ఆకాశహర్మ్యాల వెలుగు.. పర్యావరణానికి ముప్పు!

by Ravi |   (  Updated:2026-04-29 01:00:51  IST  )

నగరీకరణ వేగం పెరుగుతున్న నేపథ్యంలో కాంక్రీట్ భవనాలు, అపార్ట్‌మెంట్ సంస్కృతి పర్యావరణంపై ఎలా ప్రభావం చూపుతున్నాయి? గ్లోబల్ వార్మింగ్, హీట్ ఐలాండ్ ప్రభావం, నీటి కొరత వంటి సమస్యల మధ్య స్థిరమైన నగరాల అవసరంపై విశ్లేషణ.

ఆకాశహర్మ్యాల వెలుగు.. పర్యావరణానికి ముప్పు!
X

ప్రపంచ జనాభా పెరుగుతోంది. జీవన శైలి మారుతోంది. గ్రామం నుంచి పట్టణానికి, పట్టణం నుంచి మహానగరానికి, అక్కడి నుంచి విదేశీ నగరాలకు వలసలు విస్తరిస్తున్నాయి. ఉపాధి, విద్య, వైద్యం, వ్యాపారం, సౌకర్యాలు ఇవన్నీ నగరాల చుట్టూ కేంద్రీకృతం కావడంతో ‘నగరీకరణ’ అనివార్యంగా మారింది. ఫలితంగా ఆకాశాన్ని తాకే అపార్ట్‌మెంట్ టవర్లు అభివృద్ధి చిహ్నాలుగా నిలుస్తున్నాయి. ఈ కాంక్రీట్ నాగరికత పర్యావరణానికి ముప్పు కానుందా?

ఐక్యరాజ్యసమితి తాజా గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ప్రపంచ జనాభాలో సుమారు 45 శాతం మంది నగరాల్లో నివసిస్తున్నారు.. 2050 నాటికి ఈ సంఖ్య మరింత పెరిగి ప్రపంచ జనాభా పెరుగుదలలో రెండు మూడొంతులు నగరాలకే చేరనున్నాయని అంచనా. అంటే రాబోయే దశాబ్దాల్లో మరింత గృహనిర్మాణం, మరింత రోడ్లు, మరింత వాణిజ్య సముదాయాలు, మరింత మౌలిక వసతులు అవసరం అవుతాయి.

ఒక్క భవనం నిర్మించాలంటే..?

నగరాల పెరుగుదల కేవలం నివాసాల విస్తరణ కాదు. అది ప్రకృతిపై ఒత్తిడి. భవన నిర్మాణ రంగం ప్రస్తుతం ప్రపంచ శక్తి వినియోగంలో 32 శాతం భాగం తీసుకుంటోంది. ప్రపంచ కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల్లో 34 శాతం ఈ రంగం నుంచే వస్తున్నాయి. ఒక్క అపార్ట్‌మెంట్ టవర్ నిర్మించడానికి వేల టన్నుల సిమెంట్, ఉక్కు, ఇసుక, నీరు, విద్యుత్ అవసరం. అంటే మనం చూస్తున్నది కేవలం భవనం కాదు.. ప్రకృతి సంపదల వినియోగ చరిత్ర. అడవులు నరికివేత, ఇసుక తవ్వకం, భూగర్భ జలాల తగ్గుదల, మట్టిసారపు నష్టం ఇవన్నీ దాని వెనుక ఉంటాయి. ఇక అపార్ట్‌మెంట్ సంస్కృతి మరో ప్రమాదాన్ని తీసుకొస్తోంది.. హీట్ ఐలాండ్ ప్రభావం. కాంక్రీట్, గాజు, థార్‌ రోడ్లు వేడిని గ్రహించి నగరాలను చుట్టుపక్కల ప్రాంతాల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో ఉంచుతున్నాయి. చెట్లు తగ్గి పోవడం, ఖాళీ ప్రదేశాలు కనుమరుగవడం వల్ల వేసవిలో భరించరాని ఎండ తగులుతోంది. ఎయిర్ కండిషనర్లు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం మరింత ఇంధనం కాలుతోంది. ఇది తిరిగి గ్లోబల్ వార్మింగ్‌ను వేగవంతం చేస్తుంది.

ఎత్తైన భవనాలు మంచివే అయితే..

ఇక నగరాల్లో వర్షపు నీరు నేలలోకి దిగే అవకాశాలు కూడా తగ్గుతున్నాయి. ఎక్కడ చూసినా కాంక్రీట్ కప్పేస్తే వర్షం పడినప్పుడు నీరు నేలలోకి ఇంకవు.. ఫలితం ఒక వైపు వరదలు, మరో వైపు భూగర్భ జలాల కొరత. ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు. ఇక యుద్ధాల ప్రభావం మరింత ఘోరం. ఒక నగరం మీద బాంబులు పడితే కేవలం భవనాలు కూలవు.. సంవత్సరాలుగా ఉపయోగించిన సిమెంట్, ఉక్కు, శక్తి, మానవ శ్రమ.. అంతా వృధా అవుతుంది. యుద్ధాల తర్వాత మళ్లీ పునర్ని‌ర్మాణం కోసం మరిన్ని వనరులు వినియోగించాల్సి వస్తుంది. అంటే యుద్ధం ద్విగుణీకృత నష్టం. మొదట విధ్వంసం, తరువాత పర్యావరణ ఖర్చుతో పునర్నిర్మాణం. అయితే ఎత్తైన భవనాలన్నీ చెడు అనడం సరైంది కాదు. అధిక సాంద్రత గృహాలు విస్తారమైన పట్టణ విస్తరణ కంటే మంచివే. దీని వల్ల రోడ్ల విస్తరణ అవసరం తగ్గుతుంది, సేవల పంపిణీ సులభమవుతుంది.

ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి!

సమస్య ఏమిటంటే... మన నగరాల్లో చాలా నిర్మాణాలు ‘లాభం ముందు, పర్యావరణం తర్వాత’ అన్న ధోరణిలో జరుగుతున్నాయి. అందుకే ప్రభుత్వాలు తక్షణం చర్యలు చేపట్టాలి. ఇందుకోసం గ్రీన్ బిల్డింగ్ కోడ్‌లు తప్పనిసరి చేయాలి. వర్షపు నీటి సంరక్షణ, సౌరశక్తి, సహజ గాలి ప్రవాహం, శక్తి పొదుపు డిజైన్లు ఉండాలి. ప్రతి కొత్త ప్రాజెక్టుపై పర్యావరణ ప్రభావ అంచనా ఉండాలి. నగరాల్లో కనీస పర్యావరణ ప్రాంతాలపై నిబంధనలు కఠినంగా అమలు చేయాలి. పాత భవనాల పునర్వినియోగం, రీనోవేషన్‌కు ప్రోత్సాహ‌కాలు ఇవ్వాలి. కూల్చి మళ్లీ కట్టడం మాత్రమే అభివృద్ధి కాదు.. అలాగే ప్రజా రవాణా కేంద్రంగా నగర ప్రణాళిక చేయాలి. (ఈ.ఎస్.జీ) నివేదికలు కాగితాలకే పరిమితం కాకూడదు. ప్రతి నిర్మాణ కంపెనీ తన కార్బన్ ఫుట్‌ప్రింట్ ప్రకటించాలి. సిమెంట్‌కు ప్రత్యామ్నాయ పదార్థాలు, రీసైకిల్ స్టీల్, ప్రీఫ్యాబ్ టెక్నాలజీలు వినియోగించాలి. చివరగా, ఆకాశ హర్మ్యాలు అభివృద్ధి ప్రతీకలు కావచ్చు. కానీ అవి భూమి ఊపిరిని ఆపేస్తే ఆ అభివృద్ధి శ్మశాన నిశ్శబ్దమే. కాంక్రీట్ అడవులు కాదు, సజీవ నగరాలు నిర్మించడం నిజమైన నాగరికత. భవిష్యత్తు ప్రశ్నిస్తోంది.. మనకు ఎతైన భవనాలే కావాలా? లేక నివసించదగిన భూమా?

-డాక్టర్. కోలాహలం రామ్ కిశోర్

98493 28496

Next Story