అక్షర యోధులకు ఆదరణేదీ?

by Ravi |   (  Updated:2022-09-14 18:30:21  IST  )

ఏ ప్రజా ఉద్యమమైనా బాహ్య ప్రపంచంలోకి వచ్చి పూర్తిస్థాయిలో విజయవంతం అయ్యిందంటే అందులో ప్రధాన భూమిక పోషించింది మీడియానే

అక్షర యోధులకు ఆదరణేదీ?
X

కష్టమైనా, నష్టమైనా మీడియాలోనే ఉంటూ బతుకు బండిని లాగుతున్నారు. జిల్లాలో అనేక చోట్ల ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. కొన్ని కబ్జాకు గురయ్యాయి. కబ్జాకు గురైన స్థలాలను క్రమబద్ధీకరించిన ప్రభుత్వం, జర్నలిస్టులకు మాత్రం స్థలాలు కేటాయించలేకపోతోంది. వారిచ్చిన ఆరోగ్య భద్రతా కార్డులు సైతం అన్ని ఆసుపత్రిలలో చెల్లవు. దీంతో పాలకులకు జర్నలిస్టులపై ఎంత చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతోంది. ఇప్పటికైనా మీడియాలో పనిచేసే అర్హులైన జర్నలిస్టులను గుర్తించి ఇంటి స్థలాలు కేటాయించి జర్నలిస్టులను ఆదుకోవాలి. మేడ్చల్ జిల్లా కేంద్రంలో ప్రెస్‌క్లబ్ భవనాన్నీ నిర్మించాలని కోరుతున్నాం.

ప్రజా ఉద్యమమైనా బాహ్య ప్రపంచంలోకి వచ్చి పూర్తిస్థాయిలో విజయవంతం అయ్యిందంటే అందులో ప్రధాన భూమిక పోషించింది మీడియానే. 1969 నాటి తెలంగాణ తొలిదశ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు అనేక పోరాటాలు విజయవంతం కావడానికి మీడియా చేసిన కృషి అమోఘం. కనుమరుగవుతున్న తెలంగాణ ఉద్యమాన్ని వెలుగులోకి తీసుకువచ్చి జవసత్వాలు నింపడంలో మీడియాలో పని చేసే తెలంగాణ ప్రాంత ప్రతినిధులు చేసిన కృషి మరువలేనిది. సీమాంధ్ర కబంధ హస్తాలలో ఉన్న మీడియాలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష తెలియజేయడం కోసం జర్నలిస్టులు తమ ఉద్యోగాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి. అయినా, కుటుంబ పోషణ కంటే ఆత్మగౌరవానికి ప్రాధాన్యమిచ్చి వార్తలు రాశారు. కొంతమంది తమ ఉద్యోగాలను సైతం కోల్పోయారు. ఇవన్నీ పాలకులకు తెలియనివా?

ఊపర్ షేర్వానీ అందర్ పరేషానీ

2014లో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఉద్యమ సమయంలో ఎల్‌బీ స్టేడియంలో జరిగిన 'జర్నలిస్టు గర్జన' సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచిన జర్నలిస్టుల సమస్యలన్నింటినీ రాష్ట్రం రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అర్హులకు అక్రెడిటేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు ఇస్తామని అన్నారు. ఇవే హామీలను 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. 'ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఇక మన కష్టాలను తీరుతాయని' అనుకున్న జర్నలిస్టుల పరిస్థితి ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో మరింత దయనీయంగా మారింది.మేనిఫెస్టోలో పెట్టిన హామీలే కాకుండా ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పే పాలకులు నిత్యం ప్రజా సేవలో ఉంటూ ఇటు ప్రభుత్వానికి అటూ ప్రజలకు వారధిగా ఉంటున్న మీడియా ప్రతినిధులపై వివక్ష ఎందుకు చూపుతున్నారో అర్థం కావడం లేదు.

'మీడియా ప్రతినిధులంటే సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతారు. వారికి సమాజంలో ఒక గౌరవం ఉందనేది' నాణేనికి ఒక వైపు మాత్రమే. రెండోవైపు మీడియా సంస్థలు జీతాలు ఇవ్వడంలో వైఫల్యం, టార్గెట్ పూర్తి కావడానికి పడే పాట్లు, పాలకుల వివక్ష ఇలాంటి అనేక సమస్యల కారణంగా వారి ఆరోగ్యం గాలిలో దీపంగా మారింది. చివరకు కుటుంబం గడవక అప్పుల పాలవడం, ఆరోగ్య సమస్యలతో అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాం. సమాజంలో జరిగే ఇలాంటి సంఘటనలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టుల కుటుంబాలకు నష్టం జరిగితే మాత్రం ఎవరూ పట్టించుకోరు. అందుకే జర్నలిస్టుల జీవితాలు 'ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ'లాగా మారాయి.

యాజమాన్యాలు పట్టించుకోక

యావత్ ప్రజానీకాన్ని కకావికలం చేసిన కరోనా జర్నలిస్టుల జీవితాలను సైతం నాశనం చేసింది. అసలే జీతాలు లేక దిన దిన గండంగా నెట్టుకొచ్చే కంట్రిబ్యూటర్ల పరిస్థితి ఆ సమయంలో దయనీయంగా మారింది. లాక్‌డౌన్ కారణంగా ఎటువంటి ఆదాయ మార్గాలు లేక విలేకరుల కుటుంబాలు విలవిలలాడాయి. మీడియాలో జీతాలు పొందేవారు కొంత ఉపశమనం పొందినా, మండల విలేకరులు, కమీషన్ బేస్డ్‌గా పనిచేసే పాత్రికేయుల కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. అక్కడక్కడ కొందరు దాతలు చేయూతనిచ్చినా మీడియా యాజమాన్యాలు మాత్రం పట్టించుకోలేదు. విలేకరులు వార్తలు సేకరించి పంపితేనే ప్రచురించే సంస్థలు, యాజమాన్యాలు కరోనా కాలంలో 'మీరెవరో మాకు తెలియదు' అన్న చందంగా చేతులెత్తేశాయి. కరోనా బారిన పడి చికిత్స చేయించుకోలేక పదుల సంఖ్యలో పాత్రికేయులు పిట్టల్లా రాలిపోవడం ఆ కుటుంబాలలో తీరని వేదన మిగిల్చింది.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో అక్రెడిటేషన్ కలిగిన జర్నలిస్టులు సుమారు 1,500 మంది ఉన్నారు. కష్టమైనా, నష్టమైనా మీడియాలోనే ఉంటూ బతుకు బండిని లాగుతున్నారు. జిల్లాలో అనేక చోట్ల ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. కొన్ని కబ్జాకు గురయ్యాయి. కబ్జాకు గురైన స్థలాలను క్రమబద్ధీకరించిన ప్రభుత్వం, జర్నలిస్టులకు మాత్రం స్థలాలు కేటాయించలేక పోతుంది. వారిచ్చిన ఆరోగ్య భద్రతా కార్డులు సైతం అన్ని ఆసుపత్రిలలో చెల్లవు. దీంతో పాలకులకు జర్నలిస్టులపై ఎంత చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతోంది. ఇప్పటికైనా మీడియాలో పనిచేసే అర్హులైన జర్నలిస్టులను గుర్తించి ఇంటి స్థలాలు కేటాయించి జర్నలిస్టులను ఆదుకోవాలి. మేడ్చల్ జిల్లా కేంద్రంలో ప్రెస్‌క్లబ్ భవనాన్నీ నిర్మించాలని కోరుతున్నాం.


కల్కూరి ఎల్లయ్య

సీనియర్ జర్నలిస్ట్

మేడిపల్లి, 81791 90156

Next Story