సూపర్ సిక్స్.. సూపర్ హిట్‌కు బాట...!!

by Ravi |   (  Updated:2025-09-09 01:00:17  IST  )

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు వినగానే ప్రజల్లో ఒక నమ్మకం, భరోసా కలుగుతుంది. సూపర్ సిక్స్‌తో‌

సూపర్ సిక్స్.. సూపర్ హిట్‌కు బాట...!!
X

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు వినగానే ప్రజల్లో ఒక నమ్మకం, భరోసా కలుగుతుంది. సూపర్ సిక్స్‌తో‌ సూపర్ హిట్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపిన శక్తి ఆయనిది. గత అయిదేళ్ల వైసీపీ ఆర్ధిక విధ్వంసంతో కుదేలైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తూ అభివృద్ధి సంక్షేమం సమపాలళ్లలో రాష్ట్ర ప్రజలకు అందించిన పరిపాలన దక్షుడు నారా చంద్రబాబు నాయుడు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకే మాట ఒకే బాటగా కొనసాగుతూ ప్రజలకు మేలు చేసేలా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి సూపర్ హిట్ సాధించారు. దీపం పథకం, మెగా డీ‌ఎస్సీ, తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అమలు చేసిన కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొగడకుండా ఉండలేకపోతున్నారు.

సూపర్ సిక్స్‌ సభతో కొత్త అధ్యాయం..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతినెలా పెన్షన్ ఇచ్చేందుకు ఏదో ఒక పేద కుటుంబాన్ని ఎంచుకోవడం, ప్రజల నడుమే తిరగడం, సూపర్ సిక్స్ పథకాలు అమలుతో ప్రజల్లో మరో ఇరవై ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలనే కోరిక పెరిగిపోయింది. సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ ద్వారా నవ్యాంధ్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలు కాబోతున్నది. అనంతపురం వేదికగా సెప్టెంబర్ 10న నిర్వహించనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ‌సభ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టం కానుంది. ఈ సభ ద్వారా కూటమి ప్రభుత్వం తమ 15 నెలల పాలనలో సాధించిన విజయాలను ప్రజల ముందుంచనుంది. సాధారణంగా ఎన్నికల ముందు పార్టీలు తమ హామీల గురించి చెప్తాయి. కానీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తమ పాలనా విధానాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు చెప్పడం అరుదు. అలాంటి అరుదైన అవకాశం ఈ సభ ద్వారా ప్రజలకు దక్కనుంది.

సుపరిపాలన దిశగా ఏపీ

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఆర్ధికంగా అనేక సవాళ్ల‌ను ఎదుర్కొంది. అప్పుల భారం, గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల సంక్షేమ పథకాల అమలులో కొన్ని అడ్డంకులు ఎదురైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఉన్న పరిపాలన అనుభవంతో వాటిని అధిగమించగలిగారు. ఆయన మొక్కవోని పట్టుదల అంకిత భావం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే తత్వం వల్లే సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయనే చెప్పాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యతనిచ్చి సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్‌ను తీసుకు వెళ్లగలిగారు. గత అయిదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు తగ్గిపోయాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంపై నమ్మకం పెరిగింది.

అప్పుల కుప్ప నుంచి బయటపడేసి..

వైసీపీ పాలనలో అయిదేళ్లలో రూ. 2 లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాలకు వెచ్చించామని గొప్పలు చెప్పు కోవడం మినహా ఆచరణలో శూన్యం. అందుకే ప్రజలు కీలెరిగి వాతపెట్టినట్టుగా 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. గత పాలకులు చేసిన విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారింది. వ్యవస్ధలు ధ్వంసమయ్యాయి. అవినీతి అక్రమాలతో రాబడి కుంటుపడింది. పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు పారిపోయాయి. ఏపీ రహదార్ల గురించి పొరుగు రాష్ట్రాల్లోను హేళనగా మాట్లాడిన దుస్ధితి. అనేక ఆర్ధిక సవాళ్లున్నా ఊహించని స్ధాయిలో సంక్షేమం అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు నాయుడు సంకల్పించారు.

15 నెలల్లో సంక్షేమానికి లక్ష కోట్లు

చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మాటలు తక్కువ చేతలు ఎక్కువుగా చేసి చూపింది. కేవలం 15 నెలల్లో ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి రూ. లక్ష కోట్లకు పైగా వ్యయం చేసిదంటే రాష్ట్ర ప్రగతి పట్ల కూటమి సర్కార్‌కు ఉన్న చిత్త శుద్దికి నిదర్శనం. సుపరిపాలన పెట్టుబడులకు భరోసా అనే నినాదం ఎన్నో సత్ఫలితాలను సాధించింది. మళ్లీ నవ్యాంధ్రకు అంతర్జాతీయ స్ధాయిలో ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమైంది.

ఇది రాజకీయ సభ కాదు..

అనంతపురం సభ కేవలం ఒక రాజకీయ సమావేశం కాదు. ఇది రాష్ట్ర పునరుద్దరణకు అభివృద్ధికి, సుపరిపాలనకు సంకేతంగా నిలవనుంది. సాధారణంగా కూటమి ప్రభుత్వంలోని పార్టీల మధ్య సమన్వయం లోపించవచ్చని చాలా మంది భావిస్తారు. కానీ ఈ అనంతపురం సభ ద్వారా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఏకతాటిపై ఉన్నాయని చాటి చెప్పబోతున్నారు. రాష్ట్రాభివృద్ధి పట్ల తన చిత్తశుద్ధి, నిబద్దతను చాటుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల ప్రశంసలకు ఈ బహిరంగ సభ వేదిక కానుంది. ఏ మాత్రం చిన్నపాటి పొరపొచ్చాలు లేకుండా కూటమి సర్కారు పాలన కొనసాగిస్తోంది. కలిసి వచ్చాం.. కలిసి గెలిచాం.. కలిసి పని చేస్తాం.. ఇక భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం అనే రీతిలో ఓ బలమైన సంకేతానికి సూపర్ సిక్స్ సూపర్ హిట్ వేదిక సూచికగా నిలవనుంది.

(రేపు సూపర్ సిక్స్..సూపర్ హిట్ సభ సందర్భంగా)

-వాసంశెట్టి సుభాష్

కార్మికశాఖ మంత్రి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Next Story