ఇన్ని యాప్‌లతో అన్నదాత వేగేదెలా?

by Ravi |   (  Updated:2026-06-24 01:16:19  IST  )

డిజిటలీకరణ పేరుతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఎరువుల కొరత, పంటలకు గిట్టుబాటు ధరల లేమి, కొనుగోలు కేంద్రాల అనిశ్చితి, బీమా సమస్యలు, వ్యవసాయ రంగంలో పెరుగుతున్న సవాళ్లపై సమగ్ర విశ్లేషణ. రైతు శ్రమకు విలువ దక్కే పరిస్థితులు ఎప్పుడు వస్తాయన్న ప్రశ్నకు ఈ కథనం అద్దం పడుతుంది.

ఇన్ని యాప్‌లతో అన్నదాత వేగేదెలా?
X

నాగలి మొనకు నేల తెలిసినంతగా రైతు కష్టాలు ఈ పాలకులకు తెలియడం లేదు. పొద్దు పొడవక ముందే పొలంలో అడుగుపెట్టి, చీకటి కమ్ముకున్నాక ఇంటి ముఖం చూసే రైతు నేడు పంట కోసం కాదు, తన పంటను అమ్ముకోవడం కోసం ఎక్కువగా పోరాడుతు న్నాడు. ఒకప్పుడు రైతు ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాలతో పోరాడేవాడు. కానీ ఇప్పుడు పంట వేసే రోజు నుంచి అమ్మే రోజు వరకు ప్రతి దశలో అనిశ్చితి వెంటాడుతున్నది.

ప్రస్తుతం వ్యవసాయ రంగంలో డిజిటలీకరణ పేరుతో అనేక సేవలను యాప్‌ల ద్వారా అందిస్తున్నారు. ఎరువులు కావా లంటే యాప్‌లో నమోదు చేసుకోవాలి. బుకింగ్ చేసుకోవాలి. ధృవీకరణ పొందాలి. అయితే పల్లెల్లో నివసించే ప్రతి రైతుకు స్మార్ట్‌ఫోన్ లేదు. ఉన్నవారికి కూడా నెట్‌వర్క్ సమస్యలు, సాంకేతిక అవగాహన లోపాలు అడ్డంకిగా మారుతు‌న్నాయి. వ్యవసాయంలో దశాబ్దాల అనుభవం ఉన్న రైతు, ఇప్పుడు ఓటీపీలు, లాగిన్‌లు, సర్వర్ సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

నాగలి కంటే మొబైల్ ఎక్కువనా..?

నేడు వ్యవసాయ శాఖ రైతు చేతిలో నాగలికంటే మొబైల్ ఫోన్ ఎక్కువగా పెడుతున్నది. ఎరువులు కావాలంటే యాప్, నమోదు కావాలంటే యాప్, వివరాలు చూడాలంటే యాప్ కానీ పల్లె రైతుకు ఆ యాప్‌లు ఎవరు నేర్పిస్తారు? సిగ్నల్ లేని తండాలో, నెట్‌వర్క్ సరిగా రాని గ్రామంలో, చదువు లేని వృద్ధ రైతు ఆ యాప్‌లతో ఏం చేయాలి? రైతు జీవితమంతా మట్టితో ముడిపడి ఉంటుంది గానీ మొబైల్ స్క్రీన్‌తో కాదు. యాప్‌లో బుక్ చేశామంటారు. సర్వర్ పనిచేయదంటారు. ఓటీపీ రాదంటారు. స్టాక్ లేదంటారు. చివరికి రైతు మళ్లీ ఎరువుల దుకాణం చుట్టూనే తిరగాల్సి వస్తుంది. ముందు లైన్‌లో నిలబడి బాధపడేవాడు. ఇప్పుడు ఫోన్ చేతిలో పట్టుకొని బాధపడుతున్నాడు. బాధ రూపం మారిందే తప్ప రైతుకు కష్టం తగ్గలేదు.

పంట పొలాల్లో.. నిర్ణయాలు ఆఫీసుల్లో...

వరి, పత్తి రైతులకు ఎకరాల కొద్దీ సాగు ఉన్నా, అవస రమైన సమయంలో కావాల్సినంత యూరియా అందడం లేదు. పంటకు అత్యవసరమైన దశలో ఎరువుల కోసం రైతులు దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. ఒకవైపు అధికా‌రులు యాప్‌లలో బుకింగ్‌లు, ఆన్‌లైన్ విధానాల గురించి గొప్పలు చెబుతుంటే, మరోవైపు రైతు మాత్రం యూరియా బస్తా కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది. ఏ పంటకు ఎంత ఎరువు అవసరమో, ఏ సమయంలో వేయాలో నేలతో బతికే రైతుకే బాగా తెలుసు. కానీ నిర్ణయాలు మాత్రం పొలాల్లో కాదు, కార్యాలయాల గదుల్లో జరుగుతున్నాయి. దాంతో పంట అవసరాలు ఒక వైపు, ప్రభుత్వ విధానాలు మరోవైపు నడుస్తూ రైతును ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

పంటకు ధర నిర్ణయించే హక్కు లేకపోతే..

మరోవైపు మార్కెట్‌లో రైతు పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పంట పండించడం ఒక కష్టం అయితే, దాన్ని అమ్ముకోవడం మరో పెద్ద కష్టం. విత్తనం కొనేటప్పుడు రైతు ధర నిర్ణయించడు. ఎరువు కొనేటప్పుడు రైతు ధర నిర్ణయించడు. మందులు కొనేటప్పుడు రైతు ధర నిర్ణయించడు. కానీ తన పంట అమ్మేటప్పుడు కూడా ధర నిర్ణయించే హక్కు రైతుకే ఉండదు. వ్యవసాయ మార్కెట్లలో దళారులే అసలు దొరలు.. రైతు ఏడాది కష్టాన్ని వారు నిమిషాల్లో తీర్పు చెబుతారు. తేమ ఎక్కువట, గింజ చిన్నదట, రంగు సరిగాలేదట ఇలా ఏదో ఒక కారణం చూపి ధర తగ్గిస్తారు. రైతు అప్పుల బాధలో ఉంటాడు కాబట్టి వాళ్లు చెప్పిన ధరకే అమ్మేస్తాడు. నష్టాలు రైతువి.. లాభాలు దళారులవి. పంట పండించే రైతు ధర నిర్ణయించలేడు. కానీ ఎన్నడూ పంట చూడని వ్యాపారి ధర నిర్ణయిస్తాడు. నేటి వ్యవసాయ వ్యవస్థలోని అతిపెద్ద విషాదం. ఇక కొనుగోలు కేంద్రాల పరిస్థితి చూస్తే రైతు గుండె పగిలిపోతుంది. ప్రభుత్వం కొనుగోలు చేస్తామంటుంది. కానీ ఎంత కొనుగోలు చేస్తుందో స్పష్టత ఉండదు. కేంద్రం ఎంత కొంటే అంతే కొంటామంటూ చేతులు దులుపుకోవడం బాధ్యత నుంచి తప్పించుకోవడమే. రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఇచ్చిన హామీలకు ఇది పూర్తి విరుద్ధం.

పంట పండినా నష్టమే అయితే ఎలా?

రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో అందడం లేదు. బీమా చెల్లింపులపై సందిగ్ధత నెలకొంది. ఎరువుల కొరత కొనసాగుతోంది. కొనుగోళ్లపై అనిశ్చితి పెరుగుతోంది. ఒక చేత్తో హామీలు ఇస్తూ మరో చేత్తో బాధ్యతల నుంచి తప్పు కోవడం రైతును మరింత నిరాశకు గురిచేస్తున్నది. ఇప్పుడు రైతుకు భయం వర్షం రాకపోవడంపై మాత్రమే కాదు. పంట అమ్ముడవుతుందా లేదా? అన్నదానిపైనా ఉంది. ఒకప్పుడు పంట పండకపోతే నష్టం. ఇప్పుడు పంట బాగా పండినా నష్టమే. ఎందుకంటే మార్కెట్ రైతు చేతిలో లేదు. వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు రైతు భవిష్యత్తుపై మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

రైతు సమస్యలు కొత్తవి కావు..

రైతు సంక్షేమం అనేది ఒక వర్గం సమస్య కాదు, దేశ ఆహార భద్రతకు సంబంధించిన అంశం. రైతు శ్రమకు గౌరవం, పంటకు గిట్టుబాటు, బతుకుకు భరోసా ఉన్నప్పుడే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. గ్రామాలు బలపడితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి. అవి పొలాల నుంచి ప్రభుత్వాల దృష్టికి ఎన్నోసార్లు చేరాయి. కానీ పరిష్కారాలు మాత్రం ఇప్పటికీ దూరంగానే ఉన్నాయి. రైతు చెమటకు విలువ, పంటకు భరోసా, శ్రమకు గౌరవం లభించే వరకు ఈ గోస ఆగదు.

- బసడ సంపత్ యాదవ్

70321 32593

Next Story