పట్టభద్రుడా.. నువ్వు అమ్ముడుపోకు!

by Ravi |   (  Updated:2025-02-14 00:45:18  IST  )

చదువుకున్న వ్యక్తులుగా, ఓటు పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన పట్టభద్రులుగా మనం రేపటి భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకోవలసిన అవసరం

పట్టభద్రుడా.. నువ్వు అమ్ముడుపోకు!
X

చదువుకున్న వ్యక్తులుగా, ఓటు పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన పట్టభద్రులుగా మనం రేపటి భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకోవలసిన అవసరం ఉంది. ఇప్పటి ఎన్నిక ఒక ఎమ్మెల్సీ స్థానం కోసమే అయినా ఓట్ల ప్రభావం శక్తివంతమైనది కాబట్టి ప్రజల తరుఫున గళమయ్యే శక్తిని, సబ్బండ వర్గాల ఆవేదనను అర్థం చేసుకునే వారిని కాకుండా.. ఇతరులను ఎన్నుకున్నా, నిర్లక్ష్యంగా ఓటు వేసినా చదువుకున్న మనకూ ఏ విలువ ఉండదనే సంగతిని మర్చిపోవద్దు. ఆశల్లో, నిండా ఆవేదనల్లో ఉన్న తెలంగాణాకు ఇప్పుడు పదునైన పట్టభద్రుడు కావాలి...

రాజకీయం.. ప్రజల కోసం ప్రజా ప్రతినిధి చేయాల్సిన గొప్ప సామాజిక బాధ్యత. కానీ ఇప్పుడు ఇది అధికారం, హోదా కోసమే అన్నట్లుగా మారిపోయింది. ప్రశ్నించలేని అమాయక పేదల ఓట్లతో గద్దెనెక్కడం, అధికారాన్ని అనుభవించడం ఆస్తులు కూడబెట్టుకోవడమే రాజకీయ నాయకుల లక్ష్యంగా మారిపోయింది. ఈ వ్యవహరం తరతరాలుగా కొనసాగుతూ వస్తున్నది. ఎన్నికల ముందు అద్భుతమైన ప్రసంగాలు, పేదోడిని గుండెలకు హత్తుకున్నా... అధికారంలోకి వచ్చిన తరువాత పేదోడి గుండెల మీద తన్నడం రాజకీయ నాయకులకు పరిపాటిగా మారిపోయింది. అయితే ఇందుకు ప్రజల తరుఫున ప్రశ్నించే గొంతుకలు లేకపోవడమూ ఓ రకంగా సమాజం వెనుకబాటుకు కారణం అవుతుందని చెప్పొచ్చు.

ప్రశ్నించే తత్వం ఉన్నా..

ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడిన యువశక్తి తెలంగాణాలో ఉంది. కానీ అనేక మంది వివిధ రాజకీయ పార్టీల పక్షాన నిలవడంతో ఇప్పుడు తెలంగాణాలో ప్రశ్నించేతత్వం రోజురోజుకూ కనుమరుగు అవుతూ వస్తుంది. అందుకే చదువుకున్న యువత దూరదృష్టితో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఓ వైపు రాజకీయ ప్రలోభాలతో రాజకీయ వ్యవస్థ పూర్తిగా పతనమవుతూ వస్తుంది. మరోవైపు అవినీతి కోరలు చాచుకొని పేదోడిని వెంటాడుతుంది. ఈ మధ్య రాష్ట్రంలో జరిగిన అనేక ఏసీబీ దాడుల్లో చిన్న స్థాయి ఉద్యోగి నుంచి అడిషనల్ కలెక్టర్ దాకా పట్టుబడిన వారు ఉన్నారంటే రాజకీయ వ్యవస్థ ఎంత స్తబ్దుగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ చదువుకున్న యువత స్వతంత్రంగా రాజకీయ వ్యవస్థను కాపాడే శక్తిలా ఎదగలేకపోతున్నారు. రాజకీయ ప్రలోభాల మాయలో పడి.. సమాజ విచ్చిన్నానికి పట్టభద్రుడు కారణం అవుతున్నాడు. అటువంటి విచ్చిన్నకరమైన శక్తులను, అవినీతి వ్యవస్థను అడ్డుకోవడానికి పట్టభద్రులు పదునైన ప్రశ్నించే గొంతుకలుగా ప్రజల తరుఫున నిలబడాలి.

సమస్యలున్నా..

గ్రూప్-1 పరీక్షను ప్రభుత్వం నిర్వహించడం కోసం జీఓ -29 తీసుకురావడంతో అనేక మంది నిరుద్యోగులు, గ్రూప్-1 మెయిన్స్‌కి అర్హత సాధించిన అభ్యర్థులు తమ పొట్టకొట్టొద్దని వివిధ రాజకీయ నాయకులను కలవడంతో పాటు... కోర్టుకు వెళ్లారు ఎన్ని చేసినా మెయిన్స్ పరీక్షలు జరిగాయి. అయితే ఈ అంశంపై కొందరు కాంగ్రెస్ నాయకులు అభ్యర్థులకు మద్దతు తెలిపినా.. గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయారు. అలాగే ఈడబ్ల్యూఎస్ కోటాతో బీసీ అభ్యర్థులు, ఎస్సీ అభ్యర్థులు సైతం అవకాశాలకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ ప్రభుత్వం వాటిపై పూర్తిగా సమీక్షించే పరిస్థితి లేదు. ఇక ఎస్సీ వర్గీకరణ అమలులోని జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ దక్కలేదు. ఫలితంగా అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్న మాదిగ, ఉపకులాలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇటువంటి అనేక రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తీవ్రమైన అసమానతలు ఉన్నప్పటికీ ప్రజల తరుఫున, సమాజం పక్షాన నిలిచే గొంతులు తక్కువగానే ఉన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని శాసన మండలిలో సంఖ్యాబలం కోసం పట్టభద్రున్ని కూడా ప్రశ్నించకుండా మార్చేస్తున్నాయి.

నిర్లక్ష్య ధోరణి విడిచిపెట్టి..

గతంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అనేక మంది పట్టభద్రులు నిర్లక్ష్యంగా ఓట్లు వేయడం చూస్తే సమాజం పట్ల వారికి ఉన్న అస్పష్టతను తెలియజేస్తుంది. ఆ ఎన్నికల్లో వేల సంఖ్యలో ఓట్లు చెల్లకుండా మారిపోయాయి‌. అంతటి నిర్లక్ష్య ధోరణిలో పట్టభద్రులు ఉన్నారు. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సమీపిస్తోంది. దాదాపు 42 నియోజకవర్గాల్లోని పట్టభద్రులు ఓ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే ఆయా ప్రధా‌న పార్టీలు ఇప్పటి నుంచే ఓట్ల కోసం ఓట్ల నమోదుతోనే పట్టభద్రులను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు ఈ పట్టభద్రుల ఓట్లతో అధికారం కోసం ఆరాటపడుతున్నారు. ఇటువంటి సమయంలో ఇప్పుడు తెలంగాణలో ప్రతీ పట్టభద్రుడు తెలంగాణ సమాజం పక్షాన ఆలోచించాల్సిన అవసరం ఉంది‌. ప్రశ్నించే గళాలుగా ప్రజల తరుఫున స్వతంత్ర శక్తిగా నిలవకుండా రాజకీయ ప్రలోభాలకు పట్టభద్రుడు అమ్ముడుపోతే ఈ సమాజం మరింత అంధకారంలోకి వెళ్లే పరిస్థితి ఉంటుంది. సమాజం తెలిసిన వ్యక్తిగా చట్టసభల్లో మన ఆవేదనలకు రూపాన్ని ఇచ్చే వ్యక్తుల వెంట పట్టభద్రులు అంతా ప్రశ్నించే గళాలుగా తెలంగాణ సమాజం కోసం ఆయుధంగా నిలబడాల్సిన అవసరం ఉంది.

- సంపత్ గడ్డం,

78933 03516

Next Story