సందేశాత్మకమైన కళాఖండాలు..

by Ravi |   (  Updated:2026-06-05 01:01:08  IST  )

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో ఎంఎఫ్‌ఏ చివరి సంవత్సరం విద్యార్థులు ప్రదర్శించిన కళాఖండాలు సామాజిక వాస్తవాలు, పర్యావరణ సంక్షోభం, కుల వివక్ష, వలస కార్మికుల వేదన, లింగ అసమానత వంటి అంశాలను సృజనాత్మకంగా ఆవిష్కరించి ప్రేక్షకుల్లో ఆలోచనలను రేకెత్తించాయి.

సందేశాత్మకమైన కళాఖండాలు..
X

కళ అనేది మనిషి అంతరంగానికి అద్దం పట్టే ఒక జీవంతమైన అనుభవం. అది సమాజపు నిశ్శబ్దాలను వినిపిస్తుంది, కనిపించని వేదనలను రూపాల్లోకి మార్చుతుంది, కనిపించే వాస్తవాల వెనుక దాగిన సత్యాలను వెలికి తీయడానికి ప్రయత్నిస్తుంది. అందుకే కళను కేవలం సౌందర్యపు పరిమితుల్లో చూడడం సరిపోదు. అది ఒక ఆలోచన, ఒక ప్రతిఘటన, ఒక మానవీయ అన్వేషణ.

జేఎన్‌యూ, హెచ్‌సీయూ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా విశాలమైన ఆలోచనా దృక్పథాన్ని పెంపొందించుకుంటారు. అక్కడి వాతావరణం వారి విశ్లేషణా శక్తిని పెంచి సమాజాన్ని లోతుగా అర్థం చేసుకునే దిశగా నడిపిస్తుంది. భిన్న రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ అనుభవాలను కలిపి కళా రూపాల్లో వ్యక్తపరచుతూ, సామాజిక అంశాలపై చైతన్యాన్ని రేకెత్తిస్తారు. ఈ నేపథ్యంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో ఎంఎఫ్‌ఏ చివరి సంవత్సరం విద్యార్థులు ప్రదర్శించిన కళాఖండాలు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించాయి. ప్రతి కళాఖండం ఒక ప్రశ్నగా, ఒక వ్యాఖ్యగా, ఒక నిశ్శబ్ద నిరసనగా నిలిచి, కళకు సామాజిక బాధ్యత కూడా ఉంటుందనే భావనను మరోసారి బలపరిచింది.

తిని పారేసిన పేపర్లతో బొమ్మలు..

ఇషా తన కళాఖండాల ద్వారా సింథటిక్ జీవితం ఎంత నాజూకుగా, తాత్కాలికంగా ఉంటుందో చూపిస్తుంది. వాడేసిన పేపర్లతో బొమ్మలు చేసి అవి సులభంగా చెడిపోవడం ద్వారా మన జీవన శైలి కూడా బుడగలాంటిదేనని హెచ్చరిస్తుంది. అలాగే సీసాలో కాగితపు పూలు, చేతి –తుపాకి నమూనాలు, పెన్సిల్ డ్రాయింగ్‌ల సమ్మేళనంతో ఆమె సృజనాత్మకతను ప్రదర్శిస్తుంది. బయట గాలిలో ఊగే నెమళ్ల నమూనాలు, కొన్నింటిలో గాలి తీసివేయడం ద్వారా జీవితం తాత్కాలికమనే భావాన్ని బలంగా వ్యక్తపరుస్తుంది. అలాగే యాజింగ్ షిమ్ రే, తన కళలో నాగా జీవితాన్ని సన్నని బాల్ పాయింట్ గీతలు, నలుపు–రంగురంగుల మేళవింపుతో జీవంగా చిత్రిస్తాడు. లినోకట్ రూపంలో కూడా అదే జీవన దృశ్యాలను చూపిస్తూ, చిత్తప్రసాద్ 1950లలో చూపిన జీవన వాస్తవాలను గుర్తు చేస్తాడు. ప్రకృతి, సంప్రదాయం, జ్ఞాపకాల కలయికగా అతని చిత్రాలు రోజువారీ జీవితంలోని ఆటుపోట్లు ప్రతిబింబిస్తాయి. మరోవైపు, కళను పక్కనపెట్టి మొబైల్ ఫోన్, యాప్స్‌లో చిక్కుకుపోయిన మనిషి బక్కచిక్కిపోతున్న దృశ్యాన్ని చూపిస్తూ ఆధునిక జీవితంపై విమర్శ చేస్తాడు.

ఆకాశ హర్మ్యాలలో వెక్కిరిస్తున్న ప్లాస్టిక్ మొక్కలు..

తుఫేల్ అనే కేరళ కళాకారుడు ప్రకృతి, జీవరాశులు, సామాజిక జీవనంలో ఉన్న అంతస్సూత్రాన్ని జీవశాస్త్రం, గణితం కలిపి అన్వేషిస్తూ, చీమల క్రమబద్ధతను ఉన్నత ప్రింట్ టెక్నిక్‌లో చూపిస్తాడు. మరొక కళాకారిణి చెట్ల జీవచైతన్యాన్ని చిత్రిస్తూ, ఆధునికీకరణ పేరుతో చెట్లను కోల్పోయి ప్లాస్టిక్ మొక్కలతో సంతృప్తి చెందుతున్న మనిషిని విమర్శిస్తుంది. ఢిల్లీకి చెందిన సృష్టి శర్మ, బొగ్గుతో వేసిన చిత్రాల్లో విడివిడిగా కనిపించే అంశాల మధ్య ఉన్న సారూప్యతను చూపిస్తూ, సమగ్ర దృష్టిని ఆవిష్కరిస్తుంది. అస్సాంకి చెందిన కిరణ్‌జ్యోతి తన రాష్ట్రంలోని ప్రకృతి వైపరీ‌త్యాలను కళలో ప్రతిబింబిస్తాడు. వరదల అనంతరం మిగిలే అవశేషాలు, వాటి వెనుక దాగిన వేదనను చూపించడమే తన ఉద్దేశమని అతను వివరిస్తాడు. కేరళకి చెందిన జయలక్ష్మిరాజ్ తన కృతుల్లో శరీరం, లింగ వివక్ష, లైంగికత వంటి అంశాలను ప్రశ్నిస్తూ, “నార్మల్” అనే సామాజిక చట్రంలో బిగించబడిన జీవితాలు ఎలా ఛిన్నా భిన్నమవుతాయో చూపిస్తుంది.

సామాజిక వెలివేతను చిత్రిస్తూ..

తెలంగాణకి చెందిన వినాయక్ సుంకేకర్, తన కళలో “సిరాతో రాసిన అబద్ధాలు రక్తంతో రాసిన వాస్తవాలను కప్పిపుచ్చలేవు” అనే లూసన్ మాటను ప్రతిఫలిస్తాడు. అలాగే చేకోవ్ చెప్పినట్లుగా కళని ప్రదర్శించాలంటే జీవితాన్ని అధ్యయనం చేయాలి’ అని, ‘కళాకారుడు ప్రశ్నించాలే తప్ప జవాబులివ్వకూడదు’ భావాన్ని తన కృతుల్లో నిలబెడతాడు. తాత చెప్పులు కుట్టే వృత్తిని ప్రతీకాత్మకంగా చూపిస్తూ, తోలు పట్టీలలో జ్ఞాపకాలను బంధిస్తాడు. దీని ద్వారా దాగి ఉన్న హింస, అమానవీయత, సామాజిక వెలివేతను అతను బలంగా బయటపెడతాడు. కేరళకి చెందిన అనుపమ సుకుమార్ పారిశ్రామికీకరణ వల్ల కనుమరుగవుతున్న వెదురు అల్లిక కళను, ఆ వృత్తిలో ఉన్న కళాకారుల జీవితాలను తన కృతుల్లో ప్రతిబింబిస్తుంది. వెదురు గుజ్జుతో జ్ఞాపకాలు, ప్రతిఘటన, ఓర్పు, సామూహిక అనుభవాలను కలిపి ఒక జీవన కథను ఆవిష్కరిస్తుంది. ఇక బంగ్లాదేశ్‌కి చెందిన సదియా షర్మిన్, కరోనా కాలంలో వలస కార్మికుల వేదనను మళ్లీ గుర్తు చేస్తూ, ముక్కలైన జ్ఞాపకాలతో, మాసిపోతున్న చిత్రాలతో తన బాధను వ్యక్తపరుస్తుంది. నల్ల చెక్కపై బందీగా నిలిచిన వలస కార్మికుడి ప్రతిరూపం ఆమె కళలో అత్యంత భావోద్వేగంగా నిలుస్తుంది.

అప్రకటిత అత్యవసర పరిస్థితిపై కళారూపం..

కేరళకి చెందిన ఆనందు రాజన్ తన కళలో పేదరికం, కులం, మతం, వర్ణం, వర్గ వివక్షలను ప్రశ్నిస్తాడు. రోజువారీ వస్తువుల ద్వారా అట్టడుగు వర్గాల చరిత్రను, వారి వేదనను ప్రతీకాత్మకంగా చూపిస్తాడు. తెగిన చేయి, ఇనుప కంచె, కత్తి వంటి గుర్తుల ద్వారా అసమానతల తీవ్రతను వ్యక్తపరుస్తాడు. నేటి అప్రకటిత అత్యవసర పరి స్థితిని సూచిస్తూ రూపొందించిన నాలుగు నాలుకల ప్రతీకలు ప్రత్యేకంగా నిలుస్తాయి.

ప్రశ్నలని రేకెత్తించిన అపురూప కళాఖండాలు..

ఇవి కాక రాళ్లు, చెట్ల పీచు, స్త్రీల రోజువారీ వస్తువులు, పురావస్తు అవశేషాలు, పాత రేకులు వంటి సాధారణ పదార్థా‌లపై చెక్కిన చిత్రాల ద్వారా ఈ కళాకారులు జీవన చరిత్రను పరిశోధనాత్మకంగా ఆవిష్కరించారు. మండు వేసవి‌లోనూ చల్లని అనుభూతిని కలిగించిన ఆ ప్రదర్శన ఎన్నో ప్రశ్నలను రేకెత్తించింది. “కళ ప్రజల జీవన వాస్తవాలను ప్రతిబింబించాలి, కళ కళకోసమే కాదు” అనే మాక్సిం గోర్కి భావం అక్కడ బలంగా ప్రతిధ్వనించింది. ‘వ్యక్తిగత, వైయుక్తిక అనుభవాలని, అనుభూతులని మేళవించి, సార్వత్రిక సత్యాన్ని వెలికితీసి, ఆ భావాలని వ్యక్తపరుస్తూ, అందరి స్థాయిని పెంచుతూ, సమాజాన్ని ఉద్ధరించే లక్ష్యాన్ని భుజాన వేసుకున్న’ ఈ కళాకారులందరూ అభినందనీయులు!

-డాక్టర్ టి.నళిని

94414 26452

Next Story