- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాహిత్యంతో సాంఘిక సంస్కరణ చేసిన మహాకవి
తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి గురజాడ అప్పారావు. ఆయన తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం

తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి గురజాడ అప్పారావు. ఆయన తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు.హేతువాది. ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేసిన కవి. 19వ శతాబ్దంలోను, 20వ శతాబ్ది మొదటి దశకంలోనూ ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి.విజయనగరంలో బి.ఏ చదువుతున్నపుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి అతనికి సహాధ్యాయి. వారిద్దరూ ప్రాణస్నేహితులు.
మాతృభాషలో రచనలకు ప్రేరణ
అప్పటి కళింగ రాజ్యంగా పేరుపొందిన విజయనగరంలోనే అప్పారావు నివసించాడు. విజయనగర సంస్థాన పూసపాటి గజపతి రాజులతో అతనుకు మంచి సంబంధాలు ఉండేవి. 1887లో విజయనగరం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో అతను మొదట ప్రసంగించాడు. 1889లో ఆనంద గజపతి డిబేటింగ్ క్లబ్బుకు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇదే సమయంలో తమ్ముడు శ్యామల రావుతో కలిసి ఆంగ్లంలో పద్యాలు రాసాడు. వీరు రాసిన ఆంగ్ల పద్యం సారంగధర, ఇండియన్ లీషర్ అవర్‌లో చదివినప్పుడు అందరూ మెచ్చుకున్నారు. అప్పుడే కలకత్తాలో ఉన్న రీస్ అండ్ రోయిట్ ప్రచురణకర్త శంభు చంద్ర ముఖర్జీ విని, అప్పారావును తెలుగులో రచన చేయడానికి ప్రోత్సహించాడు. ఆంగ్లంలో ఎంత గొప్పగా రాసినా అది పరభాషేనని, తన మాతృభాషలో వారు ఇంకా గొప్పగా రాయగలరని అతడన్నాడు. ఇండియన్ లీషర్ అవర్ ఎడిటరు గుండుకుర్తి వెంకట రమణయ్య కూడా అతనిని ఇదే తోవలో ప్రోత్సహించాడు. 1891లో విజయనగర సంస్థానంలో సంస్థాన శాసన పరిశోధకునిగా గురజాడ నియామకం పొందాడు.
సాహితీ రచన..
గిడుగు రామమూర్తితో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించాడు. ఆ రోజుల్లో ప్రబలంగా ఉన్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. 1892లో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. ఇప్పుడు మనకు దొరుకుతున్న కన్యాశుల్కం రెండవ కూర్పును 1909లో రచించాడు. 1892లో గురజాడ వారి కన్యాశుల్కం నాటకాన్ని తొలిసారిగా ప్రదర్శించారు. మొదటి ప్రదర్శనకే ఎంతో పేరు వచ్చింది. దీనితో సాహిత్యంలో వాడుక భాష ప్రయోగానికి ఒక రకంగా నాంది పలికింది అని చెప్పవచ్చు. సాంఘిక ప్రయోజనంతో పాటు రసజ్ఞుల ఆనందానికి కూడా వాడుక భాష వాడవచ్చని ఈ నాటకం నిరూపించింది. 1897లో కన్యాశుల్కాన్ని వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు వారు ప్రచురించారు. అప్పారావు దీన్ని మహారాజా ఆనంద గజపతికి అంకితం ఇచ్చాడు. 1909 ఆరోగ్యం కుదుట పడడానికి నీలగిరి కొండల్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కన్యాశుల్కం తిరగరాసాడు. 1910లో రాసిన 'దేశమును ప్రేమించుమన్నా' అనే దేశభక్తి గీతం ఎంతో ప్రసిద్ధి పొందింది.పుత్తడి బొమ్మా పూర్ణమ్మా అనే సుప్రసిద్ధ గేయం అతను రచనల్లో మరొకటి. దీని ఇతివృత్తం కూడా కన్యాశుల్కము దురాచారమే. కరుణ రసాత్మకమైన ఈ గేయ కావ్యంలోని చివరి పద్యం ఇది.
వ్యవహారిక భాషోద్యమం..
20వ శతాబ్ది తొలినాళ్ళలో జరిగిన వ్యవహారిక భాషోద్యమంలో గురజాడ అప్పారావు తన సహాధ్యాయి గిడుగు రామమూర్తి పంతులుతో కలిసి పోరాటం సలిపారు. వారిద్దరూ కలిసి పత్రికల్లో, సభల్లో, మద్రాసు విశ్వవిద్యాలయంలో గ్రాంథిక భాషావాదులతో అలసట ఎరగకుండా తలపడ్డారు. గిడుగు వాదనా బలానికి, గురజాడ రచనాశక్తి వ్యావహారిక భాషోద్యమానికి వినియోగపడ్డాయి. 1913లో అప్పారావు పదవీ విరమణ చేసాడు. అప్పటినుండి అనారోగ్యంతో బాధపడ్డారు. ఇదే సమయంలో మద్రాస్ విశ్వవిద్యాలయం వారు ఫెలోతో గౌరవించారు. చివరికి, 53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30న గురజాడ అప్పారావు మరణించారు.
(నేడు గురజాడ అప్పారావు జయంతి)
-సుధాకర్.ఏ.వి
90006 74747






