ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలను ఆపేదెలా?

by Ravi |   (  Updated:2025-10-26 01:01:21  IST  )

మొన్న తెల్లవారుజామున ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి కర్నూలు జిల్లాలో పలువురు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. సరిగ్గా 10 రోజుల క్రితం రాజస్థాన్లోనూ ఇదే తరహా ప్రమాదం జరిగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలను ఆపేదెలా?
X

మొన్న తెల్లవారుజామున ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి కర్నూలు జిల్లాలో పలువురు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. సరిగ్గా 10 రోజుల క్రితం రాజస్థాన్లోనూ ఇదే తరహా ప్రమాదం జరిగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇవే కాదు.. గత కొన్నేళ్లుగా స్లీపర్ బస్సుల్లో జరుగుతోన్న ప్రమాద ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.

అందుకే వీటి నిర్వహణకు కఠిన నిబంధనలు తీసుకురావాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అతివేగం, భద్రతా ప్రమాణాల లేమితో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు మృత్యు శకటాలుగా మారుతున్నాయి. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారి బస్సు ప్రమాదం రోడ్డు భద్రతపై కొత్త ప్రశ్నలు లేవనెత్తింది. వందలాది ప్రాణాలను బలి తీసుకుంటున్న ఈ ప్రమాదాల వెనుక ప్రధాన కారణం – అతివేగం.

ఒక క్షణం గమన దోషం.. ప్రాణాంతకం!

రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ గణాంకాల ప్రకారం, 2022లో మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 72.26 శాతం (3,33,323) అతివేగం వల్ల జరిగాయి. 2023లో కూడా ఈ సంఖ్య పెద్దగా తగ్గలేదు 68.4 శాతం (3,22,795) ప్రమాదాలు వేగ నియంత్రణ లేకపోవడమే కారణం. పైగా దూర ప్రయాణ బస్సులు, ట్రక్కులు రాత్రి సమయంలోనే ఎక్కువగా నడవడం వల్ల డ్రైవర్లు నిద్రమత్తు లో వాహనం నడపడం జరుగుతోంది. ఒక్క క్షణం గమన దోషం ప్రాణాంతకం అవుతోంది. ప్రయాణికులు నిద్రలో ఉండడం వల్ల ప్రమాదం జరిగితే తప్పించుకునే అవకాశం కూడా తగ్గిపోతోంది. చాలా వరకు ప్రైవేట్ బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేవు. ఎమర్జెన్సీ ఎగ్జిట్లు సరిగా పనిచేయవు. ఇక ఫైర్ సేఫ్టీ పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు లేకపోవడం సాధారణం. ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆకర్షణీయమైన లైట్లు, డెకరేషన్లతో బస్సులను తీర్చిదిద్దుతున్నా, భద్రతా ప్రమాణాలపై మాత్రం నిర్వాహకులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

డిజైన్ లోపమేనా..?

సాధారణంగా స్లీపర్ బస్సులో 2x1 సీటింగ్ ఉంటుంది. 30 నుంచి 36 బెర్త్‌లు ఉంటాయి. అదే మల్టీ యాక్సిల్ బస్సులైతే 36-40 మంది ప్రయాణించవచ్చు. ఒక్కో బెర్త్ ఆరు అడుగుల పొడవు.. 2.6 అడుగుల వెడల్పులో ఉంటుంది. అయితే బెర్త్‌ను అనుసంధానించే గ్యాలరీలు చాలా ఇరుకుగా ఉండటంతో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే వెళ్లడానికి వీలుంటుంది. ప్రమాదాల సమయంలో ప్రయాణికులు ఈ ఇరుకైన ప్రాంతం నుంచి వేగంగా బయటకు రాలేకపోతున్నారు. స్లీపర్ బస్సుల్లో ప్రయాణం సౌకర్యవంతంగానే ఉంటున్నా.. సీట్ల మధ్యలో పరిమిత స్థలం వల్ల ప్రయాణికుల కదలికలకు తీవ్ర ఇబ్బందిగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్లే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువమంది లోపల చిక్కుకుపోతున్నారని అభిప్రాయం.

చైనాలో నిషేధం..

ఈ స్లీపర్ బస్సులు తొలుత పశ్చిమ దేశాల్లో నడిపేవారు. సిటీల మధ్య వినోద ప్రయాణాల కోసం వీటిని వినియోగించేవారు. ఆ తర్వాత సాధారణ ప్రజా రవాణాలో ఇవి భాగమయ్యాయి. అయితే, వీటిల్లో జరుగుతోన్న ప్రమాదాల కారణంగా కొన్ని దేశాలు స్లీపర్ బస్సుల వినియోగాన్ని తగ్గించుకుంటున్నాయి. చైనాలో 2012లోనే వీటి రిజిస్ట్రేషన్లను చైనా నిలిపివేసింది. ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ రవాణా వాహనాల్లో అగ్ని ప్రమాదాలను నివారించేందుకు కఠిన చర్యలు చేపట్టాయి.

కొత్త నిబంధనలు అమల్లోకి..

ఇకపై అన్ని కొత్త బస్సుల్లో (టూరిస్ట్‌, ట్రావెల్స్‌, ఆర్టీసీ, విద్యాసంస్థలు) అగ్ని ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరించే ఫైర్‌ అలర్ట్‌ సిస్టమ్, మంటలు ఆర్పేందుకు సిలిండర్లు, స్పింక్లర్లు ఏర్పాటు చేయడం తప్పనిసరి. ఈ వ్యవస్థలు సరిగా అమలు చేసినప్పుడే వాహన రిజిస్ట్రేషన్‌ అనుమతిస్తారు. పాత బస్సుల్లోనూ దశలవారీగా ఈ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫిట్‌నెస్‌ రెన్యువల్‌ సమయంలో ఫైర్‌ సేఫ్టీ వ్యవస్థ లేకపోతే రెన్యువల్‌ ఇవ్వబోమని రవాణాశాఖ స్పష్టం చేసింది. ఈ చర్యలతో ప్రజా రవాణా బస్సుల్లో తరచుగా జరుగుతున్న షార్ట్‌సర్క్యూట్‌ వల్ల జరిగే అగ్ని ప్రమాదాలు తగ్గడం లక్ష్యం. నియమాలను ఉల్లంఘించే బస్సు యజమానులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది.

తరచూ తనిఖీ చేస్తుండాలి..

ప్రమాదం జరిగినప్పుడు నామ మాత్రపు తనిఖీలు చేసి మమ అనిపించి చేతులు దులుపుకున్న తర్వాత వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని వారి వ్యాపారాన్ని కొనసాగిస్తాయి. అందుకే ఆర్‌టీఏ అధికారులు కేవలం ఈ రెండు మూడు రోజులు హడావుడి చేయకుండా ఈ ట్రావెల్స్ బస్సుల పత్రాలను తరచూ తనిఖీలు చెయ్యాలి. ప్రయాణీకులకు బీమా కూడా చేయించాలి. వాహనానికి సంబంధించిన సమాచారం టోల్ ప్లాజాలతో సమన్వయ పరిచే వ్యవస్థను, విధి విధానాలు రూపొందించాలి.

-శ్రీధర్ వాడవల్లి

99898 55445

Next Story