ముప్పై వేలకోసం మమ్మల్ని ఎన్నిసార్లు చచ్చిబతకమంటారు?

by Ravi |   (  Updated:2026-05-22 01:15:03  IST  )

జనాభా పెరుగుదల, వర్క్‌ఫోర్స్ పేరుతో మహిళలపై పడుతున్న గర్భధారణ, ప్రసవం, పిల్లల పెంపకం భారం గురించి ప్రశ్నించే వ్యాసం. స్త్రీల ఆరోగ్యం, మాతృత్వ సెలవులు, పితృస్వామ్యం, అభివృద్ధి అనే భావనలపై గంభీరమైన చర్చ.

ముప్పై వేలకోసం మమ్మల్ని ఎన్నిసార్లు చచ్చిబతకమంటారు?
X

పని చేయగల సామర్థ్యం, వయసు ఉండాల్సిన యువత తక్కువ ఉండటం వల్ల జనాభా పెరుగుదల కోసం కొన్ని బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఎవరు కనాలి? ఆడవాళ్లం కనాలి. తొమ్మిది నెలలు నిండా మోయాలి. పదో నెల పుడతారు. బిడ్డకీ బిడ్డకీ మూడేళ్ల గ్యాప్ ఉండాలని, అప్పుడే తల్లీ, బిడ్డా ఆరోగ్యంగా ఉంటారనేది సత్యం. ప్రభుత్వం కూడా ప్రకటనలు ఇస్తుంది. ఈ లెక్కన ముగ్గురు పిల్లలు అనుకోండి, మోసే టైం దగ్గర దగ్గరగా 2.5 ఏళ్లు, గ్యాప్ 6 ఏళ్లు. మొత్తం ఎనిమిదన్నర ఏళ్లు. నలుగురు బిడ్డల్ని కనాలి అనుకోండి దగ్గర దగ్గరగా 12 ఏళ్లు.

బిడ్డని కన్నాక వచ్చే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఎంత కాలం ఉంటుందో తెలీదు. మన సమాజం అసలు అలాంటిది ఒకటి ఉందనే గుర్తించదు. కాబట్టి దాన్ని వదిలేసి, కేవలం బయోలాజికల్‌గా పెట్టాల్సిన టైం. పిల్లలతో ఆడుకోటానికి, పాడుకోటానికి, ఊసులు చెప్పటానికి, ఆరు నెలలు నిండాక ఉన్నంతలో పోషక ఆహారం విడిగా వండి పెట్టడానికి, పెట్టాల్సిన టైం ఎంతో అసలు ఎవరం చెప్పలేం. అది బిడ్డను బట్టీ కూడా ఉంటుంది. ఆ బిడ్డ ఏదన్నా స్పెషల్ నీడ్స్ అవసరం ఉన్న బిడ్డ అయితే, ఇక ఆ తల్లిదండ్రులు పెట్టే టైం ఎంతో కూడా లెక్క వేయలేం, ఊహించలేం.

ఆరు నెలల లీవ్ ఎవరిస్తున్నారు..?

ప్రతి బిడ్డకీ తల్లి పాలు ఇవ్వాలి. మెటర్నిటీ లీవ్ ఆరు నెలలు ఇస్తారు. కడుపుతో ఉన్నప్పుడు ఎనిమిదో నెల నిండిన దగ్గర నుండే సెలవు పెడతారు. అంటే అటు ఇటుగా ఏవో రెండు, మూడు నెలలు. బిడ్డ పుట్టాక మరో మూడు నెలల మిగిలిన లీవ్ వాడతారు. కొంతమంది LOSS of pay మీద ఇంట్లోనే ఉండి ఇంకొంత కాలం బిడ్డని చూసుకుంటారు. మళ్లీ ఈ ఆరు నెలల లీవ్ అన్ని కంపెనీస్ ఇవ్వవు. ముఖ్యంగా domestic workers అంటే ఇళ్లలో పని చేసే వాళ్లు, construction workers లాంటి అనార్గనైజ్డ్ సెక్టార్ మహిళలకి ఉండదు. ఈ low paid jobs లో ఉన్న స్త్రీలకి మొదలే శారీరిక బలం ఉండదు. అందుకే వాళ్ల జీవితకాలం కూడా తక్కువ. ఆ స్త్రీ ఎంత బలహీనంగా ఉన్నా దిక్కులేకో, ఫారెక్స్ లాంటివి కొనలేకో ఆ కాస్త రక్తాన్ని పాలుగా మార్చి ఇస్తుంది. ఈ పాలు ఇచ్చే అంత కాలం స్త్రీలంతా పోషకాహారం లేకపోతే బలహీనమౌతారు. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే unicef లెక్కల ప్రకారం తల్లి పాలు ఆరునెలలు ఇవ్వాలి. ఆర్నెలలు తల్లి పాలే బిడ్డకి ఇవ్వాలి అని ప్రభుత్వం యాడ్స్ కూడా ఇస్తుంది. చెప్పండి.. orgnaised సెక్టార్లో పని చేసే మహిళలు అన్ని నెలలు పూర్తిగా బిడ్డకి పాలు ఇస్తున్నారా ఇవ్వగలరా బిడ్డని తెచ్చుకుని చూసుకోటానికి మన work spacesలో కనీస సౌకర్యాలు ఉంటాయా మన ఆఫీసుల్లో, పబ్లిక్ స్పేస్‌లో బాత్రూములు వాడితే కడుపుతో ఉన్న తల్లి, బాలింత రోగాలు వచ్చి పోతారు. తల్లిని వదిలేయండి, బిడ్డని ఎక్కడ ఉంచగలం ఆ వాతావరణం, స్పేస్ స్త్రీలు పని చేసే చోట్ల ఉంటుందా చెప్పండి unrorganised sectors లో పని చేసే స్త్రీల, వాళ్ల బిడ్డల మాటేంటి?

ముప్పై వేలకు మళ్లీ మళ్లీ చావాలా?

‘పురిటి నొప్పులు దాటితే పునర్జన్మ’ అనే సామెతలు ఎందుకు పుట్టాయో మాకు మాత్రమే తెలిసిన సత్యాలు. మేము ప్రతి so called safe డెలివరీకి పునర్జన్మ ఎత్తుతాం. మీరు ఇచ్చే ముప్పై వేలకోసం మళ్లా చావుకి రెడీ అవ్వమంటారా ముందు పుట్టిన ఇద్దరు పిల్లల్ని గాలికి వదిలేయమంటారా అసలే స్త్రీ పురుష జనాభా నిష్పత్తిలో తేడా ఉంది. ఆ తేడాని మళ్లీ పెంచుతారా ఆ తరాల్లో స్త్రీల లాగా పచ్చడి జాడీల్లో బతకమంటరారా?

వర్క్ ఫోర్స్

పని చేయగల సామర్థ్యం ఉన్న యువత తగ్గకుండా ఉండేందుకు మూడో బిడ్డ, నాలుగో బిడ్డని కనాలి అంటున్నారు. మమ్మల్ని workforceగా కన్సిడర్ చేయరా? కుటుంబ నియంత్రణ పాటించి, మా టైంని మేము వర్క్‌లో ఇన్వెస్ట్ చేయటం వల్ల ఎన్ని మార్పులు జరిగాయి? ఎంత అభివృద్ధి జరిగింది paid labour లోunpaid labourలో. ఈ తరం స్త్రీలుగా మా వాటా లెక్కేస్తే.. మీ అందరి తాతలు తాతల తాతల తాతల నుండి మీ అందరి మనవళ్ల మనవళ్ల మనవళ్ల వరకూ కష్టపడ్డా pay back చేయలేరు. ఇక ముందు తరం ఆడవాళ్ళ సంగతులు, త్యాగాలు, పనికి డబ్బు, work force contribution సంగతి చెప్పుకోకపోటం నయం. అసలు వర్క్ ఫోర్స్ పెరగటానికి మా శరీరాలని మేమెందుకు పుండు చేసుకోవాలి?

మనిషి ఉండేది కేవలం పని చేయటానికేనా?

వర్క్ ఫోర్స్, productive గా ఉండటం తప్ప జీవితానికి ఇంకేం అర్థం లేదా చైల్డ్ లేబర్ ఇంకా ఉన్న దేశం. నడక నేర్చుకున్నప్పటి నుండి ఏం చదువుతావు ఏం పని చేస్తావ్ ఎంత సంపాదిస్తావ్ ఇంతేనా మన మాటలు సరే పోనీ productiveగా ఉండటం ముఖ్యం అనుకుందాం, ఈ దేశంలో స్త్రీ పురుషులు అందరికీ చేసిన పనికి తగ్గ పేమెంట్ వస్తోందా పని గంటలు, పని చేసే ప్రదేశాలు, చేసిన పనికి డబ్బు, పేరు పరంగా రావాల్సిన వాటా దక్కుతోందా కొంతమంది ఆర్థికంగా ఎదగటానికి, కొందరి కలలని సాకారం చేసుకోటానికి ఎంతమంది ఎన్ని గంటలు, ఎన్ని త్యాగాలు చేసి పని చేయాలి?

ఇది ఆడవాళ్ళ సమస్య మాత్రమేనా?

ఇవన్నీ ఆడవాళ్ల సమస్యలే కాదు. మగవాళ్ళవి కూడా. భార్య ఆరోగ్యంగా లేకపోతే భర్తకి దిగులు ఉండదా మోయటం, కనటం, పెంచటంలో ఆమె తిప్పలు పడుతుంటే అతను ప్రశాంతంగా పని చేసుకోగలడా? ప్రభుత్వాలు నడిపే నిధులు లేని హాస్పిటల్స్‌లో పిల్లల్ని చూపించగలరా? ప్రైవేట్ హాస్పిటల్స్‌కి ముగ్గురు నలుగురు పిల్లల్ని తీసుకెళ్లగల డబ్బు ఉంటుందా? ఇప్పుడిప్పుడే మగవాళ్లు పితృస్వామ్యాన్ని వదిలి, మాకు మద్దతుగా నిలబడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంతా మళ్లా వెనక్కి తీసుకెళ్తారా? అమ్మంటే వంట చేసేది, పెంట ఎత్తేది, పాట పాడేది, పడుకోబెట్టేది అంతే. నాన్న అంటే డబ్బు సంపాదించి, ఫీజులు కట్టేవాడు అంతే. ఇదే పిల్లలకి నేర్పుతారా కుటుంబం అంటే ఈ చక్రం కింద నలిగి చావటమేనా?

అభివృద్ధి అంటే పని చేసే వాళ్లని పుట్టించడమా?

అభివృద్ధి అంటే అర్థం కొంతమంది సంపన్నులు అవటానికి అందరం పని చేసే వాళ్ళని పుట్టించటమా? పని సంస్కృతి అంటే మనుషులు మిక్సీలో పడ్డ గోంగూర అవటమా? ప్రభుత్వాలుగా, మగవాళ్లుగా మీరు మాకేం ఇస్తున్నారు? ఏం అవకాశాలు, ఏం వసతులు మాకు కల్పిస్తున్నారు? ఏం భరోసా ఇస్తున్నారు ముప్పై వేలు, నలభై వేల incentivesకి ఆశపడి పిల్లని కనే స్థితిలో జనాలు ఉన్నారు అనుకుంటున్నారా? అలా ఉన్నారంటే, మీ ప్రభుత్వాలు, మీ సంస్థలు, మీ వ్యవస్థలు విఫలమైనట్టే కదా. మీరు చెప్పినట్టు మేమెందుకు కనాలో, మా శరీరాల మీద మీ హక్కేంటో, కంటే మాకు, మా పిల్లల, మా మగవాళ్ల మానసిక, శారీరిక, ఆర్థిక ఆరోగ్యానికి మీరేం చేస్తారో కూడా చెప్పండి. ఈ ప్రశ్న ఎక్కువ మందిని కనాలని సూచిస్తున్న పాలకులకు మాత్రమే కాదు, ఈ సిద్ధాంతాలని సమర్థించే వారికి కూడా.

- పింగళి చైతన్య

Next Story