- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంతోషమే సంపూర్ణ బలం!
సంతోషం మనిషి మానసిక, శారీరక ఆరోగ్యానికి మూలం. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో సంతోషం ప్రాముఖ్యత, ప్రపంచ సంతోష సూచిక, డిజిటల్ వ్యసనం ప్రభావాలు వంటి అంశాలపై ఈ వ్యాసం వివరిస్తుంది.

సంతోషమే సగం బలం అని పెద్దలు చెప్పినా, నిజానికి అది సంపూర్ణ బలం. మనిషి సంతోషానికి సూచిక చిరునవ్వు. ఆధునిక యుగంలో ఈ సంతోషం మనిషి నుండి రోజురోజుకు దూరమవుతోంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన పెరిగి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. సంతోషం ప్రాముఖ్యతను ముందుగా గుర్తించిన దేశం భూటాన్. అక్కడ జాతీయ ఆదాయం కంటే ‘జాతీయ సంతోషం’కు అధిక ప్రాధాన్యత ఇస్తారు. దీనిని ఆదర్శంగా తీసుకుని ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం మార్చి 20న అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడు ‘ప్రతీ ఒక్కరికీ సంతోషం – కలిసికట్టుగా అభివృద్ధి చెందుదాం’ అనే నినాదంతో జరుపుకుంటున్నారు. ప్రస్తుతం సమాజంలో అసంతృప్తి, ఈర్ష్య, ద్వేషం పెరిగి మనిషి మానసిక ప్రశాంతత కోల్పోతున్నాడు. కానీ సంతోషమే మానసిక, శారీరక ఆరోగ్యానికి మూలం. ప్రపంచ సంతోష సూచికలో ఆదాయం, ఆరోగ్యం, సామాజిక మద్దతు, స్వేచ్ఛ వంటి అంశాలను పరిగణనలో కి తీసుకుంటారు. ఈ సూచికలో ఫిన్లాండ్ వరుసగా అగ్రస్థానంలో నిలుస్తుండగా, భారత్ ఇంకా వెనుకబడి ఉంది. డిజిటల్ వ్యసనం, సోషల్ మీడియా వల్ల కలిగే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ కేసులు పెరుగుతున్నాయని భారత ఆర్ధిక సర్వే 2025- 26 స్పష్టం చేసింది. ఈ క్రమంలో టెలి-మానస్ వంటి డిజిటల్ ప్లాట్ ఫామ్‌ను విస్తరించి డిజిటల్ వ్యసనాన్నీ, మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలని సూచించింది. సంతోషం మనిషికి నిజమైన ఆస్తి. ఇది సానుకూల దృక్పథాన్ని పెంచి సమస్యలను సులభంగా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. కాబట్టి కుటుంబం, సమాజంతో ఆనందంగా గడపడం, ఉన్నదాంట్లో సంతోషపడడం అలవాటు చేసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో సంతోషం కొరకు ‘లాఫింగ్ క్లబ్’లను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లు పెంపొందించాలి. చివరగా, ‘సంతోషంగా ఉంటే పోయేది బాధ మాత్రమే’ అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
(నేడు అంతర్జాతీయ సంతోష దినోత్సవం)
-సంపతి రమేష్
79895 79428






