్తిడి పెంచడం అవసరమా?

వీరందరికి పరీక్షలు పెడతారా?

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెట్ పాస్ కాకపోతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఉద్యోగం నుండి తొలగించాలి. అయితే ఇలా ఎంత మందిని తొలగిస్తారు? పాతిక, ముప్పై సంవత్సరాల సర్వీస్ కలిగిన వేలాది మంది గురువులకు ఇంతటి అగ్ని పరీక్షలు అవసరమా? విద్యా చట్టం ప్రకారం ఎస్‌ఈఆర్టీలోని అన్ని ప్రతిపాదనలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు అమలు చేశాయా? ప్రైవేట్ విద్యాసంస్థలు 25% సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాయా? ముందుగా ప్రభుత్వా లు టెట్‌కు అర్హత సాధిస్తేనే పరిపూర్ణమైన ఉపాధ్యాయులనే ఛాందస భావన నుండి బయటకు రావాలి. కాదు అదే సమంజసమని పాలకులు భావిస్తే.. ఇప్పటివరకు ఆయా ఉపాధ్యాయుల వద్ద విద్యను అభ్యసించిన లక్షలాది పౌరులు, వివిధ ఉద్యోగాలు చేస్తున్న వారికీ ఆయా స్థాయిల్లో పరీక్షలు అవసరమే కదా! ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల పరిస్థితి కూడా ఇదే! ఉపాధ్యాయ వర్గాన్ని త్రిశంకు స్వర్గంలోకి నెట్టే ఈ దుందుడుకు అపరిపక్వ విధానాలకు స్వస్తి పలకకపోతే వ్యవస్థ నిర్వీర్యమై ప్రజల్లో ఒక శాశ్వత అనుమానం పాదుకునే ప్రమాదం వుంది.

ఉపాధ్యాయ సంఘాలు చొరవ చూపాలి!

నిజానికి ఉపాధ్యాయ వృత్తిలోకి రావడమంటే అంత సాదా సీదా వ్యవహారం కాదు. ప్రతి దశలోనూ జల్లెడ పట్టిన తర్వాతనే ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశించగలుగుతున్నాడనే నగ్న సత్యాన్ని ఎన్సీటీఈ, సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలి. ఈ ఉపాధ్యాయులుగా నియామకం కావడానికి టీటీసీ, బీఈడీ కోర్సులు పూర్తి చేసి వేలాది మందితో పోటీపడి డీఎస్సీలో మెరిట్ సాధిస్తేనే ఉద్యోగంలోకి రాగలగుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై అన్ని వర్గాలు స్పృహతో ఆలోచించాలి. వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై వుంది. రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలూ తగిన చొరవ తీసుకోవాలి. ఎందుకంటే విద్యారంగం కేంద్ర ప్రభుత్వ గుప్త ఆస్తి కాదు. లేని పక్షంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉభయలూ నష్టపోయే ప్రమాదం ఉంది.

ఉపాధ్యాయులూ గాబరా పడొద్దు!

ఎన్ని తీర్పులున్నా, ఎంత ఒత్తిడి వున్నా ఉపాధ్యాయులు అధైర్యపడొద్దు. ఉద్యోగాన్ని ఒక్క సెంటీ మీటర్ కూడా కదిలించే శక్తి ఎవరికీ లేదు. ఏ న్యాయస్థానం ఈ మీమాంసలు లేవనేత్తిందో అదే న్యాయ స్థానంలో మన వాణిని వినిపిద్దాం! ఎందరినో ఎన్నో పరీక్షలలో గట్టెక్కించిన మేధావిలోకం ఈ చిన్న సమస్యకే అదిరిపోయి మానసిక ఒత్తిడికి గురి కావద్దు. అనవసర అందోళనకు గురికావద్దు. జీవితమంటే ఉద్యోగం మాత్రమే కాదు. మీకూ కుటుంబాలున్నాయి. మీ మీద ఆధారపడిన వారున్నారు. బాధ్యతలున్నాయి. ఏ సమస్యనైనా సమిష్టిగా ధైర్యంగా ఎదుర్కొందాం. టెట్ అర్హత పొంది ఉన్నవారికి, లేని వారికీ, మినహాయింపు పొంది ఉన్నవారికి ఇది వేర్వేరు సమస్య కాదు. అందరిదీ. అందరం కలిసి పోరాడదాం అంతిమ విజయం మనదే!

- మోహన్ దాస్,

ఏపిటీఎఫ్ నాయకులు

94908 09909

Next Story