- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ టీచర్ల కన్నీళ్లు ఎలా తుడవగలం?
ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వల్ల బెంగాల్ ప్రభుత్వానికి ఒక పెద్ద అఘాతం కలిగింది. 2016 ఉపాధ్యాయ నియామకాల ప్యానల్లో

ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వల్ల బెంగాల్ ప్రభుత్వానికి ఒక పెద్ద అఘాతం కలిగింది. 2016 ఉపాధ్యాయ నియామకాల ప్యానల్‌లో చాలా అవకతవకలు జరిగాయనే విమర్శ ఉంది. ఫలితంగా హైకోర్టులో చాలా రోజులు ఈ కేసు కొనసాగింది. గత సంవత్సరం హైకోర్టు పూర్తి ప్యానల్ రద్దు చేసింది. సుప్రీంకోర్టు కూడా అదే దారిలో తీర్పు ఇచ్చింది. ఈ ప్యానల్ ప్రకారం రెండు రకాల ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరు, ఏ విధమైన లంచాలు ఇవ్వకుండా, ఏ విధమైన అవినీతికి పాల్పడకుండా ఉద్యోగం సంపాదించి ఆయా విద్యాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మరో రకం, లంచాలు విపరీతంగా ఇచ్చి ఉద్యోగాలు సంపాదించి హాయిగా భారత ప్రజల టాక్స్ పేయర్స్ మనీని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కథ అర్హులు, అనర్హులు అన్న హద్దు దాటి మరింత వ్యవస్థాగతమైన అవినీతి వైపు పయనిస్తోంది.
ప్యానల్లో ముందు వరుసల్లో ఉండి ఉద్యోగాలకు పూర్తిగా అర్హులైన వారిని వెనక్కి తోసి, లంచాలు ఇచ్చిన వారిని ముందుకు జరిపి ఉద్యోగాలు ఇచ్చిన సంఘటనలు కనిపించాయి. ప్యానల్ ఎక్స్‌పైరీ తర్వాత కూడా జాబ్స్ ఇచ్చారు. ఎస్‌ఎస్‌సి రికమండేషన్ లెటర్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చేశారు. సీబీఐ దర్యాప్తులో ఇలాంటి గందరగోళాలు ఎన్నెన్నో బయటకు వచ్చాయి. అలానే, కొంతమంది ఇప్పటికీ, తమకు ఉద్యోగాలు రాలేదనీ, ప్యానల్‌లో ఉన్నామనీ అంటు న్నారు. ఈ కేటగిరీ వారు కూడా ఎన్నో రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. ఓఎంఆర్ షీట్లు కాల్చేశారు. కాబట్టి, ఈ కథ అర్హులు, అనర్హులు అన్న హద్దు దాటి మరింత వ్యవస్థాగతమైన అవినీతి వైపు పయనిస్తోంది. తీగలాగారు డొంకంతా కది లింది అన్నట్టు చిక్కు ముడి వీడసాగింది. సుప్రీంకోర్టు మొత్తం ప్యానల్‌ని క్యాన్సిల్ చేసింది. ఈ ప్యానల్ రద్దు కారణంగా ఏ రకమైన అవినీతి లేకుండా ఉద్యోగం సంపాదించిన ఉపాధ్యాయులు కూడా సమిధలయ్యారని మరో వాదన. అయితే ప్యానల్ మొత్తం చాలా అవకతవకలతో ఉందనీ, రిపేర్ చేయడానికి వీలు లేనంత అవినీతి జరిగిందని కోర్టు అభిప్రాయపడింది అని తెలుస్తోంది.
సుప్రీం తీర్పును ధిక్కరించలేరు!
ప్రజలు బాధ్యతగా ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో ఉన్నా అవి పౌరుల మేలు కోసం పని చేయాలి. భారత రాజ్యాంగాన్ని పాటించాలి. ఉద్యోగావకాశాలు పౌరులందరికీ ఇవ్వాలి. మరలా పరీక్షలు రాసే ప్రశ్నే లేదని బాధితులైన టీచర్స్ బల్లగుద్ది చెబుతున్నారు. కానీ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరో కొత్త నియామకం మూడు నెలల్లోనే పూర్తి చేయాలి. నియామకాలు అంటేనే మరలా పరీక్షలు. అవినీతి రంగు అంటిన వారు మాత్రం తమ జీతాలు తిరిగి చెల్లించాలి. తాము ఈ వయసులో కుటుంబ బాధ్యతలను తల మీద వేసుకుని మరలా పరీక్షలు ఎలా ప్రిపేర్ కాగలం? అని అవినీతి ఆరోపణలు లేని వర్గం ప్రశ్నిస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్‌కు ఇదో పెద్ద తలనొప్పి వ్యవహారం అయింది. అవకతవకలు అసంఖ్యాకంగా ఉన్న ప్యానల్‌లో అర్హులు, అనర్హులను విడదీసి పట్టుకోవడం సాధ్యం కానప్పుడు ప్యానల్ క్యాన్సిల్ అవ్వక తప్పదని చట్టం చెబుతోంది. ఇది సిపిఐఎం, బీజేపీ పన్నాగం అని అధికారంలో ఉన్న పార్టీ అంటోంది. రాజకీయాలు మాకు అనవసరం. మేం అర్హులం. మా ఉద్యోగాలు ఎందుకు పోయాయి? అని టీచర్స్ అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మరో తీర్పు ఎక్కడా ఉండదనీ, దాన్ని ఒకరికి నచ్చినా, నచ్చకపోయినా పాటించడం తప్ప మరో దారి లేదని ఈ కేసులో కీలక పాత్ర పోషించిన అడ్వకేట్ ఫిరదౌసి అంటున్నారు.
జాబ్స్ కోల్పోయిన వారికి అగౌరవం!
చట్టం, కోర్టులు, పరిపాలనకు సంబంధించిన విషయాలు ఇలా ఉంటే, విచ్ఛిన్నం కాబోతున్న సామాజిక, ఆర్థిక సాంస్కృతిక జీవితం నేడు వేదన భరితంగా ఉంది. జీతాలు రాకపోతే జీవితాలు ఎలా కొనసాగుతాయి? కాబోయే అల్లుడు టీచర్ అని ఆనందంగా ఒక తండ్రి తన కుమార్తెకి పెళ్ళి చేసి ఉంటారు. మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి? అమ్మాయికి ఉద్యోగం ఉందని మంచి జీతం తెస్తుందని ఒక తండ్రి తన ఉద్యోగం ఉన్న కొడుకుకి పెళ్లి చేస్తాడు. ఈరోజు తమ కోడలు జీతం తేవడం లేదన్నమాట తెలిస్తే ఆ ఇంట్లో మహిళ పరిస్థితి మొదట్లానే ఉంటుందా? టీచర్ జాబ్ ఉంది అని తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో వేసి ఉంటారు. ఇప్పుడు ఆ జీతం రానప్పుడు ఆ పిల్లల ఫీజులు ఆ తల్లిదండ్రులు ఎలా భరిస్తారు? ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి మరలా ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి ఆ పిల్లల్ని మార్చేటప్పుడు ఆ పిల్లల మానసిక పరిస్థితి అలాగే ఉంటుందా? టీచర్ జాబ్ ఉందని తమకు చిన్న ఇల్లు చాలదని బ్యాంకులో హౌసింగ్ లోన్ తీసుకొని మంచి ఫ్లాట్ తీసుకుని ఉండొచ్చు. ఆ ఈఎంఐ తీర్చకపోతే ఆ మనిషిని బ్యాంకు విడిచి పెడుతుందా? ఆ ఇంటి నుండి మరల కుటుంబం అద్దె కోసం చిన్న ఇంటిలోకి వచ్చేటప్పుడు ఆ కుటుంబం మానసిక పరిస్థితి, సమాజంలో వారి గౌరవం మొదట్లానే ఉంటుందా?
ఈ మౌనం అతి ప్రమాదకరం!
ప్రపంచీకరణ ఫలితంగా మధ్యతరగతికి ఒక వ్యూహాత్మక మౌనం అలవాటైపోయింది. 30 సంవత్సరాల ముందు కని పించిన ప్రజల చైతన్యం నేడు దేశంలో తగ్గింది. ప్రశ్నించే మనిషి సర్దుకుపోయే స్థాయికి చేరుకున్నాడు. నాయకులకు కూడా ఇలాంటి పౌరులే కావాలి. ఈ భావజాలం ఏ రాష్ట్రంలో అయినా సరే ఇలాంటి విపరీతమైన సమస్యలకు దారి తీస్తుంది. ప్రజా ప్రభుత్వాలు ఎన్నికలతోనే ముగిసిపోవు. బాధ్యతాయుతమైన పౌరులు పరిపాలనా వ్యవహారాల్లో చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ప్రశ్నించాలి. ఠాగూర్, అమర్త్యసేన్, శరత్ చంద్రల శ్వాసను పీలుస్తున్న బెంగాల్ ప్రజలు తప్పకుండా సమాధానం వెదుకుతారు. పరిస్థితుల్ని సరిదిద్దుతారు.
- కేశవ్
ఆర్థిక సామాజిక విశ్లేషకులు
98313 14213






