- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ చేసిన నేరమేంటి?
సాంస్కృతిక రంగం అభివృద్ధి చెందకుండా ఎలాంటి అభివృద్ధి అయినా అసంపూర్ణమే అవుతుంది. భౌతికాభివృద్ధి కేవలం

సాంస్కృతిక రంగం అభివృద్ధి చెందకుండా ఎలాంటి అభివృద్ధి అయినా అసంపూర్ణమే అవుతుంది. భౌతికాభివృద్ధి కేవలం భవన నిర్మాణాలు, సౌకర్యాలు, రోడ్లు, మెట్రోలకు పరిమితమవుతుంది. నగరాల అభివృద్ధే నాగరికతగా భావిస్తున్న వర్తమాన కాలంలో అన్ని దారులూ నగరాల వైపునకే పరుగులు తీస్తున్నాయి. ఫలితంగా నగరాలేమో జనసాంద్రతలోనూ వైశాల్యంలోనూ విస్తరిస్తూ ఎదిగిపోతున్నాయి. హైదరాబాద్‌ని ‘మహానగరం’, ‘విశ్వనగరం’ అంటున్నారు. కానీ విశ్వనగర భావన కేవలం భౌతిక వసతులకే పరిమితం కాదు. ఏ నగరమయినా సాహితీ సాంస్కృతిక కళా రంగంలో విశ్వ దృక్ప థంతో ఎదిగినప్పుడే దానికి విశ్వ స్థాయి ఏర్పడుతుంది అది విశ్వనగరంగా భాసిల్లుతోంది.
గొప్ప చారిత్రక నేపథ్యం హైదరాబాద్ సొంతం. ఇది వివిధ మతాల సంస్కృతుల సమ్మేళనం. ఆర్థికంగా, సాంకేతికంగా, అభివృద్ధి పరంగా ఇవాళ హైదరాబాద్ దేశంలో అనేక నగరాలతో పోటీ పడుతున్నది. ఆ క్రమంలో హైదరాబాద్‌ని విశ్వనగంగా రూపుదిద్దే పనిలో కళాత్మక దృష్టీ, ఆలోచనలతో ముందుకు సాగాల్సి వుంది.
పాలకులు ఇప్పటికైనా మేల్కొనాలి!
హైదరాబాద్ ప్రపంచ కళా రంగానికి వేదిక అయ్యే కృషి కొరవడింది. సాంకేతిక పరిణామ క్రమంలో అత్యంత ప్రభావవంతమైన మాధ్యమంగా ఎదిగిన ప్రపంచ సినిమాను హైదరాబాద్ నగరానికి రప్పించి అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి వేదిక చేయాలి. ఇలా చేస్తే యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల సినిమా రంగాలతో సహా మంచి హాలీవుడ్ సినిమాలకు కూడా ’ స్క్రీన్ డెస్టినీ హైదరాబాద్‌గా మారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. సినిమా రంగంలో నిర్మాణానికి సంబంధించి దేశంలో బాంబే తర్వాతి స్థానాన్ని కలిగి వున్న హైదరాబాద్ ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించి విశ్వనగర భావనలో ఒక అడుగు ముందుకు వేసినట్టు అవుతుంది. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల నిర్వహణ ఏ నగరానికయినా, ఏ రాష్ట్రానికయినా విశేషమైన గౌరవాన్ని ప్రతిష్టని తీసుకు వస్తాయి. కాన్స్, బెర్లిన్, కార్లో వివారి ఇలా చూస్తే ప్రపంచంలో జరిగే ప్రతిష్టాత్మక చిత్రోత్సవాలు ఆ నగరాలకు ఆయా దేశాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి పేరు తెచ్చాయో మనకు తెలు సు. మన దేశంలో కూడా త్రివేండ్రం, బెంగళూరు, గోవా లాంటి నగరాలు అక్కడ జరిగే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల వల్లే ప్రాముఖ్యంలోకి వచ్చాయి. ఆ వాస్తవాన్ని హైదరాబాద్ నగర పాలకులూ, అధికారులూ గుర్తించాల్సి ఉంది. గత దశాబ్ద కాలంగా పాలకులు ఈ విషయంలో ఎంతో ఉదాసీనతను ప్రదర్శించారు. ఉపేక్షను ప్రదర్శించారు.
చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్
ఈ విషయంలో 1986లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తీసుకున్న చొరవ గొప్పది. కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని ‘ఫిల్మోత్సవ్’ పేర ఢిల్లీకి అవతల రెండేళ్లకోసారి వివిధ నగరాల్లో నిర్వహించేది. 1986లో ఆ అవకాశం హైదరాబాద్ నగరానికి వచ్చింది. దానికి స్పందించి స్వయంగా కళాకారుడైన రామారావు కేవలం 90 రోజుల్లో ‘లలిత కళాతోరణం’ నిర్మింపచేసి హైదరబాద్‌లో మొట్టమొదటి ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు. అది జరిగిన అన్ని రోజులూ ప్రతినిధులకు ఉచిత భోజనాలూ ఏర్పాటు చేసి ఉత్సవాన్ని విలక్షణంగా తీర్చిదిద్దారు. ఆ సంవత్సరం ఫిల్మోత్సవ్‌లోని పనోరమా విభాగంలో తెలుగు సినిమాకు స్థానం లభించలేదు. ఆ ఏడు జరిగిన ఎంపికలో ఏ ఒక్క తెలుగు సినిమాను కూడా సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయలేదు. అయినప్పటికీ రామారావు అంతర్జాతీయ ఉత్సవం మన నగరంలో జరుగుతున్నది అది మనకు గౌరవం అనే భావనతో గొప్పగా నిర్వహించి నభూతో.. అనిపించారు. ఆ తర్వాత హైదరా బాద్‌లో 1999లో మరోసారి కేంద్రం అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని నిర్వహించింది. తర్వాతి కాలంలో గోవాను శాశ్వత కేంద్రంగా మార్చి అక్క డే స్థిరపరిచింది. అప్పటిదాకా రెండేళ్ల కోసారయినా వివిధ నగరాలకు తరలివచ్చే ఫిల్మోత్సవ్ కనుమరుగయిపోయింది.
తెలంగాణ యువతకు విశ్వదారి
ఇప్పటికే మన దేశంలో కేరళ, కర్ణాటక, కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాయి. అట్లా ఆ నగరాలు విశ్వ సినిమాకు వేదికలుగా మారి కళాత్మక సినిమాలకు పాదులు వేస్తున్నాయి. పైగా మలయాళం, కన్నడ, బెంగాలీ భాషా సినిమాలకు గొప్ప పేరుండడానికి, మంచి సినిమాలు ఆయా భాషల్లో రావడానికి ఈ ఉత్సవాలు కూడా దోహదం చేశాయి. పైగా చలన చిత్రోత్సవాల నిర్వహణ వలన అవి విశ్వనగరాలు కావడమే కాకుండా సినిమా కళ నిర్మాణ విశేషాలకు సంబంధించి మరెన్నో ఉపయోగాలున్నాయి. ఫెస్టివల్స్‌లో వివిధ దేశాల సినిమాలు చూడడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సినిమాల ఒరవడిలో వస్తున్న భావనాత్మకమయిన మార్పుల్ని పరిశీలించే అవకాశం కలుగుతుంది. అలాగే సాంకేతికంగా వస్తున్న నూతన పరిణామాల్ని అందిపుచ్చుకునే అవకాశం వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో సినిమా మాధ్యమం పట్ల అభిలాష ఉన్న యువతీ యువకులు అమితంగా వున్నారు. ఫెస్టివల్‌తో తెలంగాణ యువతకు సినిమా రంగంలో చేరడానికి విశ్వదారి వేసినట్టు అవుతుంది. తెలుగు సినిమాకు కూడా పెద్ద ఎక్స్‌పోజర్ వచ్చే అవకాశం వుంది. అక్కడే నిర్వహించే పలు సెమినార్ల ద్వారా అనేక నూతన ఆవిష్కరణలు వచ్చే అవకాశం వుంది. ఇట్లా అనేక రకాలుగా తెలంగాణ ప్రజలకు తెలుగు సినిమాకు కళాత్మక ప్రయోజనాలున్న ఫిల్మ్ ఫెస్టివల్ ఉపయోగపడతాయి.
అన్ని అర్హతలూ ఉన్న నగరం
ఇక వీటి నిర్వహణకు సంబంధించి హైదరాబాద్‌కి అన్నీ అర్హతలూ, అవకాశాలూ, వసతులూ వున్నాయి. పైగా దేశంలో రెండవ పెద్దదయిన సినిమా రంగం వుంది. అందులో కేవలం షో బిజ్ మాత్రమే కాకుండా ప్రపంచ సినిమా పట్ల అభిరుచి అవగాహన ఉన్న వాళ్ళు ఎంతో మంది వున్నారు. గతంలో గుమ్మడి, గొల్లపూడి, వంశీ, కెమెరామాన్ రఘు, దర్శకుడు అక్కినేని కుటుంబ రావు లాంటి వాళ్ళు క్రమం తప్పకుండా ఫెస్టివల్స్‌కి వెళ్ళిన వాళ్ళే. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే ఉత్తమ ప్రదర్శనల కోసం ఎన్నో మల్టీప్లెక్స్ సినిమా హాళ్లున్నాయి. లలితకళా తోరణం లాంటివి ఉండనే ఉన్నాయి. 1986, 1999 సంవత్సరాల కంటే ఇప్పుడు మరెన్నో మెరు గైన వేదికలు ఉన్నాయి. అప్పుడు పబ్లిక్ గార్డెన్ సముదాయాన్ని ఉపయోగించారు. సెమినార్లకు రవీంద్ర భారతిని ఉపయోగించారు.
ప్రపంచ సినిమాకు వేదిక కావాలి!
ఇందుకు కావలసిందల్లా ప్రభుత్వ సహకారం, దీక్ష.. మన హైదరాబాద్ కూడా విశ్వనగరంగా విలసిల్లాలనే తపన. నంది అవార్డులను పేరు మార్చి గద్దర్ అవార్డులుగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటున్న ప్రభుత్వం అంతర్జాతీయ చలన చిత్రో త్సవం నిర్వహణకూ సైతం పూనుకోవాలి. ఇప్పటి ప్రభుత్వం సాంస్కృతిక శాఖను, ఎఫ్.డి.సి.ని ఉత్తేజపరిచి ప్రక్షాళన చేసి తెలంగాణ వైభవాన్ని హైదరాబాద్ నగర చరిత్రను, గంగా జమునా తెఃజీబ్‌తోపాటు ఇక్కడి బహు బాషా సంస్కృతుల్ని దృష్టిలో వుంచుకొని ప్రపంచ సినిమా పండుగకు హైదరాబాద్ నగరం గొప్ప వేదిక కావాల్సిన అవసరం ఉంది. ఎంతటి ప్రయాణమైనా తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది కనుక ఈ ఏడాదైనా హైదరాబాద్ అంతర్జాతీయ సినిమా పండుగకు తొలి అడుగు పడాల్సిందే.
-వారాల ఆనంద్
94405 01281






