ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాలను ఎలా ఎంచుకోవాలి?

by Ravi |   (  Updated:2025-05-21 01:15:26  IST  )

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతి పథంలో నడవాలంటే ఇంజనీర్ల పాత్ర ఎంతో ముఖ్యం. తదనుగుణంగా నాణ్యమైన ఇంజనీర్ల తయారీ ఎంతో ముఖ్యం

ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాలను ఎలా ఎంచుకోవాలి?
X

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతి పథంలో నడవాలంటే ఇంజనీర్ల పాత్ర ఎంతో ముఖ్యం. తదనుగుణంగా నాణ్యమైన ఇంజనీర్ల తయారీ ఎంతో ముఖ్యం. ఎంసెట్‌-2025 ఫలితాలు విడుదల య్యాయి.. దీంతో విద్యార్థులు ఎటువంటి కళాశాలను ఎంపిక చేసుకోవాలి? ఏ కోర్సును ఎంచుకోవాలి? అసలు కళాశాల ఎంపిక కోసం ఏ ప్రమాణాలను పరిగణన లోకి తీసుకోవాలి? అని ఆలోచిస్తున్నారు.. ఇటువంటి అనేక సందేహాలు పరిశీలిస్తే..

ఇంజనీరింగ్ కోర్సు మాత్రమే కాదు.. కళాశాల నాణ్యత, గుర్తింపు, ఫీజు, ప్లేస్మెంట్, భవిష్యత్ అవకాశాలపై పూర్తి అవగాహన అవసరం. ఇంటర్మీడియట్‌ పూర్తయిన తర్వాత విద్యార్థి తన జీవితంలో కీలక నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. చదవ బోయే కోర్సు, కళాశాల గురించి తెలుసుకోవడం, వాటిని ఎంపిక చేసుకోవడం చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశం. ఇది ఉన్నత చదువుల నాణ్యతనే కాదు భవితను తీర్చిదిద్దే అంశం కూడా.

కళాశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి!

నేడు చాలామంది విద్యార్థులు జాయిన్ కాకముందే కోర్సును నిశ్చయించుకుంటున్నారు. ఫలానా కోర్సు మాత్రమే అని.. ఉదా: కంప్యూటర్‌ సైన్స్ కోర్సు కావాలనుకున్న విద్యా ర్థికి.. మంచి కళాశాలలో ఆ కోర్సులో సీటు సంపాదించే ర్యాంకు రానప్పుడు.. సెకండ్‌ ఆప్షన్‌గా ఉన్న మెకానికల్‌, సివిల్‌లో కూడా చేరవచ్చు. ఎందుకంటే నేడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‍ (ఏఐ) అనేది ఒక గ్రూప్‌కు మాత్రమే పరిమితమైందని అనలేం. ప్రతి రంగంలోనూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వినియోగిస్తున్నారు. కాబట్టి అన్ని సదుపాయాలు ఉన్న కళాశాల అయితే కోర్సుతో సంబంధం లేకుండా కళాశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకే ఆసక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా కోర్సు ఎంచుకోవడమే కాదు, ఆ కోర్సు అందించే కళాశాల నాణ్యత, గుర్తింపు, ఫీజు, ప్లేస్మెంట్, భవిష్యత్ అవకాశాలపై పూర్తి అవగాహన అవసరం. వేలాది కళాశాలలు, వందలాది కోర్సుల మధ్య సరైన ఎంపిక కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆలోచనాత్మకంగా ముందడుగు వేయాలి. కళాశాల ఎంపిక విషయంలో గుర్తించాల్సింది గుర్తింపు. ఏ గుర్తింపు లేని కళాశాలలో చదివితే ఆ డిగ్రీకి విలువ ఉండదు. అలాగే కళాశాలలో మౌలిక వసతులు చూసుకోవాలి. మౌలిక వసతులు అంటే తరగతి గదిలో బెంచీలు, బోర్డు, కుర్చీలు అనుకుంటారు. కాదు ఇందులో ప్రధానం ల్యాబ్స్. బోధన/థియరీ నాలెడ్జ్ ఎంత అవసరమో ప్రాక్టికల్‌ నాలెడ్జ్ కూడా అంతే ముఖ్యం. సాధారణంగా ప్రతి కళాశాలలోనూ ఇవి ఉన్నా.. వాటిని తప్పక వినియోగిస్తాయని చెప్పలేం. కాబట్టి వాటి గురించి పరిశీలించి అప్పుడు మాత్రమే ఒక నిశ్చిత అభిప్రాయానికి రావాలి.

న్యాక్ గ్రేడింగ్ చూడాలి!

విద్యార్థి విజయంలో ఉపాధ్యాయుల బోధన కీలకం. ఇంజనీరింగ్, సైన్స్‌ కోర్సుల్లో ప్రాక్టికల్‌ బోధనకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు అవసరం. అధ్యాపకుల వివరాలు, అర్హతలు కళా శాల వెబ్‌సైట్‌లో చూసి నిర్ణయం తీసుకోవాలి. కానీ కొన్ని ప్రైవేటు కళాశాలలు సరైన బోధకులు లేకుండా నడుస్తుండటం విద్యా నాణ్యతను దెబ్బతీస్తోంది. అందుకే కళాశాల ఎంపికలో అధ్యాపకుల నాణ్యతపై స్పష్టమైన అవగాహన తప్పనిసరి. ఇక కళాశాలకు న్యాక్ గ్రేడింగ్ ముఖ్యం. ఈ గ్రేడింగ్‌ను కళాశాల నాణ్యతను అధ్యాపకుల అర్హత, బోధన ప్రమాణాలు, వసతులు, పరిశోధన సామర్థ్యం ఆధారంగా అంచనా వేస్తారు. ప్రస్తుతం 450కి పైగా యూనివర్సిటీలు, 10,000 కళాశా లలు మాత్రమే న్యాక్‌ గుర్తింపు పొందినవిగా నమోదయ్యాయి. అంటే మొత్తం కాలేజీల్లో 25% మాత్రమే. కాబట్టి ఈ సంస్థల గుర్తింపు లేని కాలేజీల్లో చేరితే డిగ్రీ మాత్రమే కాదు భవిష్య త్తూ ప్రశ్నార్థకమవుతుంది. ఇక కొన్ని ప్రైవేటు కళాశాలలు ఐఐటీ, ఎన్‌ఐటీ కళాశాలల్లో బోధించే స్థాయిలో ఇంజనీరింగ్ విద్యను బోధిస్తున్నాయి. అలాంటి ప్రమాణాలు పాటించే కళాశాలలను ఎంపిక చేసుకోవచ్చు.

హాస్టల్ వసతి ముఖ్యం!

విద్యా నాణ్యతపై ప్రభావం చూపే కీలక అంశాల్లో మరో అంశం కళాశాల ప్రాంగణ వసతులు.. తరగతులూ, పరీక్షల కన్నా ఇది ఎక్కువగా విద్యార్థి రోజువారీ జీవితం వారి అభ్యాసాన్నీ, మనోభావాలనూ తీర్చిదిద్దుతుంది. కాబట్టి ఆధునిక ల్యాబొరేటరీలు, వర్క్‌షాపులు, పరిశ్రమ స్థాయి పరిక రాలతో పాటు హాస్టల్‌ వసతి, భద్రత, ఆహార నాణ్యత, వైద్య సదుపాయాలు, క్రీడా వసతులు లాంటి అంశాలూ అవసరం. ఇవి సరిగ్గానే ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇలా అన్నీ అనుగుణంగా ఉంటే ఫీజు ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి అందుకు మనం సన్నద్ధం అవ్వాలి. అలాగే పేరొందిన ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఫీజులే కాకుండా అదనపు చార్జీలు, ఇతర రుసుములపై సమాచారం తీసుకోవాలి. స్కాలర్‌షిప్పులు, స్టైఫండ్స్, రీయింబర్స్‌మెంట్, విద్యా రుణాలు లాంటి ఆర్థిక సహాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయా? ఫీజు ఒకేసారి కట్టాలా? విడతలుగా కట్టొచ్చా? అనే విషయాల్లో స్పష్టత అవసరం. అలాగే కళాశాలలో యాంటీ ర్యాగింగ్ టీమ్ ఉందా లేదా? అనేది పరిశీలించాలి.

కళాశాలే కెరీర్‌కి పునాది!

ఇంజనీరింగ్ కళాశాల ఎంపిక ద్వారా విద్యార్థి వృత్తి మార్గం సెట్‌ అవుతుంది. కాబట్టి ఎంచుకునే కళాశాలలో గత మూడేళ్లుగా ఎంత మందికి ఉద్యోగాలు లభించాయి? ఏ కంపెనీలు వచ్చాయి? సగటు జీతం ఎంత? ప్లేస్‌మెంట్‌ సెల్‌ ఎంత చురుగ్గా పనిచేస్తోంది? కార్పొరేట్‌ ఒప్పందాలు, ఇంటర్న్‌షిప్‌లు, క్యాంపస్‌ డ్రైవ్‌లు జరుగుతున్నాయా? అనేది పరిశీలించాలి. చివరగా కళాశాల అనేది వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే వేదిక. కావున మంచి క్యాంపస్ అనుభవం విజయం వైపు నడిపిస్తుంది. సరైన కళాశాల ఎంచుకుంటే, అది విద్యార్థుల్ని శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్లుగా, ఉపాధ్యాయులుగా, సంస్కారవంతులుగా లేదా తన కలలను నిజం చేసుకునే వ్యక్తులుగా తీర్చిదిద్దగలదు. మంచి కళాశాల మన వ్యక్తిత్వానికి బలం, విజ్ఞానానికి గమ్యం, కెరీర్‌కి పునాది అవుతుంది. కాబట్టి అన్ని కోణాల్లో ఆలోచించి మంచి కళాశాలను ఎంపిక చేసుకోవాలి.

-డా.కృష్ణ సామల్ల

ప్రొఫెసర్

97058 90045

Next Story