హోలీ.. బంజారాల పండుగ

by Ravi |   (  Updated:2026-03-03 00:46:10  IST  )

బంజారా ప్రజలు ప్రకృతి ప్రేమికులు, ప్రకృతినే దేవదేవతలుగా ఆరాధించే ప్రకృతి ప్రియులు.. హోలి రంగుల పండుగే అయినా ఇప్పటికీ చాలా వరకు నంగరి (తాండ) ల్లో రసాయన భరిత రంగులను వ్యతిరేకిస్తారు.

హోలీ.. బంజారాల పండుగ
X

బంజారా ప్రజలు ప్రకృతి ప్రేమికులు, ప్రకృతినే దేవదేవతలుగా ఆరాధించే ప్రకృతి ప్రియులు.. హోలి రంగుల పండుగే అయినా ఇప్పటికీ చాలా వరకు నంగరి (తాండ) ల్లో రసాయన భరిత రంగులను వ్యతిరేకిస్తారు. కారణం కేసులా రో ఫూల్ (మోదుగ పువ్వు). కేసులా బంజారా ప్రజల హోలీ సంబరాల్లో, దైవారాధనల్లో ప్రథమమైనది. ఔషధాలు మెండుగా ఉన్న ఈ పూలను నానబెట్టి, ఉడకబెట్టి రంగును సేకరించి బంజారా ప్రజలు హోలీ సంబరాలు జరుపుకుంటారు.. తద్వారా రసాయనాలకు దూరంగా, ఔషధాలకు దగ్గరగా ప్రకృతికి హాని కలుగకుండా జాగ్రత్త పడవచ్చు అని భావిస్తారు.

చెవులకింపైన పాటలు..

హోలీ అనగానే బంజారా ప్రజలకు గుర్తుకొచ్చేవి మోదుగ పూలు (కేసులా), హోళి పాటలు.. హోలీకి వారం పదిహేను రోజుల ముందు నుంచే బంజారా నంగరి (తాండ)లలో పాటలు, నృత్యాల సందడి మొదలవుతుంది. రోజంతా పనిచేసి అలసిపోయినా కూడా నంగరి వాసులంతా కలిసి మేరమా యాడి, సేవాభాయా, బాలాజీ బాపూ, రాములవారు, సీతమ్మ తల్లి, హనుమాన్ గాజీ వాలళో, హథీరామ్ బావాజీ లకు సంబంధించిన పాటలను లయబద్ధంగా పాడుతారు. అలసట అంతా తీరే దాకా నృత్యం చేసుకుంటూ మధురమైన రీతిలో శ్రవణానందంగా పాడుతారు. ఎంతటి ఘాడ నిద్రలో ఉన్నా ఆ పాటలు వినసొంపుగా చెవుల్లో తేనె పోసినట్టుగా అనిపించేవి.

కామాన్ని తీర్చుకోవడంపై పాటలు..

హోళికి రెండు మూడు రోజుల ముందు కామ, రతి సంబంధిత పాటలను కూడా పాడుతారు.. ఈ పాటలు పాడినా, విన్నా మనస్సును మధించే మన్మధుడ్ని అదుపులో ఉంచుకొని కామాన్ని ధర్మం కోసమే తీర్చుకోవాలని ఈ పాటల ద్వారా హితవు పలుకుతారు. ఇందులో భాగంగా నంగరి పెద్దలు అంతా కలిసి పురుషుల తరపున ఒకరిని గేర్య అనే ఒక పాత్ర ధారుడిగా, మహిళల తరుపున ఒకరిని గేరణి అనే ఒక పాత్ర ధారిగా ఎన్నుకుంటారు. కొత్తగా పెళ్లయిన వధూవరులు ఒకరినొకరు అర్ధం చేసుకొని వారి దాంపాత్య జీవితంలో ఎటువంటి తగాదాలు చోటుచేసుకోకుండా ఉండటానికి శారీరకంగా, మానసికంగా ఒకరినొకరు అర్ధం చేసుకోవాలని భావించి గేరణి పేరు మీదుగా మహిళలు గేర్య పేరుమీదుగా పురుషులు వారి వారి సమూహంతో ఏకమయి వృతాకారంలో తిరుగుతూ కాళ్ళకు గజ్జలు, భుజానికి వీరేణా పాటో, చేతిలో గొడుగు పట్టుకుని పాటలు పాడుతూ నవ దంపతులు పిల్లాపాపలతో సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తారు.

ధూండ్ కార్యక్రమం..

అన్నీ సుగుణాలు కలబోసుకున్న కుమారుడు ధర్మ పాల రక్షకుడుగా ఎదగాలని మగ పిల్లలకు ఉన్న చీడ పీడలు తొలగి సద్బుద్ధితో సమర్థుడయి జీవించాలని ధూండ్ అనే కార్యక్రమంలో పాట పాడుతారు. పహిలో బేటా వేన్ నాయకి కర్నో అనే పాటకు అర్ధం అప్పట్లో రాజుల కాలంలో యుద్దాలు ఉండేవి కనుక యుద్ధంలో మగ వాళ్ళు పాల్గొనే వారు కావున దేశ రక్షణకై ధైర్య సాహసాలు పెంపోందించుకునేలా గొప్ప నాయకుడిగా, నిర్ణయాధికారిగా, అభివృద్ధి పరుడిగా, యుద్ధవీరుడిగా, న్యాయాధికారిగా, దయార్ధ హృదయుడిగా, దేశరక్షకుడిగా ఎదగాలని ఆశీర్వదిస్తారు.

కాముని దహనం..

హోళి కార్యక్రమంలో మరో ముఖ్య ఘట్టం కాముని దహనం. నంగరి వాసులంతా ఏకమై చెడు ఆలోచనలు దహించబడుతాయని విశ్వసించి కామ దహన కార్యక్రమంలో పాల్గొని భస్మాన్ని బొట్టుగా స్వీకరించి, విందు, వినోదాలతో వేడుక చేసుకుంటారు. హోలీ కార్యక్రమంలో భాగంగా బంజారా ప్రజలంతా ఏకమై వారి మధ్య ఉన్న కోపతాపాలను దూరం చేసుకునే వేడుకగా భావించి రంగులు చల్లుకుంటూ ప్రేమానురాగాలను పంచుకుంటారు.. చిన్న పెద్ద అనే తరతమ్యం లేకుండా స్నేహితులు, బంధువులు ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు.

- స్రవంతి నెనావత్

ఇంగ్లిష్ లెక్చరర్

70936 44541

Next Story