నీటి కోసం నగరం నిట్టూర్పు..

by Ravi |   (  Updated:2026-07-21 00:30:44  IST  )

హైదరాబాద్‌లోని బోడుప్పల్, ఉప్పల్ ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి కొరతతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భూగర్భ జలాల క్షీణత, ప్రణాళికా లోపాలు, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు

నీటి కోసం నగరం నిట్టూర్పు..
X

హైదరాబాద్‌లో ఒకవైపు ఆకాశాన్ని తాకే భవనాలు, విశాలమైన రహదారులు, ఆధునిక సౌకర్యాలతో నగరం అభివృద్ధి చెందుతుంటే, మరోవైపు బోడుప్పల్, ఉప్పల్ పరిసర ప్రాంతాల ప్రజలు గత రెండు నెలలుగా ఒక్క బిందె నీటి కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రశాంత జీవితం కోసం జీవితకాల పొదుపుతో ఇళ్లు కట్టుకున్న కుటుంబాలు నేడు నీటి కోసం నిత్యపోరాటం చేస్తున్నాయి. తెల్లవారకముందే నీటి కోసం ప్రారంభమయ్యే నిరీక్షణ, అర్ధరాత్రి దాటినా ముగియని ఆవేదనగా ప్రతి ఇంటి గడపను చుట్టుముడుతోంది. ఇక్కడ భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు ఎండిపోయాయి. వాటర్ ట్యాంకర్ బుక్ చేసినా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ప్రతి ఉదయం ఫోన్‌లో బుకింగ్ స్థితి చూసుకుంటూ, ప్రతి శబ్దానికీ "ట్యాంకర్ వచ్చిందేమో" అని గేటు వైపు పరుగెత్తడం ప్రజల దినచర్యగా మారింది. ఒకప్పుడు "ఇక్కడ జీవితం ప్రశాంతంగా ఉంటుంది" అని చెప్పిన ఈ ప్రాంతం, ఇప్పుడు "ఇక్కడ నీరు దొరుకుతుందా?" అనే ప్రశ్నకే పరిమితమైంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ధి కాకపోవడం, తక్కువ వర్షపాతం, ప్రణాళికల లోపం, నియంత్రణలేని నిర్మాణాలు సమస్యను మరింత తీవ్రం చేశాయి. వర్షపు నీటి సంరక్షణను తప్పనిసరి చేయడం, చెరువులు, కుంటలను పునరుద్ధరించడం, భూగర్భ జలాల పునరుద్ధరణకు శాస్త్రీయ ప్రణాళికలు అమలు చేయడం, పైపులైన్ లీకేజీలను అరికట్టడం, తగినన్ని ట్యాంకర్లను అందుబాటులో ఉంచడం వంటి చర్యలు అత్యవసరం. నీరు ప్రతి పౌరుడి మౌలిక హక్కు. ప్రజలు దాహంతో అలమటిస్తుంటే అది అభివృద్ధి చెందిన నగరానికి గౌరవం కాదు, పరిపాలనకు గంభీర హెచ్చరిక. బోడుప్పల్ సమస్య ఒక్క ప్రాంతానిదే కాదు.. ప్రణాళిక లేకుండా విస్తరిస్తున్న ప్రతి నగర భవిష్యత్తుకు ఇది అద్దం. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు హామీలతో కాదు, కార్యాచరణతో ప్రజల దాహాన్ని తీర్చాలి. ప్రకృతి సహకరించకపోతే పరిపాలన మరింత చురుకుగా పనిచేయాలి. సంక్షోభం వచ్చిన తర్వాత స్పందించడం కాదు, రాకముందే నివారించడం నిజమైన పాలనా దక్షత.

-కోట దామోదర్

9391480475

Next Story