శివాత్మికురాలు గుండం రామక్క

by Ravi |   (  Updated:2025-02-27 00:30:58  IST  )

దట్టమైన పాకాల అటవీ ప్రాంతం ఒకప్పుడు కాకతీయుల ఏలుబడిలో ఉండేది. క్రీ.శ. 1213లో ఓరుగల్లు సామ్రాజ్యాన్ని పరిపాలించిన

శివాత్మికురాలు గుండం రామక్క
X

దట్టమైన పాకాల అటవీ ప్రాంతం ఒకప్పుడు కాకతీయుల ఏలుబడిలో ఉండేది. క్రీ.శ. 1213లో ఓరుగల్లు సామ్రాజ్యాన్ని పరిపాలించిన కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని కాలంలో పాకాల సరస్సుకు ఆనుకొని దట్టమైన గుట్టల మధ్యలో గల గుండంపల్లి ప్రాంతంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం నిర్మించబడింది. ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా జాగరణ, పూజలు జరుగుతాయి. పాకాల ను సందర్శించిన వారు తప్పక చూడవలసిన ప్రదేశం ఇది.

గట్టి వంశీయుల దేవతామూర్తిగా

పాకాల కొత్తగూడెం మండలం గుండం తిమ్మాపురం గ్రామానికి చెందిన కోయ గిరిజన తెగలోని రామక్క గొప్ప శివ భక్తురాలు. రాముడికి శబరి (సవర) ఎలా భక్తురాలో ఈ ప్రాంతంలో రామక్క (కోయ) శివ భక్తురాలుగా కీర్తి కెక్కింది. ఈమె గట్టి (ఇంటి) వంశస్థుల ఆడబిడ్డ. రామక్క ప్రతి రోజు గుండం చెరువులో స్నానం చేసి శివునికి పూజలు చేసేది. ఆ చెరువులో ఒక వెండి గుడి ఉందని అందులో బంగారు ఆభరణాలు ఉండేవని ప్రతీతి. రామక్క వంశీయులు పేరంటాలకు పోతున్నపుడు రామక్క దగ్గరకు వెళ్లి నగలు కావాలని కోరితే, ఆమె చెరువు లోపలి నుంచి బయటకు వచ్చి వారికి కావాల్సినన్ని ఇచ్చేది. వారు తిరిగి వాటిని ఇచ్చే ముందు ఒక ఇత్తడి తాంబాలంలో పెట్టి నీటిలో వదిలేవారు. రామక్క శివైక్యం చెందిన తర్వాత ఆమె కోరిక ప్రకారం గుండం చెరువు పక్కన ఆచారానికి విరుద్ధంగా ఆమెను పాతి పెట్టారు. ఆ ప్రాంతాన్ని 'జడల రామక్క పోలు' గా పిలుస్తారు. అలా రామక్క గట్టి వారి వంశీయుల దేవతామూర్తిగా వెలిసింది. నేటికీ గుండంలో స్నానం చేయడానికి ఎద్దు చర్మం కట్టుకొని వెళ్లే అనవాయితీ కొనసాగుతోంది. గ్రామస్థులు యేటా మొక్కజొన్న విరిసే సమయంలో సొప్ప కర్రలను కట్టగా కట్టి, అందులో మంగళ హారతిని పెట్టి నీటిలో వదిలేస్తారు.

ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయాలి

నర్సంపేట నుండి 20 కి.మీ, కొత్తగూడెం నుంచి 14 కి.మీ దూరంలో గుండం శివాలయం ఉంటుంది. ఈ శివాలయం పక్కన వెంకటేశ్వర స్వామి గుడి, ఆంజనేయుని గుడి ఉండటం ఓ ప్రత్యేకత. రాజన్న భక్తులు గిరిజన శివారాధకురాలైన రామక్కకు ప్రత్యేకంగా పూజలు చేయడం ఇక్కడి విశేషం. పర్యాటక ప్రాంతంగా వెలుగొందాల్సిన గుండంలోని ఆ గుడికి ఆదరణ, భద్రత లోపించింది. దీంతో నిధులున్నాయని ఆశతో కొందరు దుండగులు 1985లో బాంబులు పెట్టి శివలింగాన్ని ధ్వంసం చేశారు. నేడు ఆ గుడి శిథిలావస్థకు చేరుకుంది. దేవాలయానికి సంబంధించిన భూమి ఐదు ఎకరాలు ఉన్నప్పటికి ఎవరూ పట్టించుకునే వారు లేక అన్యాక్రాంతమైంది. అయితే, సరైన రహదారి, రవాణా సౌకర్యం లేక ఈ దేవాలయం నిత్య పూజలకు నోచుకోలేక పోతోంది. ఒక్క శివరాత్రికి తప్ప గుండం శివాలయం ఉందన్న సంగతి బాహ్య ప్రపంచానికి తెలియకపోవడంతో అత్యంత నిరాదరణకు గురయింది. ఇటీవల మంత్రి సీతక్క తన నియోజకవర్గం కావడంతో ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వం తరపున రూ. 20 లక్షలు కేటాయించడం హర్షదాయకం. అలాగే గుండం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా గుర్తించి అభివృద్ధి చేస్తే బాగుంటుంది. శిధిలమైన పురాతన గుడిని ఈ ఏడాది కొంత ఆధునీకరించారు. అలాగే గుండం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా గుర్తించి అభివృద్ధి చేస్తే బాగుంటుంది.

(గుండం రామక్క జాతర సందర్భంగా)

గుమ్మడి లక్ష్మీనారాయణ,

94913 18409

Next Story