- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
హైడ్రా.. సాహసోపేతమైన చర్య!
చెరువుల ఆక్రమణలపై హైడ్రాతో పంజా విసిరిన సీఎం రేవంత్ రెడ్డి ధైర్యసాహసాలను సీపీఐ నారాయణ వంటి సీనియర్ కమ్యూనిస్టు నేతలు అభినందిస్తూనే.. ఈ సాహసం అత్యంత ప్రమాదకరమైందని సూచించడం చర్చనీయాంశం. ఎందుకంటే, కంటిసైగతో ప్రభుత్వాలను తలకిందులుగా మార్చే బడా రాజకీయ నాయకులు.. పారిశ్రామిక వేత్తలు.. సినీనటులు చెరువులను ఆక్రమించి చేపట్టిన భవంతులను నేలమట్టం చేయడం మాటలతో చెప్పినంత తేలిక కాదు. కానీ మాటల్లో కాదు చేతల్లో చూపుతున్నారు రేవంత్ రెడ్డి. పులిమీద స్వారీ చేసినా, పులి మీద నుండి దిగినా దాని నుండి ప్రమాదాన్ని ఎదుర్కొనే మనోధైర్యం ఉండాలి. అవసరమైతే పులితో పోరాడే సత్తా ఉండాలి. లేదంటే పులిని మచ్చిక చేసుకునే చాకచక్యం అయినా ఉండాలి. హైడ్రాతో అక్రమార్కులపై యుద్ధానికి దిగిన సీఎం రేవంత్ రెడ్డికి ఆ ధైర్యం, ఆ చాకచక్యం, ఈ గుండె నిబ్బరం ఉన్నాయి. ఈ దృష్టి లేకుండా ఆయన ఇంత రిస్క్ తీసుకోలేదనిపిస్తోంది.
సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నట్లు పులిమీద సవారీ చేసినంత కాలం ఇబ్బంది ఉండదు. ఒక్కసారి పులిమీది నుండి కిందకు దిగితే పులికి ఆహారంగా మారక తప్పదనేది జీవిత సత్యం. చెరువుల్లో ఆక్రమణలు తొలగించడం ఆషామాషి కాదు. గడిచిన మూడు దశాబ్దాల కాలంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 180కి పైగా ఉన్న చెరువుల ఆక్రమణ యధేచ్ఛగా సాగింది. చెరువులను చెరపట్టిన రియల్టర్లు బహుళ అంతస్థుల భవనాలను కట్టి ఫ్లాట్లుగా అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇక సంపన్నులైన రాజకీయ నాయకులు.. పారిశ్రామికవేత్తలు మేమేమీ తక్కువ కాదంటూ చెరువులు... బఫర్ జోన్లలో ఫామ్ హౌజ్‌లు..పరిశ్రమలు.. కాలేజీలు కట్టుకున్నారు.
గత పాలకులు ఎందుకు పట్టించుకోలేదు?
మూడు దశాబ్దాల కాలంలో ముఖ్యమంత్రులుగా చేసిన నాయకులు చెరువుల ఆక్రమణను ఎందుకు అడ్డుకోలేకపోయారు? అసలు ఆయా సీఎంల అండదండలతోనే ఎంతోమంది చెరువులను అడ్డదిడ్డంగా ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారనే ఆరోపణలూ ఉన్నాయి. సరే ఒకవేళ కాదనుకుందాం. మరి హైదరాబాద్ నగరంలో వరదలను నివారించేందుకు నిర్మించిన చెరువులు ఆక్రమణకు గురవుతుంటే ఆయా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదు? పశ్చిమభాగం నుండి తూర్పు దిశగా మూసీ, ఈసీ నదులు ప్రవహిస్తుంటాయి. ఈ రెండు నదులతో పాటు ఇతర వాగులు పొంగిపొర్లడంతో 1908లో హైదరాబాద్ వరద ముంపుకు గురైంది. ఆ వరదలను దృష్టిలో పెట్టుకుని అప్పటి నిజాం మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆధ్వర్యంలో నగరం చుట్టూ వందలాది గొలుసు కట్టు చెరువులను తవ్వించారు. ఒక చెరువు నిండితే వరద మరో చెరువుకు చేరుకునెలా... ఇట్లా వరద హైదరాబాద్‌ను ముంచెత్తకుండా చర్యలు తీసుకున్నారు. అట్లాగే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ల పేరిట రెండు తాగునీటి జలాశయాలను నిర్మించడం ద్వారా హైదరాబాద్ వరద ముంపు సమస్యకు పరిష్కారం కల్పించారు. కానీ.. ఆ చెరువులు ఆక్రమణకు గురవ్వడంతో నేడు చిన్నపాటి వర్షానికే వరద ముంపు నగర ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కల్పించేందుకే సీఎం రేవంత్ రెడ్డి చెరువుల ఆక్రమణపై దృష్టి పెట్టారు.
ప్రభుత్వానికి పెరుగుతున్న మద్దతు!
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ద్వారా కట్టడాలను కూల్చి వేస్తున్నారని హరీష్ రావు, కేటీఆర్‌ల ఆరోపణ. కానీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే ఎన్ కన్వెన్షన్ ఆక్రమణపై అసెంబ్లీ సభలో ప్రస్తావించారు. నేడు హైదరాబాద్ ప్రజలను వరద సమస్య నుండి విముక్తి చేసేందుకు చెరువుల ఆక్రమణలను తొలగిస్తుంటే రాజకీయంగా భయానక వాతావరణం నెలకొంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలిసారిగా ఇటువంటి సాహోసోపేత నిర్ణయం తీసుకున్న రేవంత్ ప్రభుత్వం తీరును ఇప్పటికే మెజారిటీ ప్రజలు మెచ్చుకుంటున్నారు.
ఈ వ్యయాలను రాబట్టుకోవాలని..
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తరువాత అనేక చెరువుల్లో వెలిసిన అక్రమ కట్టడాలపై హైడ్రాకు ఫిర్యాదుల వరద తాకిడి మొదలైంది. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా జంట జలాశయాల పరిధిలోని 111 జీవో లోపల కూడా ఆక్రమణలు తొలగించాలనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి తోడు హైడ్రా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 180 చెరువుల్లోని ఆక్రమణలను తొలగించడానికే హైడ్రాకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. చెరువుల్లో ఆక్రమణలు కూల్చడం, ఆ తరువాత శిథిలాలను అక్కడి నుండి తరలించడం కోట్ల రూపాయల డబ్బుతో కూడుకున్న వ్యవహారం. ఇక శిథిలాల తొలగింపు స్వంతంగా చేపట్టడం హైడ్రాకు ఆర్థికపరంగా సాధ్యమయ్యే అవకాశం లేదు. కాబట్టే ఆక్రమణలు చేసి నిర్మాణాలు చేపట్టిన వ్యక్తుల నుండే రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా కూల్చివేతలు, శిథిలాల తొలగింపు వ్యయాలను రాబట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ భావిస్తున్నారు. ఇదే అంశాన్ని సీఎం, మంత్రులతో చర్చించనున్నారు. అయితే ఈ కూల్చివేతల్లోని న్యాయపరమైన అంశాల్లో ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ వచ్చినట్లయితే గ్రేటర్ పరిధిలో కూల్చివేతలు పూర్తి కావడానికి యేడాది, రెండేళ్లు పట్టే అవకాశం ఉంటుంది.
కూల్చివేతల్లో మతోన్మాదమా..?
దమ్ముంటే ఎంఐఎం ఎమ్మెల్యేలు నిర్మించిన కళాశాల భవంతులను కూల్చాలని బీజేపీ ఎమ్మెల్యేలు మతం రంగును పులిమినా, హైడ్రా వెనుకడుగు వేయలేదు. ఆ కట్టడాలపై హైడ్రా నోటీసులు జారీ చేసింది. మరి ఇప్పుడు హైదరాబాద్‌లోని చెరువుల్లో వెలిసిన అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో ప్రభుత్వానికి అండగా నిలిచే దమ్ము బీజేపీ నాయకులకు ఉందా? ఎందుకంటే... ఓ వర్గం కట్టడాల కూల్చివేత విషయంలో గొంతు విప్పుతున్న కమల దళం.. బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకుల నిర్మాణాలను కూల్చాలని డిమాండ్ చేయగలుగుతుందా? బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు మాత్రం ఆక్రమణలను కూల్చాల్సిందే. అడ్డుకోవాలని ప్రయత్నించే వారిపైనా బుల్డోజర్లు నడపాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న కూల్చివేతలను ప్రశంసిస్తున్నారు. కానీ గ్రేటర్ పరిధిలో 180 చెరువుల్లో 15వేలకు పైగా ఆక్రమణలు జరిగితే.. ఎంఐఎం నేతలు ఆక్రమించి నిర్మించిన కేవలం రెండు మూడు చెరువుల విషయంలో ప్రత్యేకించి డిమాండ్లు చేయడాన్ని మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం కాకుండా ఏ రకంగా అర్థం చేసుకోవాలి? హైడ్రా కూల్చివేతల విషయంలో నాపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎదుర్కొంటాం.. వెనక్కి తగ్గేది లేదు అని సీఎం వ్యాఖ్యానించడం ద్వారా ఆయన అక్రమార్కుల గుండెల్లో బాంబులు పేల్చారు.
జంగిటి వెంకటేష్
తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక, ఉపాధ్యక్షుడు
90528 89696