- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేసవి.. అపోహలకు దూరంగా ఉందాం!
వేసవి వేడి తీవ్రతపై సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న అపోహలు ప్రజల్లో భయాందోళనలు పెంచుతున్నాయి. శాస్త్రీయ సమాచారం, సరైన జాగ్రత్తలతో హీట్‌వేవ్‌ను ఎలా సురక్షితంగా ఎదుర్కోవాలో ఈ వ్యాసంలో తెలుసుకోండి.

నేడు భూగోళం వేడెక్కుతోంది. వాతావరణ మార్పుల ప్రభావం మన ముంగిట నిప్పుల కొలిమిలా మారింది. గడిచిన కొన్నేళ్లుగా మార్చి నెల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటం ఆందోళనకరం. విచ్చలవిడిగా చెట్ల నరికివేత, కాంక్రీట్ భవనాల నిర్మాణం, పెరుగుతున్న వాహన కాలుష్యం వెరసి నగరాలు 'హీట్ ఐలాండ్స్'గా మారుతున్నాయి..
ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచడానికి సోషల్ మీడియా వేదికగా వస్తున్న సమాచారం ఒకవైపు ఉపయోగపడుతున్నప్పటికీ, మరోవైపు శాస్త్రీయత లేని 'అత్యవసర హెచ్చరికలు' అనవసర భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఈ వేసవిని సురక్షితంగా ఎదుర్కోవాలంటే మనకు కావాల్సింది భయం కాదు, బాధ్యతాయుతమైన అప్రమత్తత.
శాస్రీయత లేని వాదనలు..
ప్రస్తుతం వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి వేదికల్లో కొన్ని సందేశాలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.. వీటిని లోతుగా విశ్లేషిస్తే అందులో వాస్తవాల కంటే అతిశయోక్తులే ఎక్కువగా కనిపిస్తాయి.. ఉదాహరణకు, ఉష్ణోగ్రతలు 50°C నుండి 55°C వరకు పెరుగుతాయనే ప్రచారం అన్ని ప్రాంతాలకు వర్తించదు. రాజస్థాన్ వంటి ఎడారి ప్రాంతాల్లో లేదా కొన్ని నిర్దిష్ట పారిశ్రామిక ప్రాంతాల్లో ఇవి నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ, సాధారణ జనావాసాల్లో ఇంతటి తీవ్రత అరుదు. అందుకే ప్రచారాలను నమ్మొద్దు. భారత వాతావరణ శాఖ బులిటెన్‌లను మాత్రమే మనం ప్రామాణికంగా తీసు కోవాలి. అలాగే ఎండ తీవ్రతకు ఫోన్లు పేలడం లేదా వాహనాల ట్యాంకులు పేలడం వంటివి సామాన్యంగా జరగవు.. తక్కువ నాణ్యత గల బ్యాటరీల వల్ల లేదా సాంకేతిక లోపాల వల్ల ప్రమాదాలు జరగవచ్చు కానీ, కేవలం వాతావరణ వేడి వల్లే ఇవి సంభవిస్తాయనడం అపోహ మాత్రమే.. అదే విధంగా అల్ట్రావయొలెట్ (UV) కిరణాల శాతం గురించి వచ్చే అంకెలలో కూడా శాస్త్రీయత లోపించింది. ఓజోన్ పొర మనల్ని రక్షిస్తూనే ఉంది, అయితే సుదీర్ఘకాలం ఎండలో ఉండటం వల్ల చర్మ సమస్యలు రావచ్చుననేది వాస్తవం.
వ్యక్తిగత రక్షణ కోసం..
ఇక వేసవి తీవ్రత నుంచి తప్పించుకోవడానికి కేవలం నీళ్లు తాగడం మాత్రమే సరిపోదు, ఒక క్రమ శిక్షణతో కూడిన జీవనశైలి అవసరం. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండాలంటే దాహం వేసే వరకు ఆగకుండా గంటకోసారి నీరు తాగాలి. ఓఆర్ఎస్ (ORS), మజ్జిగ, కొబ్బరినీళ్లు, గ్లూకోజ్ నీరు వంటివి సేవించాలి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడతాయి. వేసవిలో జీర్ణక్రియ మందగిస్తుంది కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉండే మాంసాహారం, మసాలాలు, వేపుళ్లు తగ్గించడం ఉత్తమం. కాఫీ, టీ, ఆల్కహాల్ శరీరంలోని నీటిని త్వరగా బయటకు పంపి డీహైడ్రేషన్ ముప్పును పెంచుతాయి. వీటికి బదులుగా మట్టి కుండలో నీరు, పుచ్చకాయ, దోసకాయ వంటి ప్రకృతి సిద్ధమైన పండ్లను ఆశ్ర యించాలి. వ్యక్తిగత రక్షణ కోసం ప్రయాణ సమయాల్లో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు.. ఈ సమయంలో బయటకు రాకపోవడమే శ్రేయస్కరం.
ఈ వైరస్ ప్రమాదకరం!
బయటకు వెళ్లాల్సి వస్తే లేత రంగులో ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఇవి గాలిని లోపలికి పంపి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.. తల కప్పుకోవడానికి గొడుగు లేదా టోపీ, కళ్ల రక్షణకు నాణ్యమైన సన్ గ్లాసెస్ వాడటం మంచిది. ఒకవేళ వడదెబ్బ తగిలిన లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రథమ చికిత్స చేయించుకోవాలి. మనం చల్లగా ఉండటానికి ప్రయత్ని స్తున్నట్టే మనమీద ఆధారపడి ఉండే మూగ జీవాల పట్ల కూడా కారుణ్యం చూపాలి. పక్షులు, జంతువుల కోసం ఇంటి మేడ మీద లేదా బయట చిన్న పాత్రల్లో నీటిని ఉంచాలి.. అటవీ ప్రాంతాల్లో నీరు దొరకక కొన్ని జంతువులు జన ఆవాసాల్లోకి వచ్చే అవకాశం ఉంది. అటువంటి సమయంలో భయాం దోళన చెందకుండా అటవీ శాఖకు సమాచారం అందించాలి. ఇక సమాచార విస్ఫోటనం జరుగుతున్న ఈ రోజుల్లో నిజా నిజాలను నిర్ధారించుకోవడం ఒక సామాజిక బాధ్యత. ప్రభుత్వం, వాతావరణ శాఖ ఇచ్చే అధికారిక సూచనలను మాత్రమే అనుసరించాలి. భయపెట్టే సందేశాలను ఫార్వార్డ్ చేయడం కంటే, శాస్త్రీయమైన జాగ్రత్తలను పంచుకోవడం ద్వారా సమాజాన్ని రక్షించవచ్చు. ప్రకృతి వైపరీత్యం కంటే మానవ నిర్మితమైన 'అపోహల వైరస్' ఎప్పుడూ ప్రమాదకరమైనదే. మెరుగైన అవగాహనతో, అప్రమత్తమైన జీవనశైలితో ఈ వేసవిని సురక్షితంగా ఎదుర్కుందాం.
- యండి. ఉస్మాన్ ఖాన్
99125 80645






