Gotti Koya Go Back: అడవుల్లో పెరుగుతున్న ఆదివాసీ వైరుధ్యం

by Ravi |   (  Updated:2026-05-24 01:01:17  IST  )

ములుగు అడవుల్లో గొత్తికోయలపై వినిపిస్తున్న ‘గో బ్యాక్’ నినాదం వెనుక ఉన్న చారిత్రక, సామాజిక, రాజకీయ వాస్తవాలపై విశ్లేషణ. ఆదివాసీ హక్కులు, అటవీ పరిరక్షణ, వలసలు, ప్రభుత్వ వైఖరిపై సమగ్ర చర్చ.

Gotti Koya Go Back: అడవుల్లో పెరుగుతున్న ఆదివాసీ వైరుధ్యం
X

ములుగు జిల్లా మంగపేట మండలంలోని అడవి ప్రాంతాల్లో నివసిస్తున్న గొత్తికోయలపై ఇటీవల ‘గో బ్యాక్’ అనే నినాదం వినిపించడం కేవలం ఒక స్థానిక వివాదం కాదు.. ఇది భారతదేశంలో ఆదివాసీ హక్కులు, అటవీ పరిరక్షణ, అంతర్గత వలసలు, భద్రతా రాజకీయాలు, అభివృద్ధి నమూనా వంటి అనేక సంక్లిష్ట అంశాలను బయటపెడుతున్నది.

ఒకవైపు స్థానిక ఆదివాసీ సంఘాలు, అటవీ అధికారులు ‘అడవులను కాపాడాలి’ అనే పేరుతో గొత్తికోయలను తిరిగి ఛత్తీస్‌గఢ్ పంపాలని డిమాండ్ చేస్తుండగా, మరోవైపు మానవ హక్కుల దృక్పథం నుండి చూస్తే ఇది నిరాశ్రయులైన ఆదివాసులపై పెరుగుతున్న సామాజిక వేరుచూపు రూపంగా కనిపిస్తోంది. అందువల్ల ఈ ప్రశ్నను భావో ద్వేగంతో కాకుండా విమర్శనాత్మక సామాజిక అవగాహనతో పరిశీలించాల్సిన అవసరం ఉంది.

గొత్తికోయల వలస - ఒక చారిత్రక నేపథ్యం!

గొత్తికోయలు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ అటవీ ప్రాంతాలకు చెందిన ఆదివాసీ సమూహం. 2005 తర్వాత అక్కడ సల్వా జుడుం పేరుతో సాగిన ప్రభుత్వ మద్దతు గల మిలీషియా చర్యలు, మావోయిస్టు-ప్రభుత్వ ఘర్షణలు వేలాది ఆదివాసీల జీవితాలను ఛిన్నాభిన్నం చేశాయి. గ్రామాల దహనం, బలవంతపు పునరావాసం, ఎన్‌కౌంటర్లు, అరెస్టులు, భయాందోళనలు కారణంగా అనేక కుటుంబాలు తెలంగాణ అడవుల్లోకి వలస వచ్చాయి. అందువల్ల గొత్తికోయలు ‘అవకాశాల కోసం వచ్చిన వలసదారులు’ మాత్రమే కాదు. రాజకీయ-సైనిక ఘర్షణల వల్ల జీవనాధారాన్ని కోల్పోయిన అంతర్గత నిరాశ్రయులు. ఈ చరిత్రను పక్కనపెట్టి వారిని కేవలం ‘అడవి ఆక్రమణ దారులు’గా చిత్రీకరించడం వాస్తవాన్ని సగం మాత్రమే చూడటం అవుతుంది.

‘గో బ్యాక్’ నినాదం ఎందుకు?

ఆ ప్రాంతంలో స్థానికంగా వినిపిస్తున్న ప్రధాన వాదన ఏమిటంటే, గొత్తికోయలు కొత్తగా అడవులను నరికి పోడు సాగు విస్తరిస్తున్నారు, అటవీ సంపదకు నష్టం కలుగుతోంది, వన్యప్రాణులపై ప్రభావం పడుతోంది, స్థానిక కోయ, నాయకపోడు వంటి ఆదివాసీల భూహక్కులపై ఒత్తిడి పెరుగుతోందని. ఈ ఆరోపణలను పూర్తిగా కొట్టి పారేయలేం. నియంత్రణలేని పోడు విస్తరణ పర్యావరణ సమస్యలకు దారి తీస్తుందనేది వాస్తవమే. అయితే ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అడవులను నాశనం చేస్తున్న శక్తులలో కేవలం పేద ఆదివాసులే ఉన్నారా? లేక మైనింగ్ కంపెనీలు, భారీ ప్రాజెక్టులు, రోడ్లు, కార్పొరేట్ అటవీ వినియోగం కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయా? భారతదేశంలో వేల ఎకరాల అడవులను పరిశ్రమలకు కేటాయించినప్పుడు పెద్దగా ‘గో బ్యాక్’ నినాదాలు వినిపించవు. కానీ జీవనోపాధి కోసం అడవిలో చిన్న భూమి సాగు చేసే ఆదివాసులపై మాత్రం తీవ్ర విమర్శలు కేంద్రీకృతమవుతాయి. ఇది అధికార వర్గాల రాజకీయ దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తుంది.

ఆదివాసీ ప్రజల మధ్య వైరుధ్యంగా..

ఈ సమస్యలో అత్యంత ఆందోళనకర అంశం ఏమిటంటే, ఇది ఇప్పుడు స్థానిక ఆదివాసులు, వలస ఆదివాసుల మధ్య ఘర్షణ రూపం దాల్చుతోంది. రాష్ట్రం, భద్రతా రాజకీయాలు, అటవీ విధానాలు సృష్టించిన సమస్య చివరకు రెండు పేద ఆదివాసీ వర్గాల మధ్య వైరుధ్యంగా మారుతోంది. అసలు సమస్య భూమి పంపిణీ అసమానత, అటవీ హక్కుల అమలులో వైఫల్యం, జీవనోపాధి సంక్షోభం, పునరావాస విధానాలు లేకపోవడం. కానీ చర్చ మాత్రం ‘వాళ్లు బయటి వాళ్లు’ అనే దిశగా మళ్లుతోంది. ఇది ప్రమాదకర పరిణామం. ఇది ఆదివాసీ ఐక్యతను బలహీనపరుస్తుంది. చరిత్రలో ఎన్నోసార్లు అధికార వర్గాలు.. పేదల మధ్య అంతర్గత విభజనలను పెంచి అసలు నిర్మాణాత్మక సమస్యల నుండి దృష్టి మళ్లించాయి. ఇప్పుడు కూడా అదే ప్రమాదం కనిపిస్తోంది.

ప్రభుత్వ ద్వంద్వ వైఖరి..

ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి కూడా విరుద్ధంగా కనిపిస్తోంది. ఒకవైపు గొత్తికోయలను అక్రమ ఆక్రమణ దారులని అంటున్నారు. మరోవైపు వారికి ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు, రేషన్ సౌకర్యాలు, రైతుబంధు నిధులు, భూ రికార్డుల్లో నమోదులు ఉన్నాయి. అంటే ఎన్నికల సమయంలో వారిని పౌరులుగా గుర్తించడం, తర్వాత అడవుల విషయంలో ‘అక్రమ వలసదారులు’గా చూపిం చడం రాజకీయ ప్రయోజనాధారిత వైఖరిని సూచిస్తోంది. ఇది కేవలం పరిపాలనా విరుద్ధత మాత్రమే కాదు. భారతీయ ప్రజాస్వామ్యంలో అట్టడుగు వర్గాల పట్ల అధికార వ్యవస్థ ఎలా ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తుందో కూడా తెలియజేస్తుంది.

‘శాంతి వచ్చింది’ అంటే ఏమిటి?

మావోయిస్టు ప్రభావం తగ్గిందని, ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో శాంతి నెలకొన్నందున గొత్తికోయలు తిరిగి వెళ్లాలని కొందరు వాదిస్తున్నారు.. కానీ తుపాకీ శబ్దాలు తగ్గి పోవడం మాత్రమే ‘శాంతి’ కాదు. నిజమైన శాంతి అంటే భూమి హక్కుల భరోసా, గౌరవప్రదమైన జీవితం, భద్రత, ఆరోగ్యం, విద్య, జీవనోపాధి అవకాశాలు ఉండాలి. ఇవి లేకుండా “ఘర్ వాపసీ” నినాదం కేవలం పరిపాలనా పరిష్కారంగా మాత్రమే మిగిలిపోతుంది. అదే విధంగా, పదహా రేళ్లుగా ఒక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ఒక్కసారిగా ‘తిరిగి వెళ్లండి’ అని చెప్పడం మానవీయమైన పరిష్కారం కాదు. వారి పిల్లలు ఇక్కడే పెరిగారు. సామాజిక సంబంధాలు ఏర్పడ్డాయి. జీవనాధారం ఇక్కడే ఏర్పడింది. ఈ వాస్తవాలను విస్మరించి సమస్యను కేవలం ‘అక్రమ ఆక్రమణ’ కోణంలో చూడడం సరైన దారి కాదు.

సమస్యను ఎలా అర్థం చేసుకోవాలి?

అందుకే ‘గొత్తికోయలు గో బ్యాక్’ అనే నినాదాన్ని రెండు కోణాల్లో అర్థం చేసుకోవాలి. ఒకవైపు స్థానిక ప్రజలు అడవుల నాశనం, భూముల ఒత్తిడి, జీవనాధారాల సంక్షోభంపై ఆందోళన చెందడం సహజం. ఈ భావనను పూర్తిగా తిరస్కరించడం సరైంది కాదు. మరోవైపు గొత్తి కోయల వలసకు కారణమైన చరిత్ర, రాష్ట్ర హింస, అభివృద్ధి నమూనా, అటవీ విధానాల వైఫల్యాన్ని కూడా గుర్తించాలి. లేకపోతే సమస్య మూల కారణాలు కనిపించవు. ‘గో బ్యాక్’ నినాదం ఒక భావోద్వేగ ప్రతిస్పందన కావచ్చు. కానీ అది సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. గొత్తికోయల సమస్యను మానవ హక్కులు, పర్యావరణ సమతుల్యత, స్థానిక ఆది వాసుల హక్కులు, అటవీ సంరక్షణ, అంతర్గత వలసల చరిత్ర ఈ అన్నింటినీ కలిపి చూడాల్సిన అవసరం ఉంది. లేకపోతే పేద ఆదివాసుల మధ్య ఘర్షణలు పెరుగుతాయి. కానీ అసలు సమస్యలు భూమి, అటవీ పాలన, అభివృద్ధి అసమానతలు, రాష్ట్ర వైఫల్యాలు అలాగే మిగిలిపోతాయి.

- జంపన్న

డెమొక్రటిక్ సోషలిస్ట్

733 076 5204

Next Story