- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైల్లో బంధించిన ఆశ.. పాలస్తీనా నెల్సన్ మండేలా బర్కూటీ కథ
గత రెండేళ్లుగా ఇజ్రాయెల్ వరుస దాడులతో రక్తసిక్తమౌతున్న పాలస్తీనాలో ఇక మిగిలేది మరుభూమే అనుకుంటున్న తరుణంలో కాల్పుల విరమణ ప్రపంచానికి కొంత ఊరటనిచ్చింది.

గత రెండేళ్లుగా ఇజ్రాయెల్ వరుస దాడులతో రక్తసిక్తమౌతున్న పాలస్తీనాలో ఇక మిగిలేది మరుభూమే అనుకుంటున్న తరుణంలో కాల్పుల విరమణ ప్రపంచానికి కొంత ఊరటనిచ్చింది. ఇదేమి ద్వైపాక్షిక ఒప్పందం కాదు, పాలస్తీనా పెడ రెక్కలు విరిచి పట్టుకొని ఒప్పుకోక తప్పదని వేలిముద్రలు తీసుకున్నదే. ట్రంప్ శాంతి సూత్రాల్లో ఉన్నదంతా ఇజ్రాయెల్ పక్షపాతమే. ఈ మాత్రానికే పాలస్తీనాలోని అరబ్బులు హర్షాతిరేకాలు ప్రదర్శిస్తున్నారంటే వారు అనుభవించిన దుర్భర పీడనను ఊహించవచ్చు.
ఇరువైపులా బందీల, ఖైదీల అప్పగింతలో భాగంగా ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా పౌరుల్లో సుమారు 2 వేల మంది ఖైదీలు ఇళ్లకు చేరుకుంటున్నారు. వారిలో మార్వాన్ బర్కూటీ ఉంటారని పాలస్తీనీయులు ఆశగా ఎదురు చూశారు. అయితే వారి ఆశ అడియాసే అయింది. తమ వారి విడుదల కోరుతూ హమాస్ ఇచ్చిన రాజకీయ, యుద్ధ ఖైదీల జాబితాలో బర్కూటీ పేరు మొద టిది. అయితే ఆయన్ని జైలు నుంచి బయటకు పంపడానికి నెతన్యాహూ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆయన మా కోర్టులో అయిదు మరణశిక్షలు పడిన నేరస్తుడు, వదిలే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ చెప్పింది. పాలస్తీనా పౌరులు మాత్రం ఆయన్ని తమ దేశపు నెల్సన్ మండేలా అని చెప్పుకుంటారు.
ఆ నేరాలకు సంబంధం లేదని చెప్పినా..
పాలస్తీనా ప్రజలు మార్వాన్ బర్కూటీని కాబోయే దేశాధ్యక్షుడిగా గుర్తిస్తున్నారు. 1996లో జరిగిన ఎన్నికల్లో పాలస్తీనా నేషనల్ అథారిటీ నుండి రమల్లా జిల్లాకు లెజి స్లేచర్ కౌన్సిల్‌గా ఆయన ఎన్నుకోబడ్డారు. యుద్ధాల కారణంగా అక్కడ ఎన్నికలు వరుసగా వాయిదా పడుతున్నాయి. పాలస్తీనా అధ్యక్షుడిగా కొనసాగుతున్న మహ్మద్ అబ్బాస్ వయోధికుడు. ఆయన వారసుడు ఎవరు అని వివిధ సంస్థలు జరిపిన ఒపీనియన్ పోల్స్‌లో బర్కూటీ పేరు అగ్రస్థానంలో ఉంటోంది. అలాంటి వ్యక్తిని 2002లో ఇజ్రాయెల్ అరెస్టు చేసి జైల్లో వేసింది. అయిదుగురు ఇజ్రాయిలీలు చనిపోయిన దాడికి బర్కూటీ బాధ్యుడని ఆయనపై 26 నేరారోపణలు చేసింది. ఆ నేరాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన వాదించినా ఇజ్రాయెల్ కోర్టు వినకుండా 2004లో ఆయనకు అయిదు జీవిత ఖైదీలతో పాటు 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆయనపై సరియైన విచారణ జరగలేదని, సాక్ష్యాలు కూడా సరిపోవని అంతర్జా తీయ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిరక్షణ సంస్థ అయిన ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ తమ నివేదికలో తెలిపింది. ఇజ్రాయెల్ కోర్టులు దానిని పట్టించుకోలేదు. ఆనాటి నుండి బర్కూటీ జైల్లో ఉంటూ కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నారు.
ఇజ్రాయెల్ భయం ఇదే..
తమ దేశ సమస్యల పరిష్కారానికి బర్కూటీ పాత్ర అవసరమని హమాస్ కూడా భావిస్తుంది. ఆయన రూపొందించిన రెండు రాజ్యాల మధ్య రాజకీయ ఒప్పంద పత్రాన్ని హమాస్ మద్దతు పలికింది. అందుకే ఆయన విడుదల కావాలని ప్రతిసారి ప్రయత్నిస్తోంది. 2011లో ఇజ్రాయెల్ సైనిక అధికారి గిలాద్ షాలిత్ విడుదల సందర్భంగా బర్కూటీని అప్పగించమని హమాస్ కోరింది. అప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. బర్కూటీ బయటికి వస్తే పాలస్తీనాలో ప్రజల ఐక్యత పెరిగి తమ ఆధిక్యత కోల్పోతామని ఇజ్రాయెల్ భయపడుతోంది. ఆయనను విడుదల చేసి పాలస్తీనాకు పంపకుండా ప్రవాసానికి వెళ్లేలా అనుమతి ఇచ్చినా చాలని వివిధ సంస్థలు కోరుతున్నాయి. హమాస్ కూడా అందుకు సిద్దమే. ఆయన స్వదేశంలో కాకుండా ఏదో దేశంలో శరణార్ధిగా జీవితం గడిపేందుకు కూడా ఇజ్రాయెల్ ఒప్పుకోవడం లేదు. ఆయన ఎక్కడున్నా ప్రజలను ప్రభావితం చేయగలడని అది నమ్ముతోంది.
హింసలకు గురిచేస్తూ..
ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆయన్ని జైలులోనే చంపేయాలని మానసికంగా, శారీరకంగా ఎన్నో హింసలకు గురిచేస్తున్నారు. తీవ్రంగా కొట్టి నగ్నంగా ఇతర ఖైదీల ముందు ఈడ్చుకుపోతున్న దృశ్యాలు చూసిన వారు ఉన్నారు. మొలలు దించిన కుర్చీపై గంటల తరబడి కూర్చోబెట్టారు. గవర్నర్ ముందు మోకాళ్లపై కూర్చోనందుకు భుజంపై ఒత్తిడి చేయడంతో ఎముక పక్కకు జరిగింది. చీకటి గదిలో ఉంచి భారీ శబ్దాల చప్పుడును వినిపిస్తున్నారు. 2017లో జైల్లో సౌకర్యాల పెంపు కోసం, ఖైదీల బాగోగుల కోసం 40 రోజుల పాటు నిరాహార దీక్షలు నిర్వహించారు. అక్టోబర్ 2023 నుండి కుటుంబ సభ్యులు ఆయన్ని కలిసేందుకు అనుమతిని ఇవ్వడం లేదు.
జైల్లోనే తుదముట్టించాలని..
1960లో పుట్టిన మార్వాన్ బర్కూటీ 15వ ఏటనే పాలస్తీనా జాతి విముక్తి ఉద్యమంలో చేరారు. 18 ఏళ్ల వయసులోనే అరెస్టు అయి జైలు పాలయ్యారు. ఆ రోజుల్లో ఇంటరాగేషన్‌లో మర్మాంగాలపై దెబ్బలకు స్పృహ కోల్పోయే వాడినని రాసుకున్నారు. విద్యార్థిగా 1983లో యూనివర్సిటీలో చేరారు. అరెస్ట్, జైలు, ప్రవాస జీవితం వల్ల 1994లో డిగ్రీ పూర్తయింది. 1998లో పీజీ చదివారు. జైల్లో ఉంటూ ఆయన '1000 డేస్ ఇన్ సాలిటరీ జైల్' అనే పుస్తకం రాశారు. 2017 నుండి ఆయన ఐదేళ్ల జైలు జీవి తంపై 2022లో 'టుమారోస్ ఫ్రీడమ్' అనే డాక్యుమెంటరీ వచ్చింది. అదే సంవత్సరం బర్కూటీ పేరు నోబెల్ శాంతి బహుమతికి సూచించబడింది. జాతి యావత్తు తలుచుకుం టున్న మనిషిని జైల్లోనే తుదముట్టించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కోరుకుంటున్నాడు. పాలస్తీనా శిథిల గోడలపై బేడీలతో ఉన్న మార్వాన్ బర్కూటీ చిత్రంతో పాటు ఆయన విడుదలను కోరుతూ జనం రాసిన నినాదాలు ఇంకా ఉన్నట్లే వారి గుండెల్లోనూ అదే కాంక్ష చెక్కు చెదర లేదు. ప్రజల శాంతిదూతను జైల్లో ఉంచి ట్రంప్, నెతన్యాహూ తెచ్చిన ఒప్పందాలు కొంగ జపాన్ని తలపిస్తున్నాయి.
- బద్రి నర్సన్
94401 28169






