- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ నిర్లక్ష్యం.. విద్యార్థులపై భారం!
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల పెండింగ్ కారణంగా ఉన్నత విద్య అల్లకల్లోలంగా మారింది. ప్రైవేటు కళాశాలలు నేరుగా విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకునేలా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు, ప్రభుత్వ వైఫల్యం, పేద విద్యార్థుల భవిష్యత్తుపై దీని ప్రభావంపై విశ్లేషణ.

ఇటీవల రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సంవత్సరాలుగా చెల్లించకపో వడంతో విద్యార్థులు, విద్యాసంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.. ఫలితంగా ప్రైవేటు కళాశాలలు నేరుగా విద్యార్థుల నుంచే ట్యూషన్ ఫీజులు వసూలు చేయడం ప్రారంభించాయి. ఫీజు చెల్లించలేని విద్యార్థుల నుండి బాండ్ అఫిడవిట్లు తీసుకుని, సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధించే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ప్రైవేట్ సంస్థలు కోర్టును ఆశ్రయించడంతో..
ఈ బకాయిలు సరిగ్గా విడుదల చేయకపోవడంతో ప్రభుత్వ కళాశాలలు సైతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. చిన్న ప్రైవేటు విద్యాసంస్థలు వడ్డీలకు అప్పులు తెచ్చుకొని నిర్వహణ సాగిస్తున్నాయి. ఇదే సమయంలో, ప్రభుత్వ జీవోల ప్రకారం విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయరాదనే నిబంధనల కారణంగా ప్రైవేటు కళాశాలలు తమ కార్యకలాపాలను కొనసాగించలేకపోతున్నామని ఇటీవలే కోర్టును ఆశ్రయించి విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకునే అనుమతిని ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశాయి. అయితే ప్రభుత్వం తరఫున కౌంటర్ అఫిడవిట్ సమర్పణలో జాప్యం జరగడం, పలుమార్లు అవకాశం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో, కోర్టు పిటిషనర్ల అభ్యర్థనను మధ్యంతర చర్యగా ఆమోదించింది. ఈ ఆదేశాలు 2026–27 విద్యా సంవ త్సరానికి వర్తించనున్నాయి. ఈ నెల 30లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి మరో అవకాశం ఇచ్చింది.
లాభాపేక్ష ఉండకూడదనే సూత్రాన్ని విస్మరించి..
అయితే ఈ జాప్యం ప్రభుత్వ వైఖరిపై అనుమానాలు కలిగిస్తోంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తే, ఒకవైపు ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల్లో చేరేందుకు ప్రోత్సహిస్తూనే, మరోవైపు తగిన ఆర్థిక మద్దతు అందించడంలో విఫలమవుతోంది. గ్లోబలైజేషన్, మార్కెటీకరణ ప్రభావంతో విద్య, వైద్యం వంటి సేవా రంగాల నుండి ప్రభుత్వం క్రమంగా వైదొలుగుతోంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు తగిన మౌలిక సదుపాయాలు, సిబ్బంది లేకపోవడం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. అదే సమయంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు భారీ ఫీజులు వసూలు చేస్తూ, విద్యను పేదలకు అందకుండా చేస్తున్నాయి. విద్యారంగం లాభాపేక్షకు లోబడి ఉండకూడదనే సూత్రాన్ని ‘మోడ్రన్ డెంటల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ & ఇతరులు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర -2009’ కేసు స్పష్టం చేసినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడిదారులు విద్యను వ్యాపారంగా మార్చేశారు.. ఇటీవల హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు కూడా ఈ ధోరణికి చట్టబద్ధత కల్పిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కోర్టు జోక్యం చేసుకోవాలి!
గతంలో విద్యార్థి సంఘాలు, కళాశాల యాజమాన్యాలు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కొంత మేర నిధులు విడుదల చేసింది. అయితే అవి మొత్తం బకాయిలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ప్రతీ విద్యా సంవత్సరం పూర్తయ్యేలోపు మొత్తం ఫీజులను విడుదల చేసే విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉచిత ఉన్నత విద్యను అందిస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. దీనిని అన్ని ప్రభుత్వాలు అమలు చేసేలా చట్టబద్ధత కల్పించాలి. అలాగే కోర్టు సైతం మాండమస్ రిట్ (ప్రభుత్వ సంస్థలు తమ బాధ్యతలను నిర్వర్తించేందుకు కోర్టు ఇచ్చే ఆదేశం) జారీ చేసి పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, భవిష్యత్తులో ఈ సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిన అవసరం ఉంది. లేకపోతే, సామర్థ్యం లేని పేదలకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతోంది.
-స్టాలిన్
ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షులు
74164 20830






