- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లంచాల మోజులో ప్రభుత్వ ఉద్యోగులు..
ప్రభుత్వ ఉద్యోగులు సేవా ధర్మాన్ని విస్మరించి లంచాల మోజులో పడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఏసీబీ దాడులు, అవినీతి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజా సేవలో నైతిక విలువలు, బాధ్యతలు, పారదర్శకత అవసరం.

తమకు అందుతున్న వేతనాలు, రకరకాల అలవెన్సుల సొమ్ముకు యజమానులైన పౌరులనే లంచాల కోసం పీడిస్తున్నామనే కనీస సోయి, స్పృహ, సున్నితత్వం రానురానూ ప్రభుత్వ ఉద్యోగుల్లో మరింత లోపించడం అత్యంత విషాదం, శోచనీయం. ఉద్యోగం కోసం ఎంతో ఉబలాటపడుతుంటారు. తీరా ఉద్యోగం వచ్చాక లంచాలకై ఉద్యమ తరహా పంథా ఎంచుకొంటారు. ఉద్యోగ బాధ్యత, ధర్మంగా పౌరులకు సేవ చేయాలన్న స్ఫూర్తిని తమంతట తామే చిదిమేస్తున్నారు.
మనో వేగంతో అక్రమ సంపాదన..
రెవెన్యూ, పోలీసు, విద్యుత్ అనే ఈ శాఖ ఆ విభాగం అని కాదు, ప్రజా అవసరాల డిపార్ట్‌మెంట్లలో ఈ తరహా ఆఫీసర్లు, సిబ్బంది చాలానే మోపయ్యారు. సర్వీసులో చేరిన కొన్నాళ్ళకే ఆమ్యామ్యాలపై మోజు పెంచుకుంటున్నారు. సీనియారిటీలో మధ్యమ స్థాయికి వచ్చీ రాకముందే ఇక రేపో మాపో రిటైర్మెంట్ ఉందన్నంత మనో వేగంతో అక్రమ సంపాదన మీద పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల అవినీతి చాలా వరకు అంతమవుతుందని పాలకులు నమ్మించారే కానీ, వాస్తవంలో, అనుభవంలో మరింత పెరిగిపోతున్నది. ప్రభుత్వాల విధాన నిర్ణయాలు లంచాల ఆపేక్షను ఏ మాత్రం నిరుత్సాహ పరచలేకపోతున్నాయి.
తరతరాలకు చాలినంత కూడబెట్టాలనే యావ..
సగటు మనుషుల జీవన స్థితిగతులతో పోల్చి చూస్తే, ఠంచనుగా వచ్చే జీత భత్యాలతో అలవోకగా సరిపెట్టుకునే సౌలభ్యం ప్రభుత్వ ఉద్యోగులకు సొంతం. అలాంటిది టాప్ రేంజ్‌లో విలాసవంతమైన, హైఎండ్ స్థాయిలో సుకుమా రమైన, తరతరాలకు చాలినంత కూడబెట్టాలనే ఆగమాగపు అత్యాశపరుల్లో ఏసీబీకి దొరికే వారు కొందరే. తెలంగాణలో ఈ మధ్య కాలంలో సగటున రోజుకు ఒకరు చొప్పున అవినీతి నిరోధక శాఖ వలలో పడుతున్నట్టు ఒక అంచనా. ఆరు నెలల క్రితం నాటి గణాంకాల ప్రకారం గత నవంబర్‌కు ముందు అయిదేళ్ల కాలంలో ఏసీబీకి పట్టుబడిన ఆఫీసర్లు, ఉద్యోగులు 621 మంది. ఏసీబీ ఇటీవలి పట్టివేతల్లో తిమింగలాల స్థిర చరాస్తులు వందలాది కోట్ల రూపాయల విలువైనవే కావడం ప్రస్తావనార్హం. ఒక్కో సందర్భంలో ఒక్కో అధికారి లక్షలాది రూపాయల లంచాల డబ్బుతోనే చిక్కుతున్నారు. ఏకంగా రూ.30 లక్షల లంచంలో రూ. 2 లక్షల అడ్వాన్స్ (తొలి విడత సమర్పణ) నోట్ల కట్టలతో శామీర్ పేట తహసీల్దార్ ఏసీబీకి దొరికిపోవడం ఇందుకు తాజా కొనసాగింపు.
విర్రవీగుడు, తలదించుకునుడు దేనికి?
యువతీ యువకులైన వారు, 40 - 50 ఏళ్ల మధ్య వయసున్న వారు, సర్వీసు ఇంకా 15 - 25 ఏళ్ళు ఉన్న వారూ లంచాల యావలో పడుతున్నారు. ఆ అవాంఛనీయ తత్వం, మతిలేని ఒరవడిలో పడిపోతూ ఎదుటి వారి పట్ల కనీస జాలి, దయా గుణం, ఉద్యోగ బాధ్యత, ధర్మాన్ని చిన్న బుచ్చుతున్నారు. డబ్బులు ఇస్తేనే పని చేస్తామన్నట్టుగా మొద్దుబారి పోతున్నారు. అప్పటిదాకా తెగ గంభీరత, పొగరు తరహా వాలకం ప్రదర్శించే అధికారులు తీరా అవినీతి నిరోధక శాఖ వలలో పడ్డాక తలదించుకుంటున్నారు. ఒక చోట ఎవరైనా ఆఫీసరు ఏసీబీకి పట్టుబడితే చుట్టు పక్కల జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో ఇతర అధికారులు కనీసం ఒక పూటైనా తమకు తాముగా లంచాల మేతలో నిగ్రహం పాటించడం లేదని రాష్ట్రంలో ఒక్కోసారి ఒక్క దినమే ఇద్దరు ముగ్గురు దొరకడం రుజువు చేస్తున్నది.
తలెత్తుకుని పనిచేయడం మరిచి..!
నిజానికి ఒకసారి ఏసీబీ కేసు నమోదు అయితే గనక సర్వీస్ బుక్ / రిజిస్టరులో ఆ మచ్చ పడుతుంది. కాకపోతే, ప్రభుత్వం నుంచి విధిగా ప్రాసిక్యూషన్ అనుమతి వచ్చాకే చార్జిషీటు దాఖలుకు వీలవుతుంది. అందుకు, కేసు కొలిక్కి వచ్చేందుకు ఏళ్లు పడుతుంది. సస్పెన్షన్ నుంచి ఆ లోగా తిరిగి విధుల్లో చేరుతారు. ఇదీ వారికి ఒకింత దీమా. తమ విధి నిర్వహణలో జీరో లంచాలు, జీరో నిర్లక్ష్యం, జీరో ఉదా శీనత గల ఉద్యోగులు, అధికారులే గర్వంగా తలెత్తుకొనేలా పని చేస్తారు. లంచాల తలంపును నిరుత్సాహపరిచే చర్యలకు తోడు అక్రమార్జన స్వభావం నరనరాన పుణికిపుచ్చుకున్న బాపతుల్లో పరివర్తన వస్తేనే అవినీతి పీడ ఎంతోకొంత విరగడ వుతుంది. ఆ మేరకు ప్రజలకు రిలీఫ్ కలుగుతుంది.
- ఇల్లెందుల దుర్గాప్రసాద్
94408 50384






