ఎన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నా.. సినిమా వాళ్లు మారరా?

by Ravi |   (  Updated:2025-08-23 01:15:33  IST  )

ఇటీవల సినిమా చిత్రీకరణ అయ్యాక సినిమా ప్రమోషన్ చేస్తూ ఈ సినిమాకు గొప్ప నిపుణులు దర్శక త్వం వహించారు.

ఎన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నా.. సినిమా వాళ్లు మారరా?
X

ఇటీవల సినిమా చిత్రీకరణ అయ్యాక సినిమా ప్రమోషన్ చేస్తూ ఈ సినిమాకు గొప్ప నిపుణులు దర్శక త్వం వహించారు, లెజెండరీ నటు లు నటించారు, అతి పెద్ద బ్యానర్లు నిర్మించాయి, కోట్లు పెట్టారు అని సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. అయినా సరే ఒక సాదాసీదా విజయాన్ని అందించే జనరంజక సినిమాను కూడా అందించలేకపోతున్నారు. కారణాలు విశ్లేషిస్తే..

ప్రస్తుతం ఆధునిక సాంకేతికత ఎఫ్ఫెక్ట్స్ వీఎఫ్ఎక్స్‌లు ఏవీ కూడా కొన్ని సినిమాల్ని నిలబెట్టలేకపోతున్నాయి. దీంతో ‘గేమ్ చేంజ్’ అయిపోతున్నది. ‘వీరమల్లులు’ నేలకరుస్తున్నారు. ‘తగ్’లు డంగై పోతున్నాయి.

దృష్టిని కట్టిపడేయడమే ధ్యేయంగా..

ఒక్క తెలుగులోనే కాదు దాదాపు అన్ని భాష ల్లో ఇదే స్థితి కనిపిస్తోంది. స్పెషల్ షోలకు అనుమతులు టికెట్ రెట్లు పెంచుకునే అవకాశాల్ని ప్రభుత్వాలు కల్పించినా ఎక్కడో తేడా కొడు తోంది. దానికి ప్రధాన కారణం ఆ సినిమాల్లో మంచి కథంటూ లేకపోవడమే. కేవలం మూస, మాస్ అంటూ వందలాది కోట్లు ఖర్చు పెడితే వచ్చే ఫలితాలు ఇట్లే ఉంటాయి మరి. ఇప్పుడు వస్తున్న అనేక సినిమాల లక్ష్యం కథ చెప్పడం కాదు హైప్ పెంచుకోవడం, తారల్ని పోగే యడం, భారీ సెట్‌లు కట్టడం. సినిమాల్లో ప్రతి ఐదు నిమిషాలకు ఒక హైలైట్ వేసి, ప్రేక్షకుడి దృష్టిని కట్టిపడేయడమే ప్రధాన ధ్యేయంగా తీస్తున్నారు. ఇలాంటి రెండు సినిమాలు చూసాక నన్ను వెంటాడిన ప్రశ్న ఇదే. ఇలాంటి ఒకే తరహా సినిమా ప్రాజెక్టుల్లో ఇంకా ఎన్ని రోజులు మునిగిపోతాం? మాయా జ్ఞాపకాల మత్తుల మీద నడిచే ఈ మూలధన కేపిటల్ ఆట చివరికి ఎప్పుడు ఆగుతుందో తెలుసా? ఎప్పుడంటే ఆ సినిమాలకు మూలధనంగా మంచి కథ, కొత్త కథనం ఉన్నప్పుడు..

భావోద్వేగాల వంతెన సినిమా!

సినిమా అనేది కేవలం కదిలే దృశ్యాలు, దద్దరిల్లేలా మోగే శబ్దాలు, ఆకర్షించే డాన్సులు మూస నటనల సమాహారం కాదు. ఇవన్నీ ఒక్కదానితో ఒక్కటి కలిసిపోయి మనసును తాకే, ఆలోచనలను కదిలించే అనుభవంగా మారే క్షణం, అదే కథ పుట్టే క్షణం. టెక్నాలజీ మెరుపు లు, కెమెరా అద్భుతాలు, విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ సినిమా ఆకర్షణను పెంచుతాయి. కానీ చివరికి ప్రేక్షకుడి హృదయంలో మిగిలి పోయేది, కాలం గడిచినా చెరిగిపోని ముద్ర వేసేది కథే. మంచి కథ ప్రేక్షకుడి మనసు తలుపు తడుతుంది. మంచి కథ అనేక భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. పాత్రలతో ప్రేక్షకుడు మమేకం కావడానికి, కథలో మునిగిపోవడానికి మార్గం సుగమం చేస్తుంది. ఒకసారి ఈ భావోద్వేగ వంతెన ఏర్పడితే సినిమా ముగిసిన తర్వాత కూడా ఆ అనుబంధం ప్రేక్షకుడి మనసులో నిలిచిపోతుంది. మంచి కథకు స్పష్టమైన నిర్మాణం ఉండాలి. ప్రారంభం, సంఘర్షణ, పరిష్కారం. ప్రతీకలు, మోటిఫ్‌లు సున్నితమైన అర్థాలను అందిస్తాయి. ఏ జానర్ అయినా, కథలో ప్రధాన పాత్ర చేసే ప్రయాణం, ఎదురవుతున్న చాలెంజ్‌లు చివరి విజయం సినిమాను సమగ్రంగా, ప్రభావ‌ వంతంగా చేస్తాయి.

కథను తోసిరాజంటే.. అంతే గతి!

కెమెరా యాంగిల్స్, ధ్వని, ఛాయాగ్రహణం ఇవన్నీ కథను మరింత సజీవం చేస్తాయి. అవి కథకు సేవ చేయాలి, బలాన్నివ్వాలి. కేవలం దృశ్య వైభవం లేదా విజువల్ ఎఫెక్ట్స్‌పై ఆధారపడిన సినిమాలు ఎక్కువ కాలం నిలవవు. గతకాలపు సినిమాల్లో కథల ద్వారా విలువలు, నీతులు బోధించారు. నేడేమో కంటెంట్ అం‌టూ ఉప్పెనలో సినిమాలు కొట్టుకు పోతున్నా‌యి. ఎప్పటికయినా ఎలాంటి స్థితిలోనయినా మంచి కథకు మాత్రమే మనసును కదిలించే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే కథనే సినిమాకు ‘హృదయం-ఆత్మ’గా పరిగణి స్తారు. కథాంశం అనేది సినిమాకు మూల స్తం‌భం, ఇది కథనం, ప్లాట్, ప్రేక్షకులను ఆక ర్షించే ఇతివృత్తాలను కలిగి ఉండాలి. కథే భావోద్వేగ ప్రభావాన్ని సృష్టించడానికి సినిమా ల్లో సంఘటనలను సంఘర్షణలను సృష్టిస్తుంది.

సినిమా.. మూడు అంకాల నిర్మాణం!

చాలా సినిమాలు ప్రధానంగా మూడు అంకాల నిర్మాణాన్ని అనుసరిస్తాయి మొదటిది ప్రారంభం, మధ్య సంఘర్షణ (conflict), ముగింపు (ending) ఉంటాయి. ఇక సినిమా కథల్లో సంఘర్షణ కథను నడిపిస్తుంది. ఇది ప్రధానంగా పాత్రల నడుమ, పాత్రలకు సమాజానికి నడుమ జరిగే ఒత్తిడి సంఘర్షణలను రూపొందిస్తుంది. ఇక సినిమాల్లో ఇతివృత్తాలు ప్రధానంగా విమోచనం, త్యాగం, లేదా గుర్తింపు వంటి అంతర్లీనమైన ఆలోచనలు కథకు లోతును తెస్తాయి. దర్శకుడి కథకుడి దృక్కోణం మరో అంశం. అది ప్రేక్షకుల అనుబంధాన్ని ప్రభావితం చేస్తుంది. సినిమాల్లో పేసింగ్, టోన్ ఆ సినిమాలోని దృశ్య లయ, భావోద్వేగ అనుభూతిని నియంత్రిస్తా‌యి, చర్య, సంభాషణ, నిశ్శబ్ద క్షణాలను సమతుల్యం చేస్తాయి. సినిమాల్లో పాత్రలు కథకు హృద యం లాంటివి. భావోద్వేగ కేంద్రాన్ని పాత్రల చర్యల ద్వారా కథను నడిపిస్తాయి.

ఎప్పుడైతే కథ నేల విడిచి సాము చేస్తుందో?

ఇట్లా సినిమా నిర్మాణంలో కథ ముఖ్య భూమిక. ఎప్పుడయితే కథ నేల విడిచి సాము చేస్తుందో అప్పుడే ఆ సినిమా నడక పాతాళానికి వెళ్తుంది. సినిమా ఎంత వ్యాపారమైనా సమాజాన్ని విడిచి ఊహల్లోకి వెళ్తే అది అదేవిధంగా ప్రేక్షకుల దృష్టిలోంచి కూడా ఎగిరి పోతుంది. గతకాలపు సినిమాల్లో ప్రేమ, కుటుంబ అనుబంధాలు, ఎప్పటికప్పుడు కొత్త గా మనసుకు హత్తుకునేవిగా ఉండేవి. అందుకే గుండమ్మ కథ, మిస్సమ్మ, మూగమనసులు లాంటివి అజరామరంగా నిలిచిపోయాయి. కానీ ఇవాళ ప్రేమంటేనే రొమాన్స్, హాస్యమంటే ద్వంద అర్థాల బూతు జోకులు, పాటలంటే శబ్దాల మోత, సంగీతమంటే హాలు దద్దరిల్లి పోవడం మాత్రమే. ఒక రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ సినిమా ఆడితే ఇక వరుసబెట్టి అవే సినిమాలు.. ఇంకా ఈ రోజుల్లో పాన్ ఇండియా అంటూ వివిధ భాషా సినీనటుల్ని సమీకరించి కిచిడిలా కథల్ని అల్లి ప్రేక్షకుల మీదికి తోసేస్తే ఎవరైనా ఎంతకాలమని చూస్తారు? అందుకే సినిమా విజయానికి మంచి కథ ప్రధానం. ‘కోర్టు’ లాంటి సినిమాలు జనం చూసారుగా. మన సినిమా వాళ్లు ఎప్పటికి తెలుసుకుంటారో మేలుకుంటారో చూడాలి..

- వారాల ఆనంద్

94405 01281

Next Story