- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుణచిత్ర నటనకు ఒరవడి... గుమ్మడి
తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన గుణచిత్ర నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఆయన నటనా ప్రస్థానం, చిరస్మరణీయ పాత్రలు, వ్యక్తిత్వం..

అరవైలో ఇరవై ఏళ్ళ వేషం వేయడం కష్టమే. కానీ, ఇరవైల్లోనే అరవయ్యేళ్ళ వేషం వేసి మెప్పించడం మరీ కష్టం. కెరీర్ ఆరంభ దినాల నుంచే అలాంటి అరుదైన ఫీట్ చేసిన గుణచిత్ర నటుడంటే గుర్తొచ్చేది.. రంగస్థల, సినీ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. సినిమా జానర్ ఏదైనా, సౌమ్యమైన పాత్రల నుంచి సోఫిస్టికే టెడ్ విలన్ దాకా ఏది చేసినా తనదైన ముద్ర వేయగలిగారు కాబట్టే వెండితెరపై గుమ్మడి చిరకాలం వెలిగారు. ఈ శతజయంతి వేళ కూడా జనం గుండెల్లో చిరంజీవిగా మిగిలారు.
గుమ్మడిగా ఇంటి పేరుతోనే సుప్రసిద్ధులైన వెంకటేశ్వరరావు దాదాపు 500కు పైగా సినిమాల్లో నటించి తెలుగునాట ఇంటింటికీ సన్నిహితులయ్యారు. తొలి తెలుగు టాకీ తీసిన అప్పటి హెచ్.ఎం. రెడ్డి దగ్గర నుంచి ఇప్పటి ఎస్వీ కృష్ణారెడ్డి దాకా అందరితోనూ పనిచేసి, అనేక తరాలను ఆకట్టుకున్న అభినయ ప్రయాణం ఆయనది. తెరపై హీరో, హీరోయిన్లకు దీటుగా జనంలో గుర్తింపును దక్కించుకొన్న ఉపపాత్రధారుల జాబితా వేస్తే, గుమ్మడి పేరు మొదటి వరుసలో ఉంటుంది.
వేదిక నుంచి వెండితెరకు...
గుమ్మడి జన్మించింది గుంటూరు జిల్లా, రావికంపాడులో 1927 జూలై 9న. చదువుకొనే రోజుల్లోనే నాటకాలు ఆడడం, సినిమాలు పిచ్చిగా చూడడం ఆ పునాదిని పటిష్ఠం చేశాయి. రంగస్థలంపై దుర్యోధన పాత్రధారణ, దరిమిలా రంగస్థల దిగ్గజం మాధవపెద్ది వెంకట్రామయ్య పరిచయం-మార్గదర్శకత్వం ఆయన నటస్వరూపాన్నే మార్చేశాయి. తమిళనాడు టాకీస్ వారి ‘అదృష్టదీపుడు’ (1950) లో సేనాధిపతిగా విలన్ పాత్రతో గుమ్మడి సినిమా కెరీర్ ఆరంభమైంది. హీరోగా కన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దీర్ఘకాలిక భవిష్యత్తు ఉంటుందంటూ దర్శక – రచయిత గోపీచంద్ ఇచ్చిన సలహా కెరీర్‌నే మార్చేసింది. తొలి రోజుల్లో మాధవపెద్ది వారి మార్గం, అలాగే ఎస్వీరంగారావు బాణీలను కెమెరా ముందు అను సరించిన గుమ్మడి అనతికాలంలోనే తనదైన దోవ పట్టారు. సొంత శైలిని ఏర్పరచుకున్నారు. నిత్యం నవలలు చదవడం, ఇంగ్లీషు సినిమాలు చూడడం, నిశితమైన పరిశీలనా శక్తి ఆయన నిరంతర పురోగతికి దోహదపడ్డాయి.
చిన్నవయసులోనే పెద్దరికం!
చిన్నప్పుడే ‘రైతుబిడ్డ’ నాటకంలో ముసలి రైతు పాత్రతో వేదికనెక్కిన గుమ్మడి వెండితెర మీద కూడా చిన్న వయసులోనే పెద్ద వయసు పాత్రలు వేసేందుకు సరేనంటూ సాహసించారు. యాదృచ్ఛికంగా ఆ పెద్ద వయసు పాత్రలే ఆయన కెరీర్‌ను చివరి దాకా శాసించాయి. కేవలం 26 ఏళ్ళ వయసులోనే తనకన్నా పదేళ్ళు పెద్దదైన నటి శాంతకుమారి సరసన ‘అర్ధాంగి’ చిత్రంలో వృద్ధ జమీందారు వేషం వేయాల్సి వచ్చింది. అలాగే, మూడు పదుల చిల్లర వయసులోనే వృద్ధ పాత్ర అయిన టైటిల్ రోల్ వేసి, ‘మహామంత్రి తిమ్మరుసు’గా అందరినీ మెప్పించారు.
ఆయన ఎందుకంత స్పెషల్?!
నవరసాలలోనూ ఉత్తమమైనదిగా, ‘ఏకో రసః కరుణ ఏవ’ అంటారు. నిత్యం తండ్రి, తాత, అన్న, పెద్దమనిషి లాంటి పాత్రల ద్వారా వెండితెరపై కరుణ రసాన్ని పదేపదే పండించిన నటుడు గుమ్మడి. బహుశా, ఆయన సినీరంగ ప్రవేశం తర్వాత 1950ల నుంచి ఇప్పటి దాకా పరిశీలిస్తే, అలాంటి నటుడు మరొకరు తెలుగులో కనపడరు. పైగా, రకరకాల పాత్రలు ధరించి మెప్పించడం ఒక ఎత్తు. ఒకే రకం పాత్రల్ని పదే పదే పోషించాల్సి వచ్చినా, ప్రేక్షకు లకు విసుగనిపించకుండా ఒప్పించడం మరో ఎత్తు. కరుణ రసపూరిత తండ్రి పాత్రల వల్ల ‘గుండె జబ్బు గుమ్మడి’... అంటూ కొందరు వేళాకోళం చేసినా, ప్రతిసారీ ఏదో ఒక కొత్త విరుపుతో ఆ పాత్రకు మెరుపులద్దడం గుమ్మడికే సాధ్యమైన అభినయ రసవిద్య. అందుకే, ఆయనను మహానటుడు అనాలనేది. ఎప్పుడైనా ఆంగికం, వాచికం, ఆహార్యం... మూడూ సమపాళ్ళలో కలిస్తేనే అసలైన నటుడు. ఆ అభినయ వేదాన్ని నమ్మి ఆఖరుదాకా అక్షరాలా పాటించారు గుమ్మడి. చివరలో ఎప్పుడైతే పక్షవాతం వచ్చి తగ్గి, గాత్రానికి ఇబ్బందులెదురయ్యాయో స్వచ్ఛంద నట విరమణ చేసిన సినీ భీష్ముడు ఆయన.
తెలుగుతెర తిమ్మరుసు..
ఏ పాత్ర ఇచ్చినా వీలైనంత వరకు దాన్ని స్టడీ చేసి, ఆ పాత్ర స్వరూప స్వభావాలను అర్థం చేసుకొని, ఆవాహన చేసుకొని నటించడానికే ఆయన ఇష్టపడేవారు. అందుకే, గుమ్మడి పోషించినది చిన్న పాత్ర అయినా సరే, అది మన మనసులో నుంచి తొలగిపోదు. ఆయన సినీ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్ళున్నా కొన్నింటిని ఎప్పటికీ మర్చిపోలేం. ఉదాహరణకు, 1962లో గుమ్మడి నటనకు మచ్చుతునకలు... ‘కులగోత్రాలు’, ‘మహామంత్రి తిమ్మరుసు’, ‘సిరిసంపదలు’. ఆ 3 చిత్రాలూ కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు అందుకోవడం గమనార్హం. ‘మాయాబజార్’లో బలరాముడు, ‘వినాయకచవితి’లో సత్రాజిత్తు, ‘శ్రీవేంకటేశ్వర మాహాత్మ్యం’లో భృగుమహర్షి, ‘హరిశ్చంద్ర’లో విశ్వామిత్రుడు, ‘తారాశశాంకం’లో బృహస్పతి, ‘సతీ తులసి’లో జలంధరుడు, ‘సంపూర్ణ రామాయణం’లో దశరథుడు, ‘ఏకలవ్య’లో ద్రోణాచార్యుడు, ‘జ్యోతి’లో పడుచు జయసుధను పెళ్ళాడాల్సి వచ్చిన పెద్ద వయసు భర్త, ‘నెలవంక’లో మూఢనమ్మకాల జమీందారు, ‘మరోమలుపు’లో నిష్ఠాగరిష్ఠుడైన పూజారి, ‘ఈ చరిత్ర ఏ సిరాతో’లో చెప్పులు కుట్టేవాడు... ఇలా ఆయన సజీవంగా నిలిపిన పాత్రలు ఎన్నెన్నో.
అచ్చ తెలుగుదనం- అరుదైన స్నేహశీలం..
గుమ్మడి ఎంతటి స్నేహశీలి అంటే, సాయంత్రమైతే సన్నిహితులతో సరదాగా కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయాల్సిందే. సినారె, నేరెళ్ళ వేణుమాధవ్, మిక్కిలినేని, గుమ్మడి- ఈ నలుగురూ మంచి దోస్తులు.. ఎంత స్నేహితులంటే, “ఇష్ట దుష్టచతుష్టయం” అని సరదాగా తమను తాము అనుకొనేవారు. సమాజంలోనూ, సినీరంగంలోనూ గుమ్మడి అజాతశత్రువు. అంతేకాదు... చదువు, సంస్కారం, నటుడిగా ఎంతో ఎదిగినా ఎడతెగని సాహిత్య అధ్యయనం, ఎప్పుడూ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు వెళుతూ అంతర్జాతీయ సినిమాను పరి శీలించడం గుమ్మడిలోని అరుదైన సుగుణం. చిన్నప్పటి నుంచి తెల్లని పంచె, లాల్చీ ధరించడం అలవాటైన గుమ్మడి ఆఖరివరకు అదే రకమైన వస్త్రధారణతో అచ్చమైన తెలుగు దనానికి ప్రతీకగా నిలిచారు.
దటీజ్ గుమ్మడి!
మంచి నటులు చాలామంది ఉండవచ్చు. కానీ, మంచి మనుషులు కొందరే ఉంటారు. గుమ్మడి అలాంటి మంచి మనిషి. స్వాతిశయం లేని సంస్కారమూర్తి. మనసులో ఏదీ పెట్టుకోకుండా, మనసారా నవ్వేయగలగడం కూడా ఆయనలోని అరుదైన లక్షణం. ముని పాత్రలు పదే పదే వేయాల్సి రావడంపైనా ఛలోక్తి విసిరేవారు. “ఈ గడ్డాల వేషాలు ఎక్కువ వేసినవాళ్ళం నేను, నాగయ్య గారే. గడ్డాలు, మీసాలు అంటించడానికి మాకు అయినంత గమ్ ఖర్చు ఇంకెవరి మీదా అయ్యుండదు. మ్యాక్స్ ఫ్యాక్టర్ మేకప్ బ్రాండ్ వాళ్ళు బహుమానం ఇస్తే మాకే ఇవ్వాలి” అని నవ్వేసేవారు గుమ్మడి. తెలుగు విశ్వవిద్యాలయం ఒకానొక సందర్భంలో సాహిత్యం, కళలు, సాంస్కృతిక రంగాల్లోనే కాక సినిమా రంగంలోనూ గౌరవ డాక్టరేట్లు ఇవ్వాలనుకుంది. అప్పుడు మొట్టమొదటిసారిగా సినీ రంగంలో ఆ గౌరవం దక్కింది మహానటుడు గుమ్మడి గారికే. అదీ ఆయన ఘనత. నటనకు నంది అవార్డు, ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు సైతం ఆయనను వరించాయి. అంత గొప్పనటుడు, అధ్యయనశీలికి పద్మశ్రీ గౌరవం మాత్రం దక్కనేలేదు. అయితేనేం ఎస్వీఆర్, సావిత్రి లాంటి మహామహులకు ఏ పద్మశ్రీ ఉందని ఇవాళ్టికీ తెరపై చిరంజీవులుగా ఉన్నారు. గుమ్మడి కూడా అంతే! ఆ మహా నటుడికి శతజయంతి నివాళి.
(గుమ్మడి శతజయంతి సంవత్సర ఆరంభం సందర్భంగా)
- రెంటాల జయదేవ,
ప్రభుత్వ ‘నంది’, ‘గద్దర్’ అవార్డుల విజేత






