- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సేవలు అపారం.. వేతనం స్వల్పం!
గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, వారి సేవలను గుర్తించి వేతనాల పెంపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ, సంక్షేమ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఈ వ్యాసం ప్రస్తావిస్తుంది.

మన దేశ అభివృద్ధికి పునాది విద్య. ఆ విద్యను అందించి, సమాజానికి మంచి పౌరులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడు. ప్రతి విద్యార్థి విజయానికి వెనుక నిలిచే నిస్వార్థ సేవకుడు ఉపాధ్యాయుడే. అయితే నేడు అదే ఉపాధ్యాయుడు ఆర్థిక ఇబ్బందులు, గుర్తింపు లేకపోవడం, భవిష్యత్తుపై అనిశ్చితి వంటి సమస్యలతో జీవనం సాగిస్తున్నాడు. ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు సుదూర పర్వత ప్రాంతాలు, అడవి గ్రామాల్లోని గిరిజన విద్యార్థులకు విద్యా వెలుగులు పంచుతున్నారు. పాఠాలు బోధించడమే కాకుండా లోకో పేరెంట్‌గా వ్యవహరించడం, హాస్టల్ పర్యవేక్షణ, విద్యార్థుల సమస్యల పరిష్కారం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వంటి అనేక బాధ్యతలు నిర్వర్తి స్తున్నారు. అయితే వారికి తగిన వేతనం, గౌరవం, ఉద్యోగ భద్రత లభించడం లేదు. నెలకు కేవలం ₹14,200 నుంచి ₹23,200 వరకు మాత్రమే వేతనం అందుతుండటంతో కుటుంబ పోషణ కష్టసాధ్యంగా మారింది. పెరుగుతున్న ధరలు, పిల్లల విద్యా ఖర్చులు, ఇతర అవసరాలను ఈ స్వల్ప వేతనంతో నిర్వహించడం భారంగా మారుతోంది. మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన సెలవులు కల్పించాలని పలుమార్లు విన్నవించినప్పటికీ స్పందన లేకపోవడం బాధాకరం. కొన్ని చోట్ల పార్ట్‌టైమ్ సిబ్బందిని గౌరవప్రదంగా చూడకపోవడం మరింత ఆవేదన కలిగిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇది తగిన వ్యవహారం కాదు. అందువల్ల ప్రభుత్వం వెంటనే గిరిజన గురుకుల పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల సమస్యలను పరిశీలించి వేతనాలు పెంచాలి, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి, మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన 120 రోజుల సెలవులు అమలు చేయాలి. గిరిజన విద్యార్థుల అభ్యున్నతి కోసం సేవలందిస్తున్న ఈ ఉపాధ్యాయులకు తగిన గౌరవం, సముచిత వేతనం, ఉద్యోగ భద్రత కల్పించడం ప్రభుత్వ సామాజిక బాధ్యత. వారి త్యాగాన్ని గుర్తించి న్యాయం చేయడం ద్వారానే గిరిజన విద్యాభివృద్ధి మరింత బలోపేతం అవుతుంది.
-విజయ్ కుమార్ ఆత్మకూరి
గురుకుల పార్ట్‌టైమ్ టీచర్స్ అసోసియేషన్
94413 50460






